శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ
గాలే: భారత్ తో టెస్టు సిరీస్ లో తొలిరోజే శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. లంక క్రికెటర్ అసేల గుణరత్నే ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడి పోయిన లంక ప్లేయర్ బాధతోనే మైదానం నుంచి డ్రెస్సింగ్ రూముకు వెళ్లిపోయాడు. భారత్ తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా గాలేలో జరుగుతున్న తొలిటెస్టులో 14వ ఓవర్ లహిరు కుమారా బౌలింగ్ చేశాడు. అయితే ఆ ఓవర్లో చివరి బంతిని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ షాట్ ఆడగా సెకండ్ స్లిప్ లో ఉన్న గుణరత్నే క్యాచ్ పట్టేందుకు ఎడమవైపు డైవ్ చేశాడు.
బంతి గుణరత్నే ఎడమచేతి బొటనవేలికి తాకుతూ వెళ్లడంతో ధావన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ లంక ప్లేయర్ మాత్రం నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఫిజయో వచ్చి పరీక్షించి చివరికి డ్రెస్సింగ్ రూముకు తీసుకెళ్లారు. మణికట్టును కదిలిస్తూ గుణరత్నే బాధతో మైదానాన్ని వీడాడు. ఔట్ నుంచి బయటపడ్డ ధావన్ మాత్రం లంక బౌలర్లపై చెలరేగిపోయి 110 బంతుల్లో శతకం సాధించాడు. అయితే డబుల్ సెంచరీకి చేరువవుతున్న సమయంలో (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) ప్రదీప్ బౌలింగ్ లో రెండో వికెట్ గా ఔటయ్యాడు. లంక జట్టులో గుణరత్నే మంచి ఆల్ రౌండర్. ఇటీవల జింబాబ్వేతో జరిగిన చివరి టెస్టులో 80 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన గుణరత్నే టెస్టు చరిత్రలోనే లంక జట్టు అత్యుత్తమ ఛేదనలో భాగస్వామి అయ్యాడు. అసలే సాధారణంగా ఉన్న లంక జట్టుకు కీలక ఆటగాడు గుణరత్నే గాయపడటం ప్రతికూలాంశమే.