Gvmc commissoner
-
బ్లాక్ లిస్టులో పెట్టినా.. బాద్షాలా!
టెండర్లు దక్కించుకొని.. పనులు పూర్తి చేయడంలో జాప్యం వహించడం.. అడ్డగోలుగా వ్యవహరించడం వంటి కార్యకలాపాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను జీవీఎంసీ బ్లాక్ లిస్టులో పెట్టింది. అంటే కార్పొరేషన్ పరిధిలో ఏ పనులకు సంబంధించిన టెండర్లలో అయినా వారు పాల్గొనే అవకాశం ఉండదు. కానీ కొందరు ఇంజినీరింగ్ సిబ్బంది మాత్రం నిషేధిత కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారు. కొత్త టెండర్లలో వారికి చోటు కల్పించి పనులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: వివిధ కారణాలతో గ్రేటర్ విశాఖ పరిధిలో పనులు నిర్వహిస్తున్న 26 మంది కాంట్రాక్టర్లను అప్పటి జీవీఎంసీ కమిషనర్ బ్లాక్ లిస్టులో పెట్టారు. చిన్నచిన్న తప్పులు చేసిన 21 కాంట్రాక్టు సంస్థల్ని ఏడాది పాటు.. విభిన్న రకాల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడిన ఐదుగురు కాంట్రాక్టర్లపై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు. ఏడాది నిషేధం ఉన్న కాంట్రాక్టర్లలో చాలా మంది వరకూ ఈ ఏడాది జూలై వరకూ, ఐదేళ్ల నిషేధం ఉన్న కాంట్రాక్టర్లు 2025 డిసెంబర్ వరకూ ఏ విధమైన టెండర్లలో పాల్గొన కూడదు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. కొందరు బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లు మాత్రం నిషేధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జీవీఎంసీ పిలుస్తున్న టెండర్లలో తమ అర్హతకు సరిపోయే పనుల్ని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇంజినీర్ల సహకారంతోనే.. బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్ ఏదైనా ఈ–టెండర్లో పాల్గొనేందుకు ప్రయత్నించిన వెంటనే రిజెక్ట్ లిస్టులో చేరే వ్యవస్థ జీవీఎంసీలో ఉంది. సదరు కాంట్రాక్టర్ ఫర్మ్ పేరు మార్చి పాన్ కార్డు, లేదా ఆధార్, జీఎస్టీ నంబర్.. ఇలా ఏదైనా ఎంటర్ చేసినా టెండర్ తిరస్కరించాలి. అదే విధంగా ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)ని తిరిగి సదరు బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన అవసరం లేదు. పదేపదే రిజెక్ట్ చేసినా టెండర్లలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే సదరు కాంట్రాక్టర్ నిషేధాన్ని మరికొద్ది రోజులు పొడిగించే అధికారాలు జీవీఎంసీ అధికారులకు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి నిషేధిత కాంట్రాక్టర్లకు కొమ్ముకాసే పనిలో ఇంజినీరింగ్ సిబ్బంది తలమునకలవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్ లిస్టులో ఉన్నా వారికి ఎలాగైనా కాంట్రాక్టు దక్కించుకునేలా కుయుక్తులు పన్నుతున్నారు. ఉదాహరణకు ఇటీవలే యూపీహెచ్సీ టెండర్ల వ్యవహారంలోనూ ఇదే పద్ధతి అవలంబించారు. రూ.కోట్ల విలువ చేసే పనులని దక్కించుకునేందుకు ఐదేళ్ల బ్లాక్ లిస్టులో ఉన్న ఓ కాంట్రాక్టర్ ఆ టెండర్లలో పాల్గొన్నారు. దాదాపు అన్ని టెండర్లలోనూ టెక్నికల్ బిడ్ వరకూ ఆ కాంట్రాక్టర్‌ను ఇంజినీరింగ్ సిబ్బంది తీసుకెళ్లిపోయారు. వాస్తవానికి ఆ కాంట్రాక్టర్‌ను టెండర్ ప్రారంభ దశలోనే రిజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ.. కొందరు ఇంజినీరింగ్ అధికారులు సిబ్బంది కలిసి.. చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. టెండర్లు ఫైనలైజ్ చేసే సమయంలో ఉన్నతాధికారులు విషయాన్ని గుర్తించి.. నిషేధిత కాంట్రాక్టర్‌ను పక్కన పెట్టారు. పదే పదే.. అదే శైలి.. ఈ ఒక్క కాంట్రాక్టర్ మాత్రమే కాదు బ్లాక్ లిస్టులో ఉన్న కొందరు కాంట్రాక్టర్లు తమ ఫర్మ్ పేరు మార్చి.. పాత పాన్, ఆధార్ నంబర్‌తో టెండర్లలో పాల్గొంటున్నారు. ఈ విషయం ఇంజినీరింగ్ సిబ్బందికి తెలిసినా.. ఏమీ తెలీనట్లుగా వారికి టెండర్లు అప్పగించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కూడా తమకేం పట్టనట్లుగా ఉంటున్నారు. ఇప్పటికైనా బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లపై నిశిత దృష్టితో వ్యవహరించకపోతే జీవీఎంసీ పనుల వ్యవహారంలో మళ్లీ అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని కార్పొరేషన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. (చదవండి: కరాటే క్వీన్స్: చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో వండర్ కిడ్) -
విశాఖ పూర్ణామార్కెట్ ఆశీలు వసూలులో ‘మహా’ మాయ!
సాధారణంగా ఎక్కడైనా మార్కెట్ లోపలికి వెళ్తేనే మనకు కావల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి. కానీ.. పూర్ణామార్కెట్‌లో మాత్రం దీనికి పూర్తి భిన్నం. లోపలకుఒక్క అడుగు కూడా వేయాల్సిన అవసరం లేకుండానే అన్ని నడి రోడ్డుమీదే లభిస్తాయి. లోపల దుకాణాలు మాత్రం ఖాళీగానే దర్శనమిస్తాయి. ఎందుకంటే.. ఆశీలు వసూలు చేసే కాంట్రాక్టర్ అడ్డగోలు వ్యవహారాలకు దారి తీస్తున్నారు. జీవీఎంసీ రెవెన్యూ అధికారుల అండతో మార్కెట్ లోపల ఉన్న వ్యాపారుల పొట్టకొట్టేలా.. బయటనే చిల్లర దుకాణాలు ఏర్పాటు చేయిస్తూ అప్పనంగా దండుకుంటున్నారు. కార్పొరేషన్ ఖాతాలోకి మార్కెట్ లోపల ఉన్న దుకాణాల నుంచి వచ్చే చిల్లర విదిలించి.. రోడ్లపై అమ్మకాలు సాగించే వారి నుంచి అధికంగా వసూలు చేస్తూ.. ఆశీలు వ్యాపారాన్ని మూడు షెడ్డులు, ఆరు జంగిడీలుగా సాగిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: పూర్ణా మార్కెట్లో పక్కాషాపులు 600, గ్యాంగ్‌వేజ్ షాపులు 600 వరకు ఉన్నాయి. వీటి ఆశీళ్ల ద్వారా జీవీఎంసీకి ఏటా రూ.1.20 కోట్ల వరకూ ఆదాయం వస్తుంది. మార్కెట్ లోపల ఉన్న దుకాణాలకు రోజువారీ ఆశీలు రూ.10 నుంచి రూ.14 వరకూ వసూలు చేస్తుంటారు. వ్యాపార లావాదేవీలన్నీ మార్కెట్లోపల ఉన్న షాపుల ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. కానీ.. నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ బయట రోడ్లపైనే పలువురు చిరువ్యాపారుల పేరుతో (జంగిడీల దుకాణాలు) వ్యాపారాలకు తెరతీశారు. దీంతో మార్కెట్‌కు వెళ్లే రోడ్డు మొత్తం పండగ సమయాల్లోనూ సాయంత్రం వేళల్లోనూ మొత్తం రద్దీగా మారిపోతుంది. ప్రతి వస్తువూ రోడ్డుపైనే దొరుకుతుండటంతో కొనుగోలుదారులు లోపలికి వెళ్లకపోవడంతో మార్కెట్లో చట్టప్రకారం వ్యాపారం చేస్తున్న వారు పూర్తిగా నష్టపోతున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకూ వసూలు మార్కెట్ బయట ప్రతి రోజూ సుమారు 50 మందికి పైగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. సదరు ఆశీలు వసూలు చేస్తున్న కాంట్రాక్టరు ఒక్కో అమ్మకందారుడు నుంచి రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకూ దండుకుంటున్నారు. పండగ సమయంలో కచ్చితంగా ఒక్కో వ్యాపారి రూ.1000 వరకూ చెల్లించాల్సిందే. అయితే.. ఈ డబ్బులేవీ జీవీఎంసీ ఖాతాలకు వెళ్లకుండా కాంట్రాక్టర్, జీవీఎంసీ జోన్–4 రెవెన్యూ సిబ్బంది జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. కారు పార్కింగ్ కోసం ఉన్న స్థలంలోనూ ఈ చిన్న దుకాణాలే దర్శనమిస్తున్నా.. వారిపై రెవెన్యూ సిబ్బంది కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు. పార్కింగ్ చేసుకునేందుకు కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడ్డగోలు షెడ్లకు కూడా ట్రేడ్‌లైసెన్స్‌లు ఒకప్పుడు సైకిల్స్‌పై వచ్చి పూర్ణామార్కెట్ ఎదురుగా నిలబడి వ్యాపారాలు చేసుకునేవారు. అలాంటి వారి నుంచి జీవీఎంసీ జోన్–4 రెవెన్యూ అధికారులు మామూళ్లు లాగేసుకొని.. వారికి ట్రేడ్‌లైసెన్స్‌లు కూడా కట్టబెట్టేశారు. గేటు బయట ఎలాంటి షెడ్లు ఏర్పాటు చేసి విక్రయాలు చెయ్యకూడదన్న నిబంధనలున్నా.. వాటిని రెవెన్యూ అధికారులు చెత్తబుట్టలో పడేశారు. ఈ విషయంపై ఇటీవల ఉన్నతాధికారులకు మార్కెట్లో ఉన్న వ్యాపారులు ఫిర్యాదు చేస్తే నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించకుండా లోపల ఉన్న షాపుల్ని సీజ్ చేసేశారు. ఈ విషయంపై వ్యాపారులు నిలదీయడంతో.. రెండురోజుల తర్వాత సీజ్లని తొలగించారు. అయినా బయట ఉన్న అక్రమ వ్యాపారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆశీలు ఇవ్వండి.. మీ జీవీఎంసీ కమిషనర్.. ప్రతి మార్కెట్లోనూ ఆశీలుకు సంబంధించిన రసీదులో జీవీఎంసీ పేరు, కాంట్రాక్టర్ పేరు ఉండాలి. కానీ పూర్ణామార్కెట్ ఆశీలు స్లిప్పులపై మాత్రం జీవీఎంసీ కమిషనర్ వసూలు చేసినట్లుగా ముద్రించారు. ఇటీవల కొందరు వ్యాపారులు స్పందనలో ఫిర్యాదు చేయగా.. రాత్రికి రాత్రి స్లిప్పులు మార్చి.. కాంట్రాక్టర్ పేరుతో వసూలు చేయడం మొదలు పెట్టారు. ఈ విషయాలన్నీ తెలిసినా రెవెన్యూ సిబ్బంది మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతున్నారు. బయట ఉన్న దుకాణాలను తొలగించాలని వ్యాపారులు స్పందనలో ఫిర్యాదు చేస్తే.. తొలగించినట్లుగా సమాధానమిచ్చి ఉన్నతాధికారులను ఏమార్చుతున్నారు. ఇప్పటికైనా సక్రమంగా అమ్మకాలు నడిచేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. చదవండి: Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు! 30 కోట్లు దాటిన కేసులు! -
Plastic ban: ప్లాస్టిక్ అమ్మకాలపై ‘మహా’ కొరడా! రూ.75 వేల అపరాధ రుసుం..
Plastic use can lead to fines గాజువాక : ప్లాస్టిక్ అమ్మకాలపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న దుకాణాలపై దాడి చేసి భారీ ఎత్తున పాలిథిన్ సంచులను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారుల నుంచి అపరాధ రుసుం కూడా పెద్ద మొత్తంలో వసూలు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు గాజువాకలో ప్లాస్టిక్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు ఇటీవల జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదులు అందడంతో ఆయన స్పందించారు. ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని జోనల్ అధికారులను ఆదేశించడంతో పాటు గాజువాక జోనల్ కమిషనర్ డి.శ్రీధర్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రజారోగ్య విభాగం అధికారులు గాజువాక మార్కెట్లో ప్లాస్టిక్ సంచులను విక్రయిస్తున్న ఐదు దుకాణాలపై దాడి చేసి 500 కేజీల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారులనుంచి రూ.75వేల అపరాధ రుసుం వసూలు చేశారు. ప్లాస్టిక్ ఎవరు విక్రయించినా చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో భాగంగా స్వచ్ఛ నగరాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జోనల్ కమిషనర్ కోరారు. ప్లాస్టిక్ వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. చదవండి: Omicron: జనవరి మూడో వారం నాటికి 2 లక్షల యాక్టివ్ కేసులు! -
Dr. G Lakshmisha: పేపర్‌బాయ్ టూ ఐఏఎస్
యువతరం అంటే... అంచనా వేసేందుకు కాదు.. అన్వేషించడానికి.. నిర్ణయించడానికి కాదు.. అమలు చేయడానికి.. స్థిరమైన పనులు చేసేందుకు కాదు.. జీవితాన్ని సరికొత్తగా ఆవిష్కరించడానికి.. అవును.. కాస్త.. ప్రోత్సాహం.. ఆపై పట్టుదల ఉంటే.. పేదరికంతో పోటీపడుతూ అవకాశాల్ని అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చని అంటున్నారు.. జీవీఎంసీ కమిషనర్ డా.లక్ష్మీశ. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో తన జీవన ప్రయాణాన్ని పంచుకున్నారు. పేపర్‌బాయ్ నుంచి ఐఏఎస్‌గా సాగిన ప్రయాణంలో ఎదురైన ఆటుపోట్లను వివరించారు. – సాక్షి, విశాఖపట్నం కర్ణాటక రాష్ట్రంలోని హోలుగుండనహళ్లి అనే చిన్న కుగ్రామం మాది. అమ్మ లక్ష్మమ్మ కాయకష్టం చేసి మాకు ఆకలి తీర్చేది. నాన్న గంగముత్తయ్యతో కలిసి రోజూ కూలిపనులకు వెళ్లేది. రోజంతా కష్టపడేది. అన్నయ్య, నేను తిన్న తర్వాత మిగిలింది అమ్మ తినేది. వెక్కిరించిన పేదరికాన్ని దాటుకుంటూ వ్యవసాయ శాస్త్రవేత్తగా.. ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్‌గా.. తర్వాత ఐఏఎస్ అధికారిగా సాగిన ప్రయాణంలో.. ప్రతి అడుగులోనూ అమ్మ ఆశీస్సులే కనిపిస్తాయి. వ్యవసాయ శాస్త్రవేత్తగా ప్రయాణం.. అప్పట్లో వ్యవసాయ డిగ్రీకి ఎక్కువ క్రేజ్ ఉండేదని, ఈ డిగ్రీ పూర్తి చేస్తే బ్యాంకులో ఉద్యోగం వస్తుందని చెప్పేవారు. అందుకే బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకున్నాను. డిగ్రీ అయ్యాక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రావడంతో ఎమ్మెస్సీ కోసం అలహాబాద్ వెళ్లాను. అక్కడి నుంచి పీహెచ్డీ కోసం ఢిల్లీ వెళ్లాను. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ ఫెలోషిప్ వచ్చింది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ప్రయాణం ప్రారంభించాను. మధ్యలో సైకాలజీ కూడా చదివాను. అక్కడే నా జీవితం మరో మలుపు తిరిగింది. మూలాలు మరిచిపోను... ఎక్కడి నుంచి నా ప్రయాణం ప్రారంభమైందో నేను ఎప్పటికీ మరిచిపోను. అందుకే సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఐఏఎస్ అధికారిగా మారాను. పార్వతీపురంలో పనిచేసినప్పుడు అక్కడ గిరి గ్రామాలు చూస్తే.. సొంత ఊరిలో ఉన్నట్లుగానే అనిపించింది. అందుకే ఎక్కడ పనిచేసినా ఆ ప్రాంతంలోని అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేయాలన్న కాంక్షతో ముందడుగు వేస్తున్నాను. ఐఎఫ్ఎస్ వచ్చినా.. ఐఏఎస్ లక్ష్యంగా.. సైంటిస్టుగా చేస్తున్న రోజుల్లో సివిల్స్ ఎందుకు రాయకూడదన్న ఆలోచన మా స్నేహితుల మధ్య సరదాగా చర్చ వచ్చింది. అన్నయ్య వెంకటరమణయ్యతో మాట్లాడాను. అప్పటి వరకూ నాకున్న సందేహాల్ని అన్నయ్య మాటలతో నివృత్తి అయిపోయాయి. అప్పుడే నా మైండ్‌లో బలమైన లక్ష్యం స్థిరపడిపోయింది. 2009లో సివిల్స్ రాసినా ఫలితం లేదు. పట్టుదలతో రాస్తే 2010లో ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాను. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌గా పోస్టింగ్ వచ్చినా సంతృప్తి కలగలేదు. ప్రయత్నం ఆపలేదు. ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో 2013లో 275వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యాను. నా ఆనందానికి అవధులు లేవు. నా కంటే ఎక్కువ అమ్మ పడిన సంతోషం వెలకట్టలేనిది. కర్నూలు జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకొని కృష్ణా జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ వచ్చింది. తర్వాత పార్వతీపురం ఐటీడీఏ పీవోగా, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా.. ఇప్పుడు ఇలా.. మీముందు జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాను. తొలి సంతకం అర్ధాంగి సహకారం ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత కర్ణాటకకు చెందిన జ్ఞానేశ్వరి లక్ష్మితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. పాప పేరు ఆద్వి, బాబు పేరు సిద్ధార్థ చక్రవర్తి. ఆమె గృహిణే అయినా నాకు అడుగడుగునా అందిస్తున్న సహకారం మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను. సెలవుల్లో పొలం పనులే... పిల్లలకు సెలవొస్తే ఆటపాటలే ప్రధానం. కానీ మా జీవితంలో వాటికి తావుండేది కాదు. బడికి సెలవొస్తే.. చిన్నపాటి వ్యవసాయం చేసే నాన్న, అమ్మతో కలిసి పొలం పనులకు వెళ్లేవాళ్లం. అప్పుడప్పుడు ఊరిబయటికి వెళ్లి కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చే వాళ్లం. పారామోటర్‌లో సాహసయాత్ర చేస్తున్న డా.లక్ష్మీశ పేపర్ బాయ్‌గా రూ.300 వేతనం చిన్నతనంలో అనుభవించిన పేదరికంపై పగతోనే పగలు రాత్రి కష్టపడి చదివేవాడిని. ఇంటర్ చదివే సమయంలో నా ఖర్చుల కోసం ఇంటిపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే మా ఫ్రెండ్స్‌తో కలిసి పేపర్ బాయ్‌గా చేరాను. నెలకు రూ.300 ఇస్తే.. వంద రూపాయిలు అమ్మకు ఇచ్చి.. మిగిలిన రూ.200 నా ఖర్చులకు ఉంచుకునేవాడిని. ఉదయం 4 గంటలకు లేచి పేపర్ వేసి.. మళ్లీ తయారై.. కాలేజీకి వెళ్లేవాడిని. ఇంటర్ పూర్తయ్యేంత వరకు ఇలానే చేశాను. సమన్వయంతో నగరాభివృద్ధి సాక్షి, విశాఖపట్నం: అన్ని ప్రభుత్వ రంగ విభాగాలతో సమన్వయ పరచుకుంటూ మహా విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తానని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ తెలిపారు. జీవీఎంసీ కమిషనర్‌గా ఆయన శనివారం మధ్యాహ్నం వేద మంత్రోచ్ఛారణల నడుమ బాధ్యతలు స్వీకరించారు. తొలి సంతకం నవంబర్ నెలకు సంబంధించిన పింఛన్ల మంజూరు ఫైల్‌పై చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, అదనపు కమిషనర్ ఏవీ రమణి, చీఫ్ ఇంజినీర్ రవికృష్ణరాజు, ఎగ్జామినర్ వాసుదేవరెడ్డి, యూసీడీ పీడీ శ్రీనివాసరావు, ఎస్ఈలు వినయ్‌కుమార్, గణేష్‌బాబు, కేవీఎన్‌రవి, వేణుగోపాల్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో కమిషనర్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధి శాఖ తనకు కొత్తది అయినా నగరాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖలో గ్రేటర్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
సారు లేరు.. వదిలేశారు వీరు..!
విశాఖసిటీ: జీవీఎంసీ పరిధిలో పారిశుధ్యం పడకేసింది. వారం రోజుల కిందట వ్యక్తిగత సెలవుపై జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ వెళ్లిపోవడం, పలు కారణాల వల్ల ఇన్చార్జి కమిషనర్ మార్నింగ్ విజిట్స్ చేయకపోవడంతో పారిశుధ్యంపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అసలే వర్షాకాలం.. ఆపై ముసురుకుంటున్న వ్యాధులు, విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా జ్వరాలతో ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో వారి ఆరోగ్యంపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన జీవీఎంసీ.. నిర్లక్ష్యం చూపుతోంది. కమిషనర్ సెలవులో ఉండడంతో అడిగేవారు లేరనేలా కొన్నిచోట్ల పారిశుధ్య సిబ్బంది వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారంతో వీధులు కంపుకొడుతున్నాయి. పలువురు పారిశుధ్య కార్మికులు రోజువారీ పనులను నిర్వర్తిస్తుండగా.. మరికొన్ని చోట్ల డంపర్ బిన్లను కూడా ఖాళీ చేయని దుస్థితి ఏర్పడింది. ఇంకొన్ని చోట్ల ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే కార్మికులు రావట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఇంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను వీధుల్లో పారబోసేస్తున్నారు. ఇక కమిషనర్ రారంటగా..? కమిషనర్ హరినారాయణన్ మార్నింగ్ విజిట్ పేరుతో ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడి పారిశుధ్య పరిస్థితులు, టౌన్ ప్లానింగ్, రోడ్లు, మంచినీటి సరఫరా, గ్రీనరీ, పార్కుల నిర్వహణ మొదలైన అంశాలను పర్యవేక్షించేవారు. ఈ నెల 14 నుంచి కమిషనర్ వ్యక్తిగత సెలవుపై తమిళనాడు వెళ్లారు. ఆయన స్థానంలో ఇన్చార్జి కమిషనర్‌గా వుడా వీసీ బసంత్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా హరినారాయణన్ బదిలీపై ఊహాగానాలు రావడం, అదే సమయంలో దాదాపు 15 రోజుల పాటు ఆయన సెలవులో వెళ్లడంతో వదంతులు జోరందుకున్నాయి. ఈ నెలాఖరున జరిగే ఐఏఎస్‌ల ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఆయన బదిలీ అవుతున్నారనీ కార్పొరేషన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ జి.సృజన వస్తారని కొందరు, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వస్తారని మరికొందరు, హరినారాయణన్ బదిలీ కావడం లేదని ఇంకొందరు వ్యాఖ్యలు చేస్తుండడంతో కార్పొరేషన్లో ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒక వేళ ఆయన బదిలీ అయితే.. కొత్త కమిషనర్ వచ్చేంత వరకూ ఆడుతూ పాడుతూ పనిచేస్తామనే ఉద్దేశంతో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రేటర్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. కమిషనర్ హరినారాయణన్ మాత్రం.. పలు పనులకు సంబంధించిన నివేదికలు మెయిల్స్, వాట్సప్ ద్వారా పంపించమని చెబుతూ పరిశీలనలు మాత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా నో విజిట్.. ఈ నెల 16 నుంచి కమిషనర్ స్థానంలో ఇన్చార్జి కమిషనర్‌గా బసంత్‌కుమార్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పలు పరిపాలన పరమైన కారణాల వల్ల కమిషనర్ షెడ్యూల్లో ఒకటైన మార్నింగ్ విజిట్ చేయలేకపోతున్నారు. దీంతో పరిశీలించేవారే ఉండరనే ఉద్దేశంతో పారిశుధ్య సిబ్బందితో పాటు పలు విభాగాల సిబ్బంది సైతం విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. బాధ్యతగా వ్యవహరించాలి వారం రోజులుగా అధికారిక పనులపై పలు ప్రాంతాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అనంతరం పురపాలక శాఖ మంత్రి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాలతో అధికారులంతా నిమగ్నమయ్యారు. మరోవైపు సీఎంహెచ్వో సహా పలువురు ప్రజారోగ్య శాఖాధికారులు గుంటూరులో జరిగిన సదస్సుల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఇకపై గ్రేటర్ పరిధిలోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తాం. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి పనిచేయాలి. అప్పుడే నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచగలం.– పట్నాల బసంత్‌కుమార్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ -
బీచ్‌కు మరిన్ని సొబగులు
ద్వారకానగర్ : బీచ్ సుందరీకరణకు మరిన్ని మెరుగులు దిద్దాలని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ కొత్తజాలరిపేట, ఓడీఎఫ్ కమిటీ సభ్యులతో మాట్లాడి బహిరంగ మలవిసర్జన అరికట్టాడానికి తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. విశాఖను ఓడీఎఫ్ నగరంగా తీర్చిదిద్దాడానికి ఎంతో కృషి చేస్తున్నామని.... ప్రజలు ప్రజా మరుగుదొడ్లను వినియోగించుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బీచ్‌లోని గోకుల్ పార్కు, రాక్ గార్డెన్స్, జీవీఎంసీ పార్కు, వరుణ్ పార్కులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఐఆర్ఎఫ్కు కోట్లాది రూపాయలతో సుందరీకరణించినప్పటకీ తదుపరి నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించలేదని అభిప్రాయపడ్డారు. 15 రోజులకోసారి పుట్‌ఫాత్‌లను నీటితో శుభ్రం చేయాలని సూచించారు. బీచ్‌ను మరింత అందంగా తీర్చిదిద్దాడానికి అనువైన నీడనిచ్చేచెట్లను నాటాలని కోరారు. ఆర్కేబీచ్లో తొలగించిన బెంచీల స్థానంలో మళ్లీ ఏర్పాటు చేసి పరిసరాలను సుందరంగా తీర్చాదిద్దాలన్నారు. ఆయన వెంట జోనల్ కమిషనర్లు నల్లనయ్య, వి. చక్రధర్‌రావు, ఈఈలు రత్నాలరాజు, కష్ణారావు, సుధాకర్, మహేష్, ఎం. దామోదర్, ఏఎంవోహెచ్ డా. మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.