10వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాం
భూదాన్‌పోచంపల్లి : అన్యాక్రాంతమైన 10వేల ఎకరాల భూదాన భూములను కబ్జాదారుల చెరనుంచి విడిపించి ప్రభుత్వానికి అప్పగించామని ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞబోర్డు చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినోబాభావే కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య వినోబాభావే దేశవ్యాప్తంగా పర్యటించి ప్రేమ, అహింసా పద్ధతుల ద్వారా 44లక్షల ఎకరాల భూమిని సేకరించి పేదలకు పంచిపెట్టారని గుర్తు చేశారు.
ఇలాంటి ఉద్యమం ప్రపంచంలో మరెక్కడా జరగలేదని పేర్కొన్నారు. భూదాన భూములను బడాబాబులు కబ్జా చేస్తే కోర్టుల ద్వారా వాటికి విముక్తి కల్పించామన్నారు. భూదాన యజ్ఞ బోర్డు ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భూదాన భూముల అన్యాక్రాంతంపై తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 1. 66లక్షల ఎకరాల భూదాన భూముల వివరాలన్నింటినీ కంప్యూటరీకరించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తడక లత, వినోబాభావే సేవా సమితి నాయకులు ఏలే భిక్షపతి, కొయ్యడ నర్సింహ, వేశాల మురళి, కర్నాటి అంజమ్మ, ఎస్. సత్యనారాయణ, వార్డు సభ్యులు మెర్గు పాండు, గుండు శ్రీరాములు, బోడ రమాదేవి, సంగెం లలిత, పెద్దల జయమాల, నాయకులు కుక్క బిక్షపతి, భాగ్యమ్మ, ఇ. అంజమ్మ, జగతయ్య తదితరులు పాల్గొన్నారు.