Gummalaksmipuram
-
వైభవంగా కందికొత్తల పండగ
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): గిరిజనులు ఏటా ప్రతిష్టాత్మకంగా చేపట్టే కందికొత్తల పండగను ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహిస్తున్నారు. సంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గుమ్మలక్ష్మీపురంలో గిరిజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, యువజన సంఘాల ఆధ్వర్యాన ఉత్సవం సందడిగా సాగింది. గుమ్మలక్ష్మీపురంలోని హైస్కూల్ గ్రౌండ్లో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల గ్రామాల నుంచి వేలాదిమంది గిరిజనులు తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా గిరిజనులు గ్రామదేవతలైన గొడ్డాలమ్మలు, చత్తరమ్మలను తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజన సాంప్రదాయం ప్రకారం డప్పులు, ఇతర వాయిద్యాల మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా కందికొత్తల థింసా నృత్యాలు చేశారు. అలాగే బృందాలుగా ఏర్పడి హైస్కూల గ్రౌండ్ నుంచి ఎల్విన్‌పేట మీదుగా గుమ్మలక్ష్మీపురం వరకు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో నృత్య ప్రదర్శనలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. గిరిజనులంతా ఐక్యమత్యంగా చేసిన నృత్యాలు కనువిందు చేశాయి. ఈ ఉత్సవాల్లో బదిలీపై వెళ్లిన ఆర్డీఓ బి సుదర్శనదొరతోపాటు స్థానిక గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండంగి రమణ, నాగభూషణరావు, నిమ్మక శేఖర్, ఆరిక సూర్యనారాయణ, చలపతిరావు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గిరిజనుల ఐక్యతకు ప్రతిగా కందికొత్తల పండుగ నిలుస్తుందన్నారు. ఈ పండగ సందర్భంగా ఏటా ఏజెన్సీకి కేంద్ర బిందువుగా ఉన్న గుమ్మలక్ష్మీపురానికి అన్ని గ్రామాల గిరిజనులంతా అధిక సంఖ్యలో తరలివచ్చి కందికొత్తల ఉత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తద్వారా మరుగున పడిపోతున్న తమ సాంప్రదాయాన్ని భావితరాలకు తెలియజేస్తున్నామని గిరిజనులు తెలిపారు. కందికొత్తల ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎల్విన్‌పేట పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో... కురుపాం: కందికొత్తల పండగను మండలంలోని గొటివాడ గ్రామంలో గిరిజనులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మొదటిగా పండిన పంటలను గొడ్డలతమ్మ వద్దకు తీసుకొచ్చి నైవేధ్యంగా సమర్పించారు. అనంతరం గొడ్డలమ్మతల్లిని మేళతాళాలతో ఊరేగించారు. అందరూ ధింసా నృత్యాన్ని ప్రదర్శించి ఉత్సాహంగా గడిపారు. ఈ పండగలో గ్రామపెద్దలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే జగన్ ధ్యేయం
గుమ్మలక్ష్మీపురం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మండలంలోని ఎల్విన్‌పేట పంచాయతీ రేగులపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా రేగులపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఎన్నో రకాల హామీలిచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని వైఎస్సార్ నాటి సంక్షేమ పాలన అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తూ నవరత్నాలు వంటి ప్రజా సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విధ్యుత్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులైజేషన్, 45 ఏళ్లకే వృధ్యాఫ్యఫింఛన్లు, ఉచిత విద్య వంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి తీసుకువస్తారన్నారు. అనంతరం అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమైతే ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలనైనా భరించేందుకు జగన్మోహన్ రెడ్డి ముందుకొస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను లిఖిత పూర్వకంగా స్వీకరించి, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కుంబురుక దీనమయ్య, వైస్ ఎంపీపీ బిడ్డిక చంద్రమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యుడు గోరిశెట్టి గిరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి నిమ్మక వెంటకరావు, నాయకులు కె.నాగేశ్వరరావు, మాధవరావు, వైస్ సర్పంచ్ బిడ్డిక రాడిమ్మి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లింట విషాదం
♦ శుభలేఖలు పంచి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం ♦ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి ♦ శోకసంద్రంలో కుటుంబసభ్యులు మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడిని మృత్యువు కాటేసింది. రోడ్డు కల్వర్టు రూపంలో ప్రాణాలు తీసింది. పెళ్లింట విషాదాన్ని నింపింది. గుమ్మలక్ష్మీపురం: బొబ్బిలి మండలం రామన్నదొర వలస గ్రామానికి చెందిన కొర్లాపు రాజుకు ఈ నెల 28న సాలూరు మండలం బోర్లబంద గ్రామానికి చెందిన ఓ యువతితో పెద్దలు పెళ్లి నిర్ణయించారు. అదే ముహూర్తంలో రాజు చెల్లెలు వరలక్ష్మికి మామ వరుస అయ్యే మామిడి చిన్న అనే వ్యక్తితో పెళ్లి నిర్ణయించారు. ఇద్దరి పెళ్లికి ఆహ్వానించేందుకు కురుపాం మండలంలోని మొండెంఖల్లు, జి.శివడ గ్రామాల్లోని బంధువుల ఇళ్లకు చెల్లికి కాబోయే భర్త మామిడి చిన్నాతో కలిసి బైక్‌పై రాజు ఆదివారం బయలుదేరాడు. పెళ్లి శుభలేఖలు అందజేశారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా మార్గంమధ్యలోని పి.ఆమిటి జంక్షన్‌కు ముందున్న రోడ్డు మలుపువద్ద ఉన్న కల్వర్టు గొయ్యిలో బండి దిగడంతో ఇద్దరూ కిందపడ్డారు. వెనుక కూర్చున్న రాజు తలకు బలమైన గాయం కావడంతో కుప్పకూలిపోయాడు. ఆ వాహనం నడుపుతున్న చిన్నాకు కొద్దిపాటి గాయాలయ్యాయి. చిన్నా అందించిన సమాచారం మేరకు స్థానికుల సహాయంతో రాజును కురుపాం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కురుపాం పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని కురుపాం ఎస్ఐ బాలాజీరావు, ఎల్విన్‌పేట ఎస్ఐ కె.కిరణ్ కుమార్ నాయుడు సందర్శించారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. కురుపాం ఆసుపత్రిలో శవపంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం రాజు మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో విషాదం... మరో ఐదు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన రాజు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లి సింహాచలమ్మ, తండ్రి అప్పారావుతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. అందరితో కలివిడిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న యువకుడు మృతితో స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెంచిపోషిస్తాడనుకున్న కుమారుడు మృతితో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరమూ కావడంలేదు. గ్రామస్తులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని కన్నీరు కార్చారు. -
ఇంటికి వెళ్తూ గిరిజనుడి మృతి
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని తాడికొండ పంచాయతీ గిరిశిఖర తోట గ్రామానికి చెందిన తోయక గిర్పా (30) అనే గిరిజనుడు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్తూ మార్గమధ్యలోనే మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి భద్రగిరి పీహెచ్సీ ఇన్చార్జి వైద్యాధికారి అనిల్‌కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నారుు. గిర్పా జ్వరంతో బాధపడుతూ ఆర్ఎంపీ సాయంతో బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చాడు. వస్తూనే మలేరియూ టెస్ట్ చేయించుకుని ఆ స్లైడ్‌తో సహా ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది గిర్పాకు వైద్యసేవలందించి ఇంటికి పంపించివేశారు. కోర్సు పూర్తరుున తర్వాత తిరిగి రావాలని సూచించడంతో గిర్పా స్వగ్రామానికి వెళ్లేందుకు ట్రక్కర్ ఎక్కాడు. వాహనం కొత్తగూడకు చేరుకునే సరికి గిర్పా టక్కర్‌లోనే కన్నుమూశాడు. మృతుడికి భార్య డుంబమ్మ, ఇద్దరు పిల్లలున్నారు. -
‘మేం టీడీపీలో చేరలేదు’
గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురంలో సర్పంచ్ల సంఘ సమావేశం ఉందని తమను తీసుకువెళ్లారని, ఎవరినీ కలవనీయకుండా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ కండువాలు కప్పేశారని కానీ తాము టీడీపీలో చేరలేదని గుమ్మలక్ష్మీపురం మండలంలోని వంగర, కొండవాడ పంచాయతీలకు చెందిన వైఎస్ఆర్ సీపీ సర్పంచ్‌లు పత్తిక సుకటమ్మ, తాడంగి రాధమ్మలు ప్రకటించారు. ఈ మేరకు శనివారం వారు వత్తాడ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. తాము టీడీపీలో చేరినట్లు ఓ పత్రికలో (సాక్షి కాదు) శనివారం ప్రకటన వచ్చిందని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్వతీపురంలో సమావేశం ఉందని చెప్పి కారులో తీసుకువెళ్లారని, మిగతా సర్పంచ్‌లు ఎక్కడున్నారని అడిగితే, వారంతా వేరే కార్లో వస్తున్నారని చెప్పారని, పార్వతీపురంలో తమకు బలవంతంగా తెలుగుదేశం కండువాలను వేశారని వివరించారు. ఇది నీచమైన చర్య అని వారన్నారు. టీడీపీ నాయకులు ఇలాంటి చర్యలను ఇక నుంచైనా మానుకోవాలని హితవు పలికారు. -
ఏజెన్సీలో ముమ్మర తనిఖీలు
కురుపాం: ఏజెన్సీలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మాజిల్లాలో సోమవారం సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపిన సంఘటనలో 13 మంది జవాన్లు మృతి చెందిన సంఘటన విదితమే. ఈ నేపథ్యంలో ఒడిశా సరిహద్దు మండలాలైన కురుపాం, కొమరాడ పోలీసులు అప్రమత్తమై మంగళవారం విస్త్రత తనిఖీలు నిర్వహించారు. ఏజెన్సీ ముఖ ద్వారమైన కురుపాం మండల కేంద్రంలో ఎస్సై ఎన్.అశోక చక్రవర్తి పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేసి అపరిచిత వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. గుమ్మలక్ష్మీపురంలో.. మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో మంగళవారం ఎల్విన్‌పేట పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్ ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ ఐ.గోపి ఆధ్వర్యంలో పలు ప్రధాన జంక్షన్ల వద్ద ఎల్విన్‌పేట సీఆర్పీఎఫ్,సివిల్ పోలీసులు వాహన తనిఖీలు చేశారు. పార్వతీపురం,కురుపాం,ఒడిశా తదితర ప్రాంతాలనుంచి రాకపోకలు సాగించే వాహనాలను నిలుపుదల చేసి క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపించినా వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.