లింగాల: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల పరిసర ప్రాంతాల్లో వివిధ దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. లింగాలకు సమీపంలోని చాకిరేవుకుంట దగ్గర ఈ నెల 19న రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
తవ్వకాలు చేసిన ప్రాంతంలో రాత్రికి రాత్రే జేసీబీతో చదును చేయిండంలో అనుమానాలకు తావిస్తోంది. 2022 మే 31 రాత్రి చెన్నంపల్లి వెళ్లే దారిలో శివాలయం ఎదుట ఉన్న నంది విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనలో అప్పట్లో పదుల సంఖ్యలో అనుమానితులను విచారించినా పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ధ్వంసం చేసి ఎత్తుకెళ్లిన నంది విగ్రహం ఎక్కడ ఉందో కూడా నేటికి తెలియలేదు.
అప్పట్లో దాతలు ముందుకు వచ్చి నంది, శివలింగం విగ్రహాలను మళ్లీ పున:ప్రతిష్ఠించారు. ఇది జరిగి నెల రోజులకే 2022 జూలై 12 రాత్రి లింగాల శివారులో గ్రామ దేవత పోచమ్మ దేవాలయంలో పోచమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దేవాలయాలపై దుండగులు దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేయడం, ఎత్తుకెళ్లడం ఎవరికి అంతుపట్టడం లేదు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తే మరి విగ్రహాలు ఎత్తుకెళ్లడం ఎందుకనే ప్రశ్నలు మొదలయ్యాయి.
నల్లమల అటవీ ప్రాంతంలోని పలు చెంచు పెంటల్లో గుప్త నిధుల వేట గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. నల్లమల ప్రాంతంలో పూర్వకాలంలో రాజులు నిర్మించిన ఎన్నో దేవాలయాలు, కోటలు శిథిలావస్థకు చేరడం, గుప్త నిధుల తవ్వకాలకు నిలయంగా మారుతున్నాయి. ఈ సమయంలో పోలీసులు ఉదాసీనత వహిస్తుండడంతో గుళ్లు, గోపురాలకు భద్రత లేకుండా పోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment