ధావన్ మెరుపు ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీ మిస్
గాలే: శ్రీలంకతో గాలేలో జరగుతున్న తొలిటెస్టులో భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే తనకు అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. ఇన్నింగ్స్ 55వ ఓవర్లో లంక బౌలర్ ప్రదీప్ తన తొలి బంతికి ధావన్ ను ఔట్ చేసి లంకకు ఊరట కలిగించాడు. ధావన్ ముందుకొచ్చి మిడాఫ్ దిశగా షాట్ ఆడగా ఆ స్థానంలో ఉన్న మాథ్యూస్ క్యాచ్ పట్టడంతో ధావన్ భారీ ఇన్నింగ్స్ కు తెరపడింది. రెండో వికెట్ కు చతేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీ (75 నాటౌట్)తో కలిసి 283 బంతుల్లోనే 253 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించిన అనంతరం నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఓపెనర్ ముకుంద్ (12) వికెట్ ను త్వరగా కోల్పోయింది. ప్రదీప్ బౌలింగ్ లో ముకుంద్ ఆడిన బంతిని కీపర్ డిక్ వెల్లా క్యాచ్ అందుకోవడంతో ఔటయ్యాడు. తనకు వచ్చిన అవకాశాన్ని ముకుంద్ వినియోగించుకోలేక పోయాడు. మరోవైపు క్రీజులోకొచ్చిన పుజారాతో కలిసి ధావన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 29 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ ప్రమాదాన్ని తప్పించుకున్న ధావన్ 110 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. సెంచరీ తర్వాత ఫోర్లతో ధావన్ చెలరేగిపోయాడు. అయితే టీ సెషన్ వెళ్లేముందు ఓవర్లో ఔటయ్యాడు. ప్రదీప్ బౌలింగ్ లో మిడాఫ్ దిశగా షాట్ ఆడగా మాథ్యూస్ క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. ధావన్ ఔటైన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకొచ్చాడు. భారత్ 55 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది.