సాధారణంగా ఎక్కడైనా మార్కెట్ లోపలికి వెళ్తేనే మనకు కావల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి. కానీ.. పూర్ణామార్కెట్‌లో మాత్రం దీనికి పూర్తి భిన్నం. లోపలకుఒక్క అడుగు కూడా వేయాల్సిన అవసరం లేకుండానే అన్ని నడి రోడ్డుమీదే లభిస్తాయి. లోపల దుకాణాలు మాత్రం ఖాళీగానే దర్శనమిస్తాయి. ఎందుకంటే.. ఆశీలు వసూలు చేసే కాంట్రాక్టర్ అడ్డగోలు వ్యవహారాలకు దారి తీస్తున్నారు. జీవీఎంసీ రెవెన్యూ అధికారుల అండతో మార్కెట్ లోపల ఉన్న వ్యాపారుల పొట్టకొట్టేలా.. బయటనే చిల్లర దుకాణాలు ఏర్పాటు చేయిస్తూ అప్పనంగా దండుకుంటున్నారు. కార్పొరేషన్ ఖాతాలోకి మార్కెట్ లోపల ఉన్న దుకాణాల నుంచి వచ్చే చిల్లర విదిలించి.. రోడ్లపై అమ్మకాలు సాగించే వారి నుంచి అధికంగా వసూలు చేస్తూ.. ఆశీలు వ్యాపారాన్ని మూడు షెడ్డులు, ఆరు జంగిడీలుగా సాగిస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: పూర్ణా మార్కెట్‌లో పక్కాషాపులు 600, గ్యాంగ్‌వేజ్ షాపులు 600 వరకు ఉన్నాయి. వీటి ఆశీళ్ల ద్వారా జీవీఎంసీకి ఏటా రూ.1.20 కోట్ల వరకూ ఆదాయం వస్తుంది. మార్కెట్ లోపల ఉన్న దుకాణాలకు రోజువారీ ఆశీలు రూ.10 నుంచి రూ.14 వరకూ వసూలు చేస్తుంటారు. వ్యాపార లావాదేవీలన్నీ మార్కెట్‌లోపల ఉన్న షాపుల ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. కానీ.. నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ బయట రోడ్లపైనే పలువురు చిరువ్యాపారుల పేరుతో (జంగిడీల దుకాణాలు) వ్యాపారాలకు తెరతీశారు. దీంతో మార్కెట్‌కు వెళ్లే రోడ్డు మొత్తం పండగ సమయాల్లోనూ సాయంత్రం వేళల్లోనూ మొత్తం రద్దీగా మారిపోతుంది. ప్రతి వస్తువూ రోడ్డుపైనే దొరుకుతుండటంతో కొనుగోలుదారులు లోపలికి వెళ్లకపోవడంతో మార్కెట్‌లో చట్టప్రకారం వ్యాపారం చేస్తున్న వారు పూర్తిగా నష్టపోతున్నారు.
రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకూ వసూలు
మార్కెట్ బయట ప్రతి రోజూ సుమారు 50 మందికి పైగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. సదరు ఆశీలు వసూలు చేస్తున్న కాంట్రాక్టరు ఒక్కో అమ్మకందారుడు నుంచి రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకూ దండుకుంటున్నారు. పండగ సమయంలో కచ్చితంగా ఒక్కో వ్యాపారి రూ.1000 వరకూ చెల్లించాల్సిందే. అయితే.. ఈ డబ్బులేవీ జీవీఎంసీ ఖాతాలకు వెళ్లకుండా కాంట్రాక్టర్, జీవీఎంసీ జోన్–4 రెవెన్యూ సిబ్బంది జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. కారు పార్కింగ్ కోసం ఉన్న స్థలంలోనూ ఈ చిన్న దుకాణాలే దర్శనమిస్తున్నా.. వారిపై రెవెన్యూ సిబ్బంది కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు. పార్కింగ్ చేసుకునేందుకు కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అడ్డగోలు షెడ్లకు కూడా ట్రేడ్‌లైసెన్స్‌లు
ఒకప్పుడు సైకిల్స్‌పై వచ్చి పూర్ణామార్కెట్ ఎదురుగా నిలబడి వ్యాపారాలు చేసుకునేవారు. అలాంటి వారి నుంచి జీవీఎంసీ జోన్–4 రెవెన్యూ అధికారులు మామూళ్లు లాగేసుకొని.. వారికి ట్రేడ్‌లైసెన్స్‌లు కూడా కట్టబెట్టేశారు. గేటు బయట ఎలాంటి షెడ్లు ఏర్పాటు చేసి విక్రయాలు చెయ్యకూడదన్న నిబంధనలున్నా.. వాటిని రెవెన్యూ అధికారులు చెత్తబుట్టలో పడేశారు. ఈ విషయంపై ఇటీవల ఉన్నతాధికారులకు మార్కెట్‌లో ఉన్న వ్యాపారులు ఫిర్యాదు చేస్తే నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించకుండా లోపల ఉన్న షాపుల్ని సీజ్ చేసేశారు. ఈ విషయంపై వ్యాపారులు నిలదీయడంతో.. రెండురోజుల తర్వాత సీజ్‌లని తొలగించారు. అయినా బయట ఉన్న అక్రమ వ్యాపారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఆశీలు ఇవ్వండి.. మీ జీవీఎంసీ కమిషనర్..
ప్రతి మార్కెట్‌లోనూ ఆశీలుకు సంబంధించిన రసీదులో జీవీఎంసీ పేరు, కాంట్రాక్టర్ పేరు ఉండాలి. కానీ పూర్ణామార్కెట్ ఆశీలు స్లిప్పులపై మాత్రం జీవీఎంసీ కమిషనర్ వసూలు చేసినట్లుగా ముద్రించారు. ఇటీవల కొందరు వ్యాపారులు స్పందనలో ఫిర్యాదు చేయగా.. రాత్రికి రాత్రి స్లిప్పులు మార్చి.. కాంట్రాక్టర్ పేరుతో వసూలు చేయడం మొదలు పెట్టారు. ఈ విషయాలన్నీ తెలిసినా రెవెన్యూ సిబ్బంది మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతున్నారు. బయట ఉన్న దుకాణాలను తొలగించాలని వ్యాపారులు స్పందనలో ఫిర్యాదు చేస్తే.. తొలగించినట్లుగా సమాధానమిచ్చి ఉన్నతాధికారులను ఏమార్చుతున్నారు. ఇప్పటికైనా సక్రమంగా అమ్మకాలు నడిచేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.
చదవండి: Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు! 30 కోట్లు దాటిన కేసులు!
Comments
Please login to add a commentAdd a comment