Gurdaspur attack
-
గురుదాస్‌పూర్ దాడి: పోలీసులకు సాహస పతకాలు
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన ఎస్పీ బల్జీత్ సింగ్, సాహసోపేతంగా పోరాడిన మరో ఇద్దరు పోలీసులకు అత్యున్నత పోలీసు మెడల్స్ ఇవ్వనున్నారు. ఇన్స్పెక్టర్ బల్బీర్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ తారా సింగ్ ఈ దాడి జరిగిన సమయంలో పోలీసు స్టేషన్లో ఉన్నారు. వాళ్లు ఉగ్రవాదులను అణిచేయడంలో మంచి సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దాంతో వారికి కూడా పతకాలు ప్రకటించారు. బల్జీత్ సింగ్‌కు రాష్ట్రపతి పోలీసు పతకాన్ని ప్రకటించారు. బల్జీత్ సింగ్ తండ్రి కూడా కొన్నేళ్ల క్రితం ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన లష్కరే తాయిబా లేదా జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఓ బస్సు మీద కూడా కాల్పులు జరిపి, తర్వాత దీనానగర్ పోలీసు స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. ఈ దాడిలో ముగ్గురు పౌరులు, బల్జీత్ సింగ్, ముగ్గురు హోం గార్డులు మరణించారు. -
ఉగ్రదాడిని తిప్పికొట్టిన బృందంలో మాజీ హాకీ స్టార్
చండీగఢ్: గురుదాస్ పూర్ ఎన్కౌంటర్లో మాజీ స్టార్ హాకీ ప్లేయర్, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ జుగ్రాజ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన బృందంలో 32 ఏళ్ల జుగ్రాజ్ కూడా సభ్యుడు. హాకీ నుంచి రిటైరైన తర్వాత జుగ్ రాజ్ పంజాబ్ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అమృత్‌సర్‌లో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ముష్కరుల దాడి ఘటన సమాచారం తెలిసిన వెంటనే ఉదయం 8:15 గంటలకు దినానగర్ చేరుకున్నారు. అక్కడ ఎస్ఎస్పీ బృందంతో కలిసి తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొని ముష్కరులను మట్టు పెట్టారు. 2003లో జలంధర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత హాకీ నుంచి జుగ్రాజ్ రిటైరయ్యారు. కొన్నిరోజులు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించి హాకీ మెలకువలను ఆటగాళ్లకు నేర్పించారు. ఆ తర్వాత పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. -
గుర్దాస్పూర్ దాడి పాక్ పనే
పంజాబ్‌లోని గుర్దాస్పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్‌పై జరిగిన ఉగ్రదాడి పాకిస్థాన్ పనేనని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ దాడి విషయమై ఆయన రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. పాక్ నుంచి మన దేశంలోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేయడానికే వచ్చారని, సరిహద్దు ఉగ్రవాదాన్ని అణిచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. మన దేశ శత్రువులు భారతదేశ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని, పౌరుల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అయితే.. హోం మంత్రి ఈ ప్రకటన చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో గందరగోళం సృష్టించారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, ఉగ్రవాద దాడిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేస్తున్నారని డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ పదేపదే చెప్పినా ప్రయోజనం కనపడలేదు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు.