గుమ్మలక్ష్మీపురం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మండలంలోని ఎల్విన్‌పేట పంచాయతీ రేగులపాడు గ్రామంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా రేగులపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఎన్నో రకాల హామీలిచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని వైఎస్సార్ నాటి సంక్షేమ పాలన అందించాలనే ఉద్దేశంతో జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తూ నవరత్నాలు వంటి ప్రజా సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విధ్యుత్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులైజేషన్, 45 ఏళ్లకే వృధ్యాఫ్యఫింఛన్లు, ఉచిత విద్య వంటి సంక్షేమ పథకాలు జగన్‌మోహన్ రెడ్డి తీసుకువస్తారన్నారు.
అనంతరం అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమైతే ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలనైనా భరించేందుకు జగన్‌మోహన్ రెడ్డి ముందుకొస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను లిఖిత పూర్వకంగా స్వీకరించి, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కుంబురుక దీనమయ్య, వైస్ ఎంపీపీ బిడ్డిక చంద్రమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యుడు గోరిశెట్టి గిరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి నిమ్మక వెంటకరావు, నాయకులు కె.నాగేశ్వరరావు, మాధవరావు, వైస్ సర్పంచ్ బిడ్డిక రాడిమ్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment