Gurukul Girls College
-
అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి.. నాకు వేరే దారి లేదు
ఎచ్చెర్ల క్యాంపస్: కుమార్తెపైనే గంపెడు ఆశలు పెట్టుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. చదువులో ఎప్పుడూ ముందుండే తమ కుమార్తె ఇక లేదని తెలిసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మంగళవారం ఎచ్చెర్ల మండలం అంబేడ్కర్ గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం తండ్యాంమెట్ట (మన్నెపేట)కు చెందిన దంపతులు దుంగ భూలోక, భారతిలు విశాఖలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. కుమారుడు నవీన్ ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తుండగా, కుమార్తె కరిష్మా(17) ఎచ్చెర్లలోని అంబేడ్కర్ గురుకులం (పాఠశాల/కళాశాల)లో ఇంటర్మీడియెట్(బైపీసీ) ప్రథమ సంవత్సరం చదువుతోంది. చదువులో చురుగ్గా ఉంటే కరిష్మా ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుతూ త్వరలో జరిగే పబ్లిక్ పరీక్షలతో పాటు నీట్, అగ్రికల్చర్ సెట్లకు సైతం సిద్ధమవుతోంది. ఇటీవలే చెవి నొప్పి అంటూ ఇంటికి వెళ్లి చికిత్స చేయించుకుని ఆదివారం మళ్లీ పాఠశాలకు చేరుకుంది. స్టడీ అవర్స్‌లో భాగంగా ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి 5.30 గంటలకు తరగతి గదికి చేరుకుంది. కొద్దిసేపటికే ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థినులు ఆరు గంటలకు తరగతి గదికి చేరుకోగా కరిష్మా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఎస్సై కె.రాము ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా విద్యార్థిని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలం వద్ద ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. విశాఖ నుంచి తల్లిదండ్రు లు, సోదరుడు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తహశీల్దార్ సనపల సుధాసాగర్ గురుకులాన్ని పరిశీలించారు. కారణం అదేనా.. గురుకులం పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు విజయనగరం నుంచి కారులో రాకపోకలు సాగిస్తున్నారు. కారు డ్రైవర్ ఈ విద్యార్థినిని కొంతకాలంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు సైతం చెప్పినట్లు తెలిసింది. అప్పట్లో తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థినికి ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ ఇవ్వడం, డ్రైవర్‌ను ఉపాధ్యాయురాలు తొలగించడం జరిగాయి. ఈ క్రమంలోనే తోటి విద్యార్థులు కామెంట్లు చేయటం, విద్యార్థిని వ్యక్తిగతంగా రాస్తున్న డైరీ పరిశీలించి సోమవారం ఉపాధ్యాయురాలు మందలించటం వంటివి చోటుచేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఆగ్రహం.. విద్యార్థిని ఆత్మహత్య విషయంలో గురుకుల యాజమాన్యం తీరుపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము రాకుండానే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించటం, విద్యార్థుల తల్లిదండ్రులను సైతం అనుమతించని గురుకులంలోకి డ్రైవర్‌ను రానివ్వడం, గతంలో వివాదం తలెత్తినప్పుడు డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం వంటి అంశాలను లేవనెత్తుతున్నారు. పోలీసులు మాత్రం తాము వచ్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాకే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు చెబుతున్నారు. నన్ను క్షమించండి అంటూ సూసైడ్ లేఖ.. విద్యార్థి రాసిన సూసైట్ నోట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు, పోలీసుల కేసు నమోదుకు భిన్నంగా నోట్ ఉండటం గమనార్హం. సూసైట్ నోట్ పరిశీలిస్తే.. ‘అమ్మా, నాన్నా, అన్నా.. నన్ను దయచేసి క్షమించండి. మిమ్మల్ని వదిలి వెళ్లటం బాధగా ఉంది. నాకు వేరే దారిలేదు. మీ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాను. దేవుడు ధృడమైన సంకల్పం ఇవ్వలేదు. నేను, డ్రైవర్ సాయి ఇద్దరం ఇష్టపడ్డాం. ఆయన నా వల్ల ఉద్యోగం కోల్పోయారు. నా మృతికి ఎవ్వరూ కారణం కాదు. రేపు అనేది ఎలా ఉంటుందో తెలియదు..’ ఇదీ సూసైడ్ నోట్ సారాంశం. ముగ్గురిపై కేసు నమోదు.. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గురుకులం ప్రిన్సిపాల్ కె.ఉషారాణి, ఇంగ్లీష్ టీచర్ భవానీ, ఈమె పూర్వపు కారు డ్రైవర్ సురేష్ (సాయి)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.రాము చెప్పారు. ముగ్గురు సస్పెండ్... శాఖాపరంగా సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ చర్యలు చేపట్టారు. ప్రిన్సిపాల్ కె.ఉషారాణి, ఇంగ్లీష్ టీచర్ భవానీ, హౌస్ (క్లాస్ టీచర్) మంజులను సస్పెండ్ చేసినట్లు జిల్లా అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త యశోధలక్ష్మి తెలిపారు. ప్రస్తుత వైస్ ప్రిన్సిపాల్ రాధికకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఏడాది కాగానే భర్త అలా చేస్తూ.. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
గురుకులాల్లో ఇంటర్ సీట్లకు డిమాండ్
పాడేరు : ఏజెన్సీలోని మూడు బాలికల గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశం కోసం గురువారం స్థానిక అంబేడ్కర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 2050 మంది విద్యార్థినులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. పాడేరు, అరకు గురుకుల బాలికల జూనియర్ కళాశాలల్లో(ఆంగ్ల మాధ్యమం) 9 గ్రూపులకు 330 సీట్లు, జీకే వీధిలోని (తెలుగు మీడియం) మూడు గ్రూపులకు 120 సీట్లు ఉన్నాయి. గ్రూపు కు పరిమితంగా సీట్లు ఉండడంతో చాలా మందికి సీట్లు దక్కలేదు. టెన్త్‌లో 8.0 గ్రేడ్‌పాయింట్లు, పీటీజీ వారికి 7.0 గ్రేడ్ పాయింట్లు పైగా సాధించి న వారికి ఇంగ్లిష్ మీడియం కళాశాలల్లోను, 9.0 గ్రేడ్ పాయింట్లు పైగా వచ్చిన వారికి మాత్రమే తెలుగు మీడియం కళాశాలల్లో సీట్లు లభించాయి. ఈ మూడు కళాశాలల్లో అన్ని గ్రూపుల్లో మొత్తం 450 సీట్లు కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేశారు. సీట్లు పెంచాలని విద్యార్థినుల వినతి : ఏటా గురుకులాల్లో సీట్లు లభించక విద్యార్థినులు సతమతమవుతున్నారు. ఏజెన్సీలో గిరిజన బాలికల కోసం గురుకుల జూనియర్ కళాశాలలు మాత్రమే ఉండడం, తక్కువ సీట్లు ఉండడంతో అడ్మిషన్లు పొందలేకపోతున్నారు. ప్రతి ఏడాది వందలాది మంది విద్యార్థినులు గురుకులాల్లో సీట్లు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గతేడాది 1500 మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది వారి సంఖ్య రెండువేలకు దాటింది. సీట్లు దక్కక పలువురు నిరాశతో వెనుదిరుగుతున్నారు. గురుకుల కళాశాలల్లో సీట్లు పెంచాలని బాలికలు ఐటీడీఏ వద్దకు చేరి అధికారులను కోరారు. 500 సీట్లు పెంపునకు ప్రతిపాదన : మూడు గురుకుల కళాశాలల్లో 500 సీట్లు పెంపు కోసం ప్రతిపాదనలు చేశామని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది టెన్త్ పాస్ పర్సంటేజి పెరగడంతో పాటు విద్యార్థులు మంచి గ్రేడ్ పాయింట్స్ సాధించడంతో గురుకులాల్లో ఇంటర్ సీట్ల పెంపు అవసరాన్ని ముందే గుర్తించి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.కె బాలాజీ గురుకుల కార్యదర్శి భాను ప్రసాద్‌తో మాట్లాడారని తెలిపారు. ప్రస్తుతం మొదటి కౌన్సెలింగ్‌లో 450 సీట్లు భర్తీ చేశామని, సీట్లు పెంపు అనుమతి రాగానే మలివిడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. -
గురుకుల బాలికల కళాశాలల్లో దరఖాస్తుల ఆహ్వానం
ఈనెల 31 దరఖాస్తులకు తుది గడువు అద్దంకి : జిల్లాలోని గురుకుల బాలికల కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. శింగరాయకొండ, కంభం, మార్కాపురం, అద్దంకి, యద్దపూడి, కొండపి, రాచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు 640 సీట్లు, దూపాడు, నాగులపాలెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో ఇంటరు మొదటి సంవత్సరంలో చేరేందుకు 160 సీట్లు ఖాళీగా ఉన్నట్లు సింగరకొండ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ , ఇంటరు ప్రవేశ కౌన్సిలింగ్ కో ఆర్డినేటరు పరుచూరి వాసవి మంగళవారం తెలియజేశారు. వీటిని కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు ఫారాలు సమీపంలో ఉన్న ఏ గురుకుల కళాశాల నుంచైనా పొందవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలతోపాటు పదో తరగతి మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు జెరాక్స్‌లను జతచేసి ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా అందజేయాలని తెలిపారు. మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థుల కోసం జూన్ 6వ తేదీన ఉదయం 10 గంటలకు అద్దంకిలోని సింగరకొండ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే సమయంలో విద్యార్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరారు. దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు.. * ఈ సంవత్సరం పదో తరగతి పాసై ఉండి 2016 ఆగ స్టు 16 నాటికి 17 సంవత్సరాల వయసు లోపు వారై ఉండాలి. * తల్లిదండ్రుల సంవత్సరాదాయం ఒక లక్షకు మించి ఉండరాదు. * ప్రకటించిన సీట్లలో 75 శాతం ఎస్సీలకు, ఎస్సీ కన్వనర్టెడ్ క్రిస్టియన్లకు 12 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 2 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం 9704550083, 9704550087, 9704550088, 9704550089, 9704550090, 9704550091, 9704550092, 9704550093, 9704550094, 9704550095 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.