ఎమ్మెల్యే వాహనంలో తరలించిన క్షతగాత్రులు, పక్కన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
కురుపాం: గుమ్మలక్ష్మీపురం మండలం మండ – పి ఆమిటి జం„క్షన్ మధ్యలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు బలంగా ఢీ కొట్టడంతో అందులో ప్రయాణికులు పది మంది తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
బాధితులు అందించిన వివరాల్లోకి వెళ్తే...కురుపాం నుంచి గుమ్మలక్ష్మీపురం, గుమ్మలక్ష్మీపురం నుంచి కురుపాం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోల్లో ఒక ఆటోకు చెందిన డ్రైవర్ సీటు విరిగిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టుకున్నాయి.
ఈ ప్రమాదంలో రెండు ఆటోల్లో ప్రయాణిస్తున్న జి.శివడకు చెందిన కడ్రక మాధవి అనే అంగన్‌వాడీ కార్యకర్తతో పాటు తులసివలస గ్రామానికి చెందిన డి.అశోక్, ఆయన భార్య డి.కల్పన, అద్వానంగూడకు చెందిన ఆరిక దేవ తీవ్రంగా గాయపడ్డారు.
వీరితో పాటు ఆవిరి గ్రామానికి చెందిన బిడ్డిక నాగేశ్వరరావు, ఆయన కుమారుడు బిడ్డిక విజయ్, బొద్దిడి గ్రామానికి చెందిన మండంగి మంగు గాయపడ్డారు. వీరిని 108లో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.మెరుగైన వైద్య సేవలు కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి కొందరిని తరలించారు. గుమ్మలక్ష్మీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
గుమ్మలక్ష్మీపురం మండలానికి పరామర్శకు వెళ్లి తిరిగి వస్తున్న కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మార్గమధ్యలో ప్రమాదం జరిగి రోడ్డుపైన పడి ఉన్న క్షతగాత్రులను చూసి చలించిపోయారు.
108లో కొంతమందిని ఆస్పత్రికి తరలించగా, కొందరిని తన వాహనంలోనే ఎక్కించి నేరుగా కురుపాం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన చికిత్స అందించే వరకు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంపై ఆరా తీసి మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైతే ఇతర ఆస్పత్రులకు తరలించాలని వైద్యులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment