శ్రీలంక రికార్డు ఛేదన
♦ ఏకైక టెస్టులో జింబాబ్వేపై విజయం
♦ రాణించిన డిక్‌వెల్లా, గుణరత్నే
కొలంబో: సొంతగడ్డపై శ్రీలంక జట్టు అద్భుతమైన విజయం అందుకుంది. జింబాబ్వేపై 388 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన లంక తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. డిక్‌వెల్లా (118 బంతుల్లో 81; 6 ఫోర్లు), గుణరత్నే (151 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు) వీరోచిత పోరాటంతో... మంగళవారం ముగిసిన ఈ టెస్టులో ఆతిథ్య జట్టు నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. ఓవర్‌నైట్ స్కోరు 170/3తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక 114.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 391 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. టెస్టుల్లో శ్రీలంకకు ఇదే అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన.
అలాగే ఆసియాలో ఇదే అత్యుత్తమం కావడం విశేషం. ఓవరాల్‌గా టెస్టుల్లో ఐదో అత్యుత్తమ ఛేదన. 2006లో దక్షిణాఫ్రికాపై 352 పరుగుల ఛేదనే ఇప్పటిదాకా లంక అత్యుత్తమంగా ఉంది. అంతకుముందు డిక్‌వెల్లా, గుణరత్నే మధ్య ఆరో వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యం ఏర్పడటంతో జట్టు నిలబడింది. డిక్‌వెల్లా అవుటైన తర్వాత ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గుణరత్నే జట్టు బాధ్యతను తీసుకున్నాడు. దిల్‌రువాన్ పెరీరాతో కలిసి అజేయంగా ఏడో వికెట్‌కు 67 పరుగులు జత చేశాడు. క్రెమెర్‌కు నాలుగు, విలియమ్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. 11 వికెట్లు తీసిన లంక స్పిన్నర్ హెరాత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే తొలి ఇన్నింగ్స్: 356; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 346; జింబాబ్వే రెండో ఇన్నింగ్స్: 377; శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 391/6 (114.5 ఓవర్లలో) (కరుణరత్నే 49, కుశాల్ మెండిస్ 66, డిక్‌వెల్లా 81, గుణరత్నే 80 నాటౌట్, దిల్‌రువాన్ పెరీరా 29 నాటౌట్, క్రెమెర్ 4/150, సీన్ విలియమ్స్ 2/146).