శంకరమఠం రోడ్డులో వ్యర్థాలతో నిండిన డంపర్ బిన్
విశాఖసిటీ: జీవీఎంసీ పరిధిలో పారిశుధ్యం పడకేసింది. వారం రోజుల కిందట వ్యక్తిగత సెలవుపై జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ వెళ్లిపోవడం, పలు కారణాల వల్ల ఇన్‌చార్జి కమిషనర్ మార్నింగ్ విజిట్స్ చేయకపోవడంతో పారిశుధ్యంపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అసలే వర్షాకాలం.. ఆపై ముసురుకుంటున్న వ్యాధులు, విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా జ్వరాలతో ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో వారి ఆరోగ్యంపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన జీవీఎంసీ.. నిర్లక్ష్యం చూపుతోంది. కమిషనర్ సెలవులో ఉండడంతో అడిగేవారు లేరనేలా కొన్నిచోట్ల పారిశుధ్య సిబ్బంది వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారంతో వీధులు కంపుకొడుతున్నాయి. పలువురు పారిశుధ్య కార్మికులు రోజువారీ పనులను నిర్వర్తిస్తుండగా.. మరికొన్ని చోట్ల డంపర్ బిన్‌లను కూడా ఖాళీ చేయని దుస్థితి ఏర్పడింది. ఇంకొన్ని చోట్ల ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే కార్మికులు రావట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఇంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను వీధుల్లో పారబోసేస్తున్నారు.
ఇక కమిషనర్ రారంటగా..?
కమిషనర్ హరినారాయణన్ మార్నింగ్ విజిట్ పేరుతో ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడి పారిశుధ్య పరిస్థితులు, టౌన్ ప్లానింగ్, రోడ్లు, మంచినీటి సరఫరా, గ్రీనరీ, పార్కుల నిర్వహణ మొదలైన అంశాలను పర్యవేక్షించేవారు. ఈ నెల 14 నుంచి కమిషనర్ వ్యక్తిగత సెలవుపై తమిళనాడు వెళ్లారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జి కమిషనర్‌గా వుడా వీసీ బసంత్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా హరినారాయణన్ బదిలీపై ఊహాగానాలు రావడం, అదే సమయంలో దాదాపు 15 రోజుల పాటు ఆయన సెలవులో వెళ్లడంతో వదంతులు జోరందుకున్నాయి. ఈ నెలాఖరున జరిగే ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్‌లో భాగంగా ఆయన బదిలీ అవుతున్నారనీ కార్పొరేషన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ జి.సృజన వస్తారని కొందరు, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వస్తారని మరికొందరు, హరినారాయణన్ బదిలీ కావడం లేదని ఇంకొందరు వ్యాఖ్యలు చేస్తుండడంతో కార్పొరేషన్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒక వేళ ఆయన బదిలీ అయితే.. కొత్త కమిషనర్ వచ్చేంత వరకూ ఆడుతూ పాడుతూ పనిచేస్తామనే ఉద్దేశంతో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రేటర్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. కమిషనర్ హరినారాయణన్ మాత్రం.. పలు పనులకు సంబంధించిన నివేదికలు మెయిల్స్, వాట్సప్ ద్వారా పంపించమని చెబుతూ పరిశీలనలు మాత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వారం రోజులుగా నో విజిట్..
ఈ నెల 16 నుంచి కమిషనర్ స్థానంలో ఇన్‌చార్జి కమిషనర్‌గా బసంత్‌కుమార్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పలు పరిపాలన పరమైన కారణాల వల్ల కమిషనర్ షెడ్యూల్‌లో ఒకటైన మార్నింగ్ విజిట్ చేయలేకపోతున్నారు. దీంతో పరిశీలించేవారే ఉండరనే ఉద్దేశంతో పారిశుధ్య సిబ్బందితో పాటు పలు విభాగాల సిబ్బంది సైతం విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
బాధ్యతగా వ్యవహరించాలి
వారం రోజులుగా అధికారిక పనులపై పలు ప్రాంతాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అనంతరం పురపాలక శాఖ మంత్రి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాలతో అధికారులంతా నిమగ్నమయ్యారు. మరోవైపు సీఎంహెచ్‌వో సహా పలువురు ప్రజారోగ్య శాఖాధికారులు గుంటూరులో జరిగిన సదస్సుల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఇకపై గ్రేటర్ పరిధిలోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తాం. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి పనిచేయాలి. అప్పుడే నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచగలం.– పట్నాల బసంత్‌కుమార్, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment