ఒకవేళ నేను ఆడకపోతే..: ధావన్
దంబుల్లా:శ్రీలంక పర్యటనలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో రెండు సెంచరీలతో మెరిసిన ధావన్.. తొలి వన్డేలో సైతం శతకం నమోదు చేశాడు. 90 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 132 పరుగులు చేసి భారత్ భారీ విజయంలో పాలుపంచుకున్నాడు. అయితే తన మెరుగైన ప్రదర్శనకు కారణం గతం నేర్పిన పాఠాలే అంటున్నాడు.
'కెరీర్ లో చూసిన ఫెయిల్యూర్స్ నాకు చాలా పాఠాలు నేర్పాయి. ఎలా ఆడితే జట్టులో స్థానం ఉంటుంది అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టేలా చేసాయి వైఫల్యాలు. నేను మెరుగ్గా ఆడటమే నా ముందన్న లక్ష్యం. ఎందుచేత అంటే.. నా సైడ్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోతే జట్టులో చోటు కష్టం. మా జట్టులో పోటీ ఎక్కువగా ఉంది. ఒకవేళ నేను సరిగా ఆడని పక్షంలో నా స్థానాన్ని వేరే వాళ్లు భర్తీ చేయడం ఖాయం. వైఫల్యాల నుంచి నేను ఎక్కువగా నేర్చుకుని తిరిగి గాడిలో పడటం నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నా'అని ధావన్ అన్నాడు. అయితే చేదు అనుభవాల్ని ఎదుర్కొన్న గతం గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నాడు. తన ఫామ్ ను కొనసాగించి జట్టుకు ఉపయోగపడటంపైనే దృష్టి సారించినట్లు ధావన్ పేర్కొన్నాడు.