gupta nidhulu
-
గుట్టుగా గుప్తనిధుల తవ్వకాలు.. ఆపేవారే లేరు!
లింగాల: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల పరిసర ప్రాంతాల్లో వివిధ దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. లింగాలకు సమీపంలోని చాకిరేవుకుంట దగ్గర ఈ నెల 19న రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాలు చేసిన ప్రాంతంలో రాత్రికి రాత్రే జేసీబీతో చదును చేయిండంలో అనుమానాలకు తావిస్తోంది. 2022 మే 31 రాత్రి చెన్నంపల్లి వెళ్లే దారిలో శివాలయం ఎదుట ఉన్న నంది విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనలో అప్పట్లో పదుల సంఖ్యలో అనుమానితులను విచారించినా పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ధ్వంసం చేసి ఎత్తుకెళ్లిన నంది విగ్రహం ఎక్కడ ఉందో కూడా నేటికి తెలియలేదు. అప్పట్లో దాతలు ముందుకు వచ్చి నంది, శివలింగం విగ్రహాలను మళ్లీ పున:ప్రతిష్ఠించారు. ఇది జరిగి నెల రోజులకే 2022 జూలై 12 రాత్రి లింగాల శివారులో గ్రామ దేవత పోచమ్మ దేవాలయంలో పోచమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దేవాలయాలపై దుండగులు దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేయడం, ఎత్తుకెళ్లడం ఎవరికి అంతుపట్టడం లేదు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తే మరి విగ్రహాలు ఎత్తుకెళ్లడం ఎందుకనే ప్రశ్నలు మొదలయ్యాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని పలు చెంచు పెంటల్లో గుప్త నిధుల వేట గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. నల్లమల ప్రాంతంలో పూర్వకాలంలో రాజులు నిర్మించిన ఎన్నో దేవాలయాలు, కోటలు శిథిలావస్థకు చేరడం, గుప్త నిధుల తవ్వకాలకు నిలయంగా మారుతున్నాయి. ఈ సమయంలో పోలీసులు ఉదాసీనత వహిస్తుండడంతో గుళ్లు, గోపురాలకు భద్రత లేకుండా పోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
'గుప్త నిధి' పేరుతో మోసం.. రూ.50 లక్షల నగదు లభ్యం !
కొత్తగూడెంరూరల్: గుప్త నిధుల పేరు చెప్పి రూ.50 లక్షలు తీసుకున్న ముఠా గుట్టురట్టయింది. ఈ ముఠాలో ప్రధాన నిందితుడితోపాటు ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రెహమాన్ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన బోయిన బుచ్చయ్య, వేల్పుల కిరణ్, కనకటి లింగయ్య కలిసి గొర్రెల వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలానికి చెందిన మానికల కృష్ణ, అతడి స్నేహితులు ధర్మసోత్ శ్రీను, గూడవల్లి ప్రశాంత్, ఎల్.రవి, తేజావత్ శివ, బానోత్ నరేశ్, నేల్గుల వెంకన్న, లక్ష్మణ్, భూక్య నాగ, తేజావత్ రాము, ధరావత్ రవి.. పాల్వంచ దగ్గర గొర్రెల మంద ఉందని బుచ్చయ్యకు సమాచారం ఇవ్వడంతో ఆయన కిరణ్, లింగయ్యను తీసుకొని వచ్చాడు. గొర్రెలు ఏవని కృష్ణను అడగటంతో ఇంకా రాలేదని, మళ్లీ వచ్చినప్పుడు పిలుస్తామని బదులిచ్చాడు. అయితే, తాము ఇక్కడికి రావడానికి రూ.18,750 ఖర్చయిందని బుచ్చయ్య చెప్పడంతో కృష్ణ ఆ నగదును ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. మరో రోజు కృష్ణ గొర్రెలు వచ్చాయని బుచ్చయ్యకు చెప్పడంతో మళ్లీ వారు ముగ్గురు కొత్తగూడెం వచ్చారు. వారిని లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం గ్రామానికి తీసుకెళ్లి తమ దగ్గర గొర్రెలు లేవని, గుప్త నిధులకు సంబంధించి రూ.2 కోట్లు ఉన్నాయని, రూ.50 లక్షలు ఇచ్చి ఈ నగదు తీసుకెళ్లండని కృష్ణ చెప్పాడు. ఈ క్రమంలో రూ.50 వేలు కూడా బుచ్చయ్యకు ఇచ్చాడు. దీంతో వారు నమ్మి ఈ నెల 9వ తేదీన రూ.40 లక్షలు తీసుకొచ్చి కృష్ణకు అప్పగించి రూ.2 కోట్లు ఉన్న సంచులను తీసుకుని బుచ్చయ్య, కిరణ్, లింగయ్య అక్కడి నుంచి వెళ్లారు. మార్గమధ్యలోకి వెళ్లి చూసుకోగా డబ్బుల మధ్యలో తెల్లకాగితాలు పెట్టిన కట్టలు కనిపించాయి. వెంటనే వారు లక్ష్మీదేవిపల్లి పోలీసులను ఆశ్రయించడంతో మానికల కృష్ణ ముఠా గుట్టురట్టయింది. కాగా, బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామం వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో మానికల కృష్ణతోపాటు ధర్మసోత్ శ్రీను, గూడవల్లి ప్రశాంత్, ఎల్.రవి, తేజావత్ శివ, బానోత్ నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఇదే ముఠాకు చెందిన వెంకన్న, లక్ష్మణ్, నాగ, రాము, రవి పరారీలో ఉన్నారని డీఎస్పీ రెహమాన్ వెల్లడించారు. -
గుప్త నిధుల తవ్వకాల కలకలం
అమరాపురం: మండలంలోని పేలుబండ గ్రామ సమీపంలోని లక్ష్మీ రంగనాథస్వామి కొండ వద్ద మళ్లీ గుప్త నిధుల తవ్వకాల కలకలం రేగింది. కొండ కింద భాగాన ఉన్న మరువ సమీపంలో మంగళవారం రాత్రి జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతుండడగా గ్రామస్తులు గుర్తించారు.జేసీబీని ఆపి, పోలీసులకు సమాచారం అందించారు. గతంలో కూడా ఇక్కడ తవ్వకాలు జరిపారని గ్రామస్తులు తెలిపారు. పోలీసు అధికారులు భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కాంతరాజు, మంజునాథ్, ఆలదపల్లి మూర్తి తదితరులపై కేసు నమోదు చేసినట్లు గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ తెలిపారు. -
పొలం తవ్వుతుండగా గుప్త నిధులు.. మహిళ పూనకంతో ఊగిపోయి
సాక్షి, రామన్నపేట(నల్లగొండ): మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో ఓ రైతు పొలంలో గుప్తనిధులు లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కుంకుడుపాముల గ్రామానికి చెందిన కన్నెబోయిన మల్లయ్య సర్వే నంబర్లు 16, 17లోని తన పొలంలో వారం రోజుల క్రితం గట్లు తీస్తుండగా మట్టిపాత్ర(గురిగి), చిన్న ఇనుపపెట్టె కనిపించాయి. మట్టిపాత్రలో 38 వెండి నాణేలు, 5 వెండి పట్టీలు, 14 వెండి రింగులు(విరిగినవి) లభ్యమయ్యాయి. ఇనుప పెట్టెలో 19 బంగారు బిళ్లలు(పుస్తెలతాడుకు ఉండేవి) ఐదు బంగారు గుండ్లు ఉన్నాయి. వెండి నాణేలపై ఉర్దూ పదాలు ఉన్నాయి. కాగా మల్లయ్య తీసిన గట్టును ఆనుకొని అతడి సోదరుడు లింగయ్య పొలం ఉంటుంది. అందులో నాటు వేసేందుకు వచ్చిన కూలీలు వాటిని తలా ఒకటి తీసుకోవడానికి చేతిలో పట్టుకున్నారు. అదే సమయంలో ఒక మహిళ పూనకం వచ్చినట్టు ఊగి వాటిని ముట్టుకుంటే అరిష్టమని పలుకడంతో వారంతా నాణేలు, బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చారు. పొలంలో లభ్యమైన నిధిని మల్లయ్య ఇంటి వద్ద గల పెంటకుప్పలో దాచాడు. విషయం తెలుసుకున్న అతడి సోదరుడు లింగయ్య ఇద్దరి మధ్య ఉన్న పొలంగట్టులో దొరికింది కాబట్టి తనకు వాటా కావాలని డిమాండ్ చేశాడు. వరినాట్లు ముగిసిన రెండురోజుల అనంతరం సోదరులిద్దరు గ్రామంలోని ఓ పెద్దమనిషిని ఆశ్రయించారు. సమానంగా పంచుకోవాలని పెద్దమనిషి సలహా ఇచ్చాడు. వాటిని పంచుకునే విషయంలో అన్నదమ్ములిద్దరికీ తేడా వచ్చింది. దీంతో మల్లయ్య మంగళవారం తనకు పొలంలో దొరికిన గుప్తనిధిని రామన్నపేట పోలీసులకు అప్పజెప్పాడు. గుప్తనిధి వివరాలను రెవెన్యూ అధికారులకు అందించామని, గురువారం వారికి అందజేయనున్నట్లు సీఐ చింతా మోతీరాం తెలిపారు. చదవండి: మరో ఆసక్తికర పరిణామం.. జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!? -
మానవపాడులో లంకె బిందె.. గుట్టుగా నొక్కేద్దామనుకుని అంతలోనే..
సాక్షి, మహబూబ్‌నగర్: ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా కూలీలకు లంకెబిందె దొరికింది. రెండు బంగారు వడ్డాణాలు.. వంద వరకు బంగారు నాణేలు (కిలోన్నరపైగా).. వీటి విలువ రూ.80 లక్షలపైమాటే.. గుట్టుగా నొక్కేద్దామనుకున్నారు కానీ.. పంపకాల్లో తేడా రావడంతో రట్టయింది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. మానవపాడులోని ఓ ఇంటి నిర్మాణానికి పునాదితీసే పనిని యజమాని రెండు నెలల క్రితం 11 మంది కూలీలకు అప్పగించాడు. అయితే 9 మంది మాత్రమే పనిలో పాల్గొని మట్టి తవ్వుతుండగా లంకెబిందె బయటపడింది. దానిని యజమానికి తెలియకుండా తరలించిన కూలీలు వంద నాణేలను తొమ్మిది వాటాలు వేసుకున్నారు. రెండు వడ్డాణాలను కరిగించాక పంచుకుందామని అనుకున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా కోడుమూరు, ఎమ్మిగనూరు, కర్నూలు, నందికొట్కూరులలో తెలిసిన బంగారం వర్తకులను సంప్రదించారు. కొందరు ఆభరణాలు చేయించుకుంటే, ఇంకొందరు అమ్మి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు తాకట్టు పెట్టుకున్నారు. ఇలా బయటపడింది.. తొమ్మిది మంది కూలీలు బంగారాన్ని పంచుకున్నట్లు కూలీల బృందంలోని మిగతా ఇద్దరికీ తెలిసింది. పనికి కుదిరిన వారిలో తామూ ఉన్నాం కాబట్టి వాటా కోసం పట్టుబట్టారు. అందుకు 9 మంది నిరాకరించడంతో వ్యవహారం బట్టబయలైంది. దీనిపై ‘బంగారు నాణేలు లభ్యం?’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైంది. విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం ఉదయం ఏడుగురు కూలీల నుంచి సొత్తు రికవరీ చేసినట్లు తెలిసింది. మిగతా ఇద్దరు తాకట్టు పెట్టారని గుర్తించారు. అయితే, ఘటనను పోలీసులు ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. అసలు ఇవి పురాతన నాణేలా?, కావా? అనేది నిర్ధారించేందుకు ఎలాంటి ఆనవాళ్లు లేకుండాపోయాయి. విషయం బయటపడటంతో వాటిని కరిగించిన బంగారం వర్తకులు బెంబేలెత్తుతున్నారు. -
ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
సాక్షి, అమ్రాబాద్: పదర మండలం రాయలగండి లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం ఎదుట ఉన్న అగ్నిగుండాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. అగ్ని గుండం కోసం పేర్చిన రాళ్లను తొలగించి, తవ్వకాలు జరిపి యథాస్థానంలో ఉంచారు. బుధవారం ఉదయం స్థానికంగా ఉన్న భక్తులు కొంత మంది చూసి తవ్వకాలు జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పదర ఎస్ఐ సురేష్‌కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడున్న వారిని విచారించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. గతంలోనూ తవ్వకాల ప్రయత్నం ఆలయంలో తవ్వకాలు జరిపిన ప్రదేశం ఇదిలాఉండగా గత ఆగస్టు 10వ తేదీన రాయలగండిలో గుప్త నిధుల తవ్వకాల ప్రయత్నం జరిగింది. ఓ కారులో గుప్తనిధుల కోసం రాయలగండి లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం సమీపంలో పరికరాలతో అణ్వేషన జరుపుతుండగా స్థానికులు గుర్తించి వెంబడించారు. కారులో పరారైన దుండగులను మన్ననూర్‌లో ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వచ్చిన ఐదు మంది దుండగులతో పాటు కారును, గుప్తనిధుల అన్వేషణకు తెచ్చుకున్న డిటోనేటర్, పౌడర్, వివిధ పరికరాలను స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేశారు. అప్పట్లో అన్వేషణ ప్రయత్నం జరగడం, బుధవారం తవ్వకాలు బయట పడటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాయలగండి ఆలయం వద్ద పోలీసు పహారా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
వికారాబాద్‌లో గుప్తనిధుల కలకలం
సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని ధారూర్ మండలం ఏబ్బనూర్ గ్రామంలోని గుప్తనిధులు బయటపడటం కలకలం రేపింది. కొందరు వ్యక్తులకు గుంత తవ్వే సమయంలో భారీగా వెండి నాణేలు లభించాయి. అయితే దీనిపై సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 169 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేయగా.. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న నాణేలను పోలీసులు సీజ్ చేశారు. -
గుప్తనిధి తవ్వకాల గ్యాంగ్
చెన్నూర్ : గుప్త నిధుల తవ్వకాల కోసం వచ్చిన గ్యాంగ్‌లో నుంచి ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. వీరిని శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ కిశోర్‌కుమార్ విలేకరల ఎదుట ప్రవేశపెట్టారు. అరెస్ట్ చేసిన సభ్యుల వివరాలు వెల్లడించారు. చెన్నూర్ మండలం రాయిపేట గ్రామ సమీపంలో గల చెరువుకట్ట ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయని భీమారం గ్రామానికి చెందిన సమ్మయ్య అనే వ్యక్తి గోదావరిఖని, మెదక్, జమ్మికుంట, చెన్నూర్ పట్టణాల్లో ఉన్న తన పరిచయస్తులతో చెప్పారు. వీరంత ఒక గ్యాంగ్‌గా ఏర్పడి గుప్త నిధులు తవ్వకానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గురువారం రాత్రి రాయిపేట గ్రామంలో గుప్త నిధులు తవ్వకానికి వచ్చారు. గ్రామ పొలిమేరల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో గ్రామస్తులు వారిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు రాయిపేటకు వెళ్లి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. తమనమ్మపూడి నాగ జ్ఞానేశ్వర్‌రెడ్డి (రామచంద్రాపురం, మెదక్ జిల్లా), చిందం రాజన్న (గోదావరిఖని), దాముక రాజం (గోదావరిఖని), కొడిపె బక్కయ్య (చెన్నూర్), జన్నాల వేణుగోపాల్ (జమ్మికుంట), లాడి బెంజిమన్ (కొత్తగూడెం, భద్రాది జిల్లా)ను విచారించారు. వారి వద్ద పూజకు సంబంధించిన సామగ్రితోపాటు టార్చిలైట్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధుల కోసం వచ్చినట్లు వారు అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కిశోర్‌కుమార్ తెలిపారు. పరారీలో ఉన్న మరోవ్యక్తి సమ్మయ్య కోసం గాలింపు నిర్వహిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వుతున్న ఆరుగురి రిమాండ్
యాచారం: రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనే ఆశ వారిని జైలు పాల్జేసింది. వ్యవసాయ భూమిలో 10 కిలోల బంగారం ఉందని నమ్మి తవ్వకాలు జరుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి యాచారం పీఏస్‌లో బుధవారం వెల్లడించిన వివరాలు... మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన గ్యారల వెంకటయ్య, గ్యారల బాలయ్య వ్యవసాయ పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. బాలయ్య అల్లుడైన మాడ్గుల్ మండలం అవుర్‌పల్లికి చెందిన యాదగిరి వ్యవసాయ పొలంలో బంగారు నిధులు ఉన్నాయని కొందరు పురోహితులు చెప్పారు. వారి మాటలు నమ్మిన నల్లవెల్లి గ్రామానికి చెందిన బాలయ్య, వెంకటయ్య, మహేష్, నగరానికి చెందిన చతుర్వేది, రాంరెడ్డి, సురేందర్‌తో పాటు మరో ముగ్గురితో కలిసి సోమవారం రాత్రి బాలయ్య, వెంకటయ్యల వ్యవసాయ పొలంలో తవ్వకాలు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి చతుర్వేది, రాంరెడ్డి, సురేందర్, వెంకటేష్‌లను అదే రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి బాలయ్య, మహేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచచి 4 మోటార్సైకిల్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన 6 మందిని బుధవారం రిమాండ్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యేక టీంలుగా ఏర్పడుతున్న కొందరు పూరాతన దేవాలయాలు, పాత భవనాలు లక్ష్యంగా చేసుకుని తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో యాచారం సీఐ చంద్రకుమార్, ఎస్సై వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
గుప్తనిధుల ముఠా సభ్యులు అరెస్ట్
భూపాలపల్లి: గుప్త నిధుల ముఠా సభ్యుల గుట్టును కొయ్యూరు పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన 9 మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆచార్య జయశంకర్ జిల్లాలోని మల్హార్ మండలం పెద్దతూండ్ల అటవీప్రాంతంలో భారీగా తవ్వకాలు జరిపినట్లు వారు పోలీసుల విచారణ తెలిపారు.