కొత్తగూడెంరూరల్: గుప్త నిధుల పేరు చెప్పి రూ.50 లక్షలు తీసుకున్న ముఠా గుట్టురట్టయింది. ఈ ముఠాలో ప్రధాన నిందితుడితోపాటు ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రెహమాన్ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన బోయిన బుచ్చయ్య, వేల్పుల కిరణ్, కనకటి లింగయ్య కలిసి గొర్రెల వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలానికి చెందిన మానికల కృష్ణ, అతడి స్నేహితులు ధర్మసోత్ శ్రీను, గూడవల్లి ప్రశాంత్, ఎల్.రవి, తేజావత్ శివ, బానోత్ నరేశ్, నేల్గుల వెంకన్న, లక్ష్మణ్, భూక్య నాగ, తేజావత్ రాము, ధరావత్ రవి.. పాల్వంచ దగ్గర గొర్రెల మంద ఉందని బుచ్చయ్యకు సమాచారం ఇవ్వడంతో ఆయన కిరణ్, లింగయ్యను తీసుకొని వచ్చాడు.
గొర్రెలు ఏవని కృష్ణను అడగటంతో ఇంకా రాలేదని, మళ్లీ వచ్చినప్పుడు పిలుస్తామని బదులిచ్చాడు. అయితే, తాము ఇక్కడికి రావడానికి రూ.18,750 ఖర్చయిందని బుచ్చయ్య చెప్పడంతో కృష్ణ ఆ నగదును ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. మరో రోజు కృష్ణ గొర్రెలు వచ్చాయని బుచ్చయ్యకు చెప్పడంతో మళ్లీ వారు ముగ్గురు కొత్తగూడెం వచ్చారు. వారిని లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం గ్రామానికి తీసుకెళ్లి తమ దగ్గర గొర్రెలు లేవని, గుప్త నిధులకు సంబంధించి రూ.2 కోట్లు ఉన్నాయని, రూ.50 లక్షలు ఇచ్చి ఈ నగదు తీసుకెళ్లండని కృష్ణ చెప్పాడు.
ఈ క్రమంలో రూ.50 వేలు కూడా బుచ్చయ్యకు ఇచ్చాడు. దీంతో వారు నమ్మి ఈ నెల 9వ తేదీన రూ.40 లక్షలు తీసుకొచ్చి కృష్ణకు అప్పగించి రూ.2 కోట్లు ఉన్న సంచులను తీసుకుని బుచ్చయ్య, కిరణ్, లింగయ్య అక్కడి నుంచి వెళ్లారు. మార్గమధ్యలోకి వెళ్లి చూసుకోగా డబ్బుల మధ్యలో తెల్లకాగితాలు పెట్టిన కట్టలు కనిపించాయి. వెంటనే వారు లక్ష్మీదేవిపల్లి పోలీసులను ఆశ్రయించడంతో మానికల కృష్ణ ముఠా గుట్టురట్టయింది. కాగా, బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామం వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో మానికల కృష్ణతోపాటు ధర్మసోత్ శ్రీను, గూడవల్లి ప్రశాంత్, ఎల్.రవి, తేజావత్ శివ, బానోత్ నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఇదే ముఠాకు చెందిన వెంకన్న, లక్ష్మణ్, నాగ, రాము, రవి పరారీలో ఉన్నారని డీఎస్పీ రెహమాన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment