ధావన్ అరుదైన ఘనత
పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ సాధించాడు. తద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంక గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రెండో భారత బ్యాట్స్మెన్ గా వీరేంద్ర సెహ్వాగ్, చటేశ్వర్ పుజారాలతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇది ధావన్ కు శ్రీలంక గడ్డపై మూడో సెంచరీ కాగా, ఈ సిరీస్ లో రెండో సెంచరీ. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ధావన్ శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఓవరాల్ గా ఇది ధావన్ కెరీర్ లో ఆరో టెస్టు సెంచరీ.
ఈ మ్యాచ్ లో 105 బంతుల్లో 15 ఫోర్లు సాయంతో ధావన్ శతకం సాధించాడు. తొలుత హాఫ్ సెంచరీ పూర్తి చేయడానికి 45 బంతులు ఎదుర్కొని దూకుడుగా ప్రదర్శించిన ధావన్.. రెండో హాఫ్ సెంచరీని చేసే సమయంలో కొద్ది నెమ్మదిగా ఆడాడు. ఇది ధావన్ టెస్టు కెరీర్ లో ఆరో సెంచరీ కాగా, ఈ సిరీస్ లో రెండో సెంచరీ.
మూడో టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్-కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను నిలకడగా ఆరంభించారు. ఈ జంట తొలి వికెట్ కు 188 పరుగులు సాధించిన తరువాత కేఎల్ రాహుల్(85;135 బంతుల్లో 8 ఫోర్లు) అవుటయ్యాడు. ఆపై ధావన్ కు చటేశ్వర పుజారా జత కలిశాడు. ఇద్దరు కలిసి కుదురుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే ధావన్ సెంచరీ సాధించాడు. ఇది శ్రీలంక గడ్డపై ధావన్ కు మూడో సెంచరీ. సచిన్ టెండూల్కర్ ఐదు సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు.