నెలాఖర్లో గ్రూప్–2 ఫలితాలు!
- జూన్ తొలి, రెండో వారంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- జూలైలో ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం
- వచ్చే నెలలోనే గ్రూప్–1 ఇంటర్వ్యూలు
- ఆ తర్వాత గురుకుల టీచర్ల పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రూప్–2 ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీ కసరత్తు వేగవంతం చేసింది. పోస్టులు, రిజర్వేషన్లు, రోస్టర్ వారీగా, అర్హతల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అర్హుల జాబితాలను సిద్ధం చేస్తోంది. దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈ నెలాఖరులోగానే ఫలితాలు విడుదల చేసి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రకటించాలని శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయానికి వచ్చింది. లేదంటే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది. మొత్తంగా జూన్ మొదటి లేదా రెండో వారంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేలా టీఎస్పీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
వచ్చే నెలంతా బిజీ బిజీ..
గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తోపాటు 2011 గ్రూప్–1 ఇంటర్వ్యూలను కూడా జూన్‌లోనే నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ ఇటీవలే సంతకం చేశారు. దీంతో పంచాయతీరాజ్ విభాగంలో సృష్టించే సూపర్ న్యూమరరీ పోస్టులపై ఉత్తర్వులు త్వరలోనే వెలువడుతాయని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ ఉత్తర్వులు రాగానే రోస్టర్ పాయింట్ల ఆధారంగా మెరిట్ జాబితాలను ప్రకటించి... జూన్‌లోనే ఇంటర్వూ్యలు నిర్వహించాలని యోచిస్తున్నారు. మరోవైపు జూన్‌లోనే గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు జూలైలో ఇంటర్వ్యూను నిర్వహించనుంది.
ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన ప్రక్రియ
రెండు నోటిఫికేషన్ల ద్వారా 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. 2015 డిసెంబర్ 30న ఇచ్చిన తొలి నోటిఫికేషన్లో 439 పోస్టు లను ఇవ్వగా.. మరిన్ని పోస్టులు ఇవ్వాలంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో మరో 593 పోస్టులతో 2016 సెప్టెంబర్ 1న మరో నోటిఫికేషన్ ఇచ్చారు. వాటికి గతేడాది నవంబర్లోనే రాత పరీక్షలు నిర్వహించినా.. పలువురు అభ్యర్థులు కొన్ని అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించడంతో ఫలితాల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే కోర్టు గత నెల 24న టీఎస్పీఎస్సీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో టీఎస్పీఎస్సీ ఫలితాల ప్రక్రియను చేపట్టింది.