Gunaratne
-
శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ
గాలే: భారత్ తో టెస్టు సిరీస్ లో తొలిరోజే శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. లంక క్రికెటర్ అసేల గుణరత్నే ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడి పోయిన లంక ప్లేయర్ బాధతోనే మైదానం నుంచి డ్రెస్సింగ్ రూముకు వెళ్లిపోయాడు. భారత్ తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా గాలేలో జరుగుతున్న తొలిటెస్టులో 14వ ఓవర్ లహిరు కుమారా బౌలింగ్ చేశాడు. అయితే ఆ ఓవర్లో చివరి బంతిని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ షాట్ ఆడగా సెకండ్ స్లిప్ లో ఉన్న గుణరత్నే క్యాచ్ పట్టేందుకు ఎడమవైపు డైవ్ చేశాడు. బంతి గుణరత్నే ఎడమచేతి బొటనవేలికి తాకుతూ వెళ్లడంతో ధావన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ లంక ప్లేయర్ మాత్రం నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఫిజయో వచ్చి పరీక్షించి చివరికి డ్రెస్సింగ్ రూముకు తీసుకెళ్లారు. మణికట్టును కదిలిస్తూ గుణరత్నే బాధతో మైదానాన్ని వీడాడు. ఔట్ నుంచి బయటపడ్డ ధావన్ మాత్రం లంక బౌలర్లపై చెలరేగిపోయి 110 బంతుల్లో శతకం సాధించాడు. అయితే డబుల్ సెంచరీకి చేరువవుతున్న సమయంలో (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) ప్రదీప్ బౌలింగ్ లో రెండో వికెట్ గా ఔటయ్యాడు. లంక జట్టులో గుణరత్నే మంచి ఆల్ రౌండర్. ఇటీవల జింబాబ్వేతో జరిగిన చివరి టెస్టులో 80 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన గుణరత్నే టెస్టు చరిత్రలోనే లంక జట్టు అత్యుత్తమ ఛేదనలో భాగస్వామి అయ్యాడు. అసలే సాధారణంగా ఉన్న లంక జట్టుకు కీలక ఆటగాడు గుణరత్నే గాయపడటం ప్రతికూలాంశమే. -
మరో పరాభవం తప్పదనుకున్నాం.. కానీ!
రికార్డు ఛేదనపై లంక క్రికెటర్ గుణరత్నే హర్షం కొలంబో: అంచనాలకు అందని రీతిలో సంచలన ఆటతీరును ప్రదర్శించి శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 3–2తో దక్కించుకున్న జింబాబ్వే చేతిలో ఆ జట్టు మరో పరాభవాన్ని తప్పించుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. జింబాబ్వేకు వన్డే సిరీస్ ను కోల్పోయిన లంకేయులు ఏకైక టెస్టులో 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. జట్టు కష్ట సమయంలో క్రీజులోకొచ్చిన గుణరత్నే(151 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు)తో కలిసి డిక్వెల్లా(118 బంతుల్లో 81; 6 ఫోర్లు) ఇన్నింగ్స్ ను నిర్మించి విజయానికి బాటలు వేశాడు. ఈ విజయంపై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో గుణరత్నే హర్షం వ్యక్తం చేశాడు. '203 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయాం. విజయానికి మరో 185 పరుగులు కావాలి. వన్డే సిరీస్ లాగ మరో పరాభవం తప్పదనిపించింది. అయితే భారీ ఇన్నింగ్స్ లు అలవాటు లేకున్నా డిక్ వెల్లా నాకు స్ఫూర్తిగా నిలిచాడు. డిక్ వెల్లా ప్లాన్ వల్లే గెలుస్తామనుకున్న జింబాబ్వేకు దిమ్మతిరిగింది. తరచుగా డిక్వెల్లా తన వద్దకు వచ్చి మాట్లాడమన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో చెప్పడానికి సలహాలు ఇవ్వమంటూనే పరుగులు చేసేందుకు అవకాశం ఇవ్వమన్నాడు. లక్ష్యాన్ని త్వరగా చేరుకునే క్రమంలో జింబాబ్వేపై డిక్ వెల్లా ఒత్తిడి పెంచాడు. 121 పరుగుల కీలక భాగస్వామ్యం అనంతరం డిక్ వెల్లా ఔటయ్యాక దిల్ రువాన్ పెరీరాతో జట్టును విజయతీరాలకు చేర్చడం మరిచిపోలేని అనుభూతి అని' గుణరత్నే వెల్లడించాడు. ఆసియాలో ఇతే అత్యుత్తమ ఛేదన కావడంతో పాటు ఓవరాల్ గా టెస్టుల్లో ఐదో అత్యుతమ ఛేదనను లంక తమ ఖాతాలో వేసుకుంది. గతంలో 2006లో దక్షిణాఫ్రికాపై 352 పరుగుల ఛేదనే ఇప్పటిదాకా లంక రికార్డు ఛేదనగా ఉండేది. మరోవైపు 11 వికెట్లు తీసిన లంక స్పిన్నర్ హెరాత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. -
శ్రీలంక రికార్డు ఛేదన
♦ ఏకైక టెస్టులో జింబాబ్వేపై విజయం ♦ రాణించిన డిక్వెల్లా, గుణరత్నే కొలంబో: సొంతగడ్డపై శ్రీలంక జట్టు అద్భుతమైన విజయం అందుకుంది. జింబాబ్వేపై 388 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన లంక తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. డిక్వెల్లా (118 బంతుల్లో 81; 6 ఫోర్లు), గుణరత్నే (151 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు) వీరోచిత పోరాటంతో... మంగళవారం ముగిసిన ఈ టెస్టులో ఆతిథ్య జట్టు నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. ఓవర్‌నైట్ స్కోరు 170/3తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక 114.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 391 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. టెస్టుల్లో శ్రీలంకకు ఇదే అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన. అలాగే ఆసియాలో ఇదే అత్యుత్తమం కావడం విశేషం. ఓవరాల్‌గా టెస్టుల్లో ఐదో అత్యుత్తమ ఛేదన. 2006లో దక్షిణాఫ్రికాపై 352 పరుగుల ఛేదనే ఇప్పటిదాకా లంక అత్యుత్తమంగా ఉంది. అంతకుముందు డిక్వెల్లా, గుణరత్నే మధ్య ఆరో వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యం ఏర్పడటంతో జట్టు నిలబడింది. డిక్వెల్లా అవుటైన తర్వాత ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గుణరత్నే జట్టు బాధ్యతను తీసుకున్నాడు. దిల్రువాన్ పెరీరాతో కలిసి అజేయంగా ఏడో వికెట్‌కు 67 పరుగులు జత చేశాడు. క్రెమెర్‌కు నాలుగు, విలియమ్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. 11 వికెట్లు తీసిన లంక స్పిన్నర్ హెరాత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. సంక్షిప్త స్కోర్లు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్: 356; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 346; జింబాబ్వే రెండో ఇన్నింగ్స్: 377; శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 391/6 (114.5 ఓవర్లలో) (కరుణరత్నే 49, కుశాల్ మెండిస్ 66, డిక్వెల్లా 81, గుణరత్నే 80 నాటౌట్, దిల్రువాన్ పెరీరా 29 నాటౌట్, క్రెమెర్ 4/150, సీన్ విలియమ్స్ 2/146).