Gyms
-
అఫీషియల్: జిమ్‌లు, పార్కుల్లో మహిళలకు నో ఎంట్రీ
కాబూల్: మహిళా హక్కులను, స్వేచ్ఛను హరిస్తూ అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ వారం నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించకపోవడం, పార్కులు, జిమ్‌లలో మహిళలు, పురుషులు విభజనను పాటించకపోవడం వల్లే తాజాగా ఈ ఆంక్షలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వ ప్రతినిధి గురువారం చెప్పారు. 2021 ఆగస్ట్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. మాధ్యమిక, ఉన్నత విద్యా పాఠశాలల్లో బాలికల ప్రవేశాన్ని నిషేధించారు. అనేక రంగాల్లో మహిళా ఉద్యోగులను తొలగించారు. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధారణ తప్పనిసరి చేశారు. -
కరోనా బీభత్సం: రేపటి నుంచి సినిమాహాళ్లు బంద్
సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం కోవిడ్ ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, మాల్స్, బార్స్, సెలూన్లను మూసేయనుంది. ఈ నెల 26 నుంచి ఇది అమల్లోకి వస్తుందని శనివారం ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెస్టారెంట్లు, ఇతర కాఫీ షాపుల నుంచి టేక్ అవేలకి మాత్రమే అనుమతి ఉంది. పెళ్లిళ్లకి 50 మంది, అంత్యక్రియలకి 25 మంది మాత్రమే హాజరవాలి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా తమిళనాడుకు రావాలనుకుంటే ఇ–రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూ 10 నుంచి ఉదయం 4 వరకు, ఆదివారం లాక్డౌన్ కొనసాగుతుంది. -
ఇలా చెమటోడ్చి ఎన్ని రోజులైందో...
హైదరాబాద్: నాలుగు నెలల తర్వాత జిమ్‌లో శ్రమించడం పట్ల ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంతోషం వ్యక్తం చేసింది. అన్‌లాక్– 3 మార్గదర్శకాల్లో భాగంగా ఆగస్టు 5 నుంచి వ్యాయామశాలలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో... సింధు బుధవారం జిమ్‌లో చెమటోడ్చింది. పూర్తిస్థాయి జిమ్ సెషన్లో పాల్గొన్న ఆమె ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. చాలా కాలం తర్వాత ఇలా కసరత్తులు చేయడం ఆనందంగా ఉందని పేర్కొంది. ట్రైనర్ సహాయంతో బరువులు ఎత్తడం, స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేసింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలకు అంతరాయం ఏర్ప డిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సెప్టెంబర్‌లో జరగాల్సిన నాలుగు టోర్నీలను రద్దు చేసింది. -
జిమ్‌లు రేపట్నుంచే..
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: నాలుగున్నర నెలల విరామం తర్వాత దేశవ్యాప్తంగా జిమ్‌లు, యోగా కేంద్రాలు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. అన్‌లాక్–3.0లో వీటిని తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘యోగా కేంద్రాలు, జిమ్‌లలో కరోనా వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను’ సోమవారం జారీ చేసింది. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారిని మాత్రమే యోగా కేంద్రాలు, జిమ్‌లలోకి అనుమతించాలని తేల్చిచెప్పింది. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలోని యోగా కేంద్రాలు, జిమ్‌లు మూసి ఉంటాయి. ఈ జోన్ల వెలుపల ఉన్న వాటిని మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తారు. మార్గదర్శకాలివే.. ► స్పాలు, స్టీమ్ బాత్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలి. ► యోగా సెంటర్లు, జిమ్‌లలో అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవాలి. వ్యక్తుల మధ్య కనీసం 4 మీటర్ల దూరం ఉండేలా రీడిజైనింగ్ చేయించాల్సి ఉంటుంది. ► జిమ్‌లో సెంట్రలైజ్డ్ ఏసీ లేదా సాధారణ ఏసీ ఉంటే గది ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలి. వెంటిలేషన్ అధికంగా ఉండేలా చూడాలి. ► 65 ఏళ్ల వయసు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు జిమ్‌లకు వెళ్లకపోవడమే మంచిది. ► హ్యాండ్ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతే ఎవరైనా యోగా సెంటర్/జిమ్ లోపలికి ప్రవేశించాలి. ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ టెస్టు కూడా చేయించుకోవడం తప్పనిసరి. ► ఫేస్ మాస్కు/కవర్ ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. ► యోగా కేంద్రం/జిమ్‌లో ఉన్నంత సేపు ఆరోగ్యసేతు యాప్ ఉపయోగించాలి. ► జిమ్/యోగా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితో పాటు విజిటర్స్ తప్పకుండా ఫేస్ షీల్డ్‌లు ధరించాలి. ► కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి కఠినమైన వ్యాయామాలు చేసేముందు పల్స్ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. -
హైటెక్ రాముడు
సాక్షి, రామచంద్రపురం(తూర్పుగోదావరి) : సామాన్య మధ్య తరగతి వ్యక్తి. చదివింది ఏడో తరగతే. అయినా ఆరితేరిన మెకానికల్ ఇంజినీర్లా యంత్రాలు తయారుచేస్తాడు జిల్లాలోని రామచంద్రపురం మండలం ద్రాక్షారామకు చెందిన రెడ్డి రాము. ఆ ఊరిలో బియ్యంపేటకు చెందిన అతన్ని అంతా ఇంజినీరూ అని పిలుస్తారు. ఎవరొచ్చి ఏ అవసరం చెప్పి తన పని సులువు చేయమని అడిగినా తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఓ యంత్రం చేసి ఇచ్చేస్తాడు. 16 ఏళ్ల వయసు చిత్ర నిర్మాత అంగర సత్యానికి చెందిన ట్రాక్టర్ ట్రక్కులు తయారు చేసే ఇంజినీరింగ్ వర్క్స్‌లో రాము పనికి కుదిరాడు. అప్పటికి అతడి వయసు 14. తరువాత తోటపేటలో ఉన్న చెల్లూరి భూరికి చెందిన లేతు వర్కుషాపులో, అనపర్తి మండలం పందలపాకలో కిలపర్తి సూర్యారావు చెందిన లేతు వర్కుషాపులో పనిచేశాడు. చివరిగా ఆ అనుభవంతో ద్రాక్షారామలో ఇంటి కిటికీలకు మెష్‌లు, మెట్లకు గ్రిల్స్ తయారు చేసే వెల్డింగ్ షాపును సొంతంగా ప్రారంభించాడు. జీవనోపాధికి వెల్డింగ్ వర్కు చేస్తున్నా బుర్ర నిండా ఇంజినీంగ్ ఆలోచనలే. ఇవి చాలవన్నట్టు మరోవైపు బాడీ బిల్డింగ్. ఈ ఆసక్తితో స్థానిక శాకా వీరభద్రరావుకు వ్యాయామశాలలో చేరాడు. అక్కడ అతని దృష్టి వ్యాయామ పరికరాలపై పడింది. విడివిడిగా ఉన్న పరికరాలపై పడింది. వాటి స్థానంలో బహుళ ప్రయోజనకరమైన పరికరాల తయారీ ప్రారంభించాడు. ఇతని దగ్గర వ్యాయామ పరికరాలు కంపెనీ పరికరాలకు దీటుగా, తక్కువ ధరలోనే దృఢంగా ఉంటున్నాయని ఆనోటా ఈనోటా పాకి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆర్డర్లు రావడం మొదలుపెట్టాయి. రాము రూపొందించిన మల్టీపర్పస్ అబ్డామిన్ మెషీన్, ఇటుక తయారీ యంత్రం రాజమహేంద్రవరంలోని గౌతమి వ్యాయామశాల వంటి అనేక వ్యాయామశాలలు రాముతో అనేక వ్యాయామ పరికరాలు తయారు చేయించుకున్నారు. రాము అక్కడితో ఆగలేదు. ఇలా ఎవరి అవసరాలకు తగ్గట్టు వారికి ఎన్నో పరికరాలు చేసి ఇచ్చేవాడు. రామచంద్రపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్టణాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ప్రాజెక్టుల కోసం రామును సంప్రదించి వారి ప్రాజెక్టులు తయారు చేయించుకుని వెళ్తుండడం ద్రాక్షారామకే గర్వకారణం. రాము తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఇటుకల తయారీ యంత్రం కోసం ఏళ్ల తరబడి శ్రమించాడు. కంపెనీలు తయారు చేసే ఇటుకల తయారీ మెషీన్లు ఉన్నా, మరింత సులువుగా పని జరిగేలా పలు నమూనాల్లో ఇటుకల తయారీ యంత్రాలను రూపొందించడంలో ఆరితేరాడు. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి ఇటుకల తయారీదారులు వచ్చి రాముతో ఆ యంత్రాలు తయారు చేయించుకుంటున్నారు. మోటారు సైకిల్ ఇంజిన్‌తో చిన్నపాటి జీపు పొలం గట్లపై వాడుకోవడానికి అనువుగా చిన్నపాటి జీపును రూపొందిస్తున్నాడు రాము. పాత వాహనాల్లోని పార్టులు ఉపయోగించుకుని రూపొందించే పనిలో ఉన్నాడు. మోటారు సైకిల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నా దీనికి రివర్స్ గేర్ కూడా ఏర్పాటు చేస్తుండటం విశేషం. -
బరువు తగ్గడానికి ఫుల్లుగా లాగించండి
జీఎమ్ డైట్ ఒక విలక్షణమైన డైట్. తమ సంస్థలోని ఉద్యోగులు బరువు పెరగకుండా ఆరోగ్యకరంగా ఉండాలని ‘జనరల్ మోటార్స్’ సంస్థ అనేక పరిశోధనల తర్వాత ఒక డైట్‌ను రూపొందించింది. ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారాన్ని కడుపునిండా తిన్నప్పటికీ బరువు పెరగరన్నది ఈ డైట్ ప్రక్రియ సిద్ధాంతం. ప్రయత్నించండి... బరువు తగ్గండి. ‘జీఎమ్ డైట్’ అంటే ‘జనరల్ మోటార్స్ డైట్’కు సంక్షిప్తరూపం. ఈ డైట్‌తో కేవలం ఒక వారంలో దాదాపు ఆరేడు కిలోల వరకు తగ్గవచ్చు. వారంలోని ఒక్కో రోజు ఒక్కో విధమైన ఆహారం (ఫుడ్) లేదా ఆహార సముదాయాన్ని (ఫుడ్ గ్రూపును) తీసుకోవడం ఈ డైట్ ప్రత్యేకత. జీఎమ్ డైట్ విధానం కొవ్వులను వేగంగా మండించేలా చేస్తూ బరువు తగ్గిస్తుంది. ఈ విధానంలో ఎప్పుడూ ఒంటికి క్యాలరీలు అవసరమవుతూ ఉంటాయి. అవి దొరక్క ఒంట్లోని క్యాలరీలు దహించుకుపోతూ ఉండటం వల్ల బరువు తగ్గుతుంది. జీఎమ్ డైట్ ఎలా ఉపయోగపడుతుందంటే... జీఎమ్ డైట్లో తీసుకునే ఆహారాలు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. కొవ్వులను మరింతగా దహనం చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ ప్రక్రియలో తీసుకునే ఆహారాలు పుష్కలమైన నీటిపాళ్లను కలిగి ఉంటాయి. అందువల్ల ఇవన్నీ ఒంట్లోని కొన్ని వ్యర్థాలు, విషాలు బయటకు వెళ్లేలా చేయడంలో సమర్థంగా పని చేస్తాయి. ఈ డైట్ విధానం వల్ల ప్రయోజనం పొంది, దీన్ని ఆమోదించేవారు చెప్పే మాట ఏమిటంటే... ఐదు రోజుల నుంచి ఏడు రోజుల గడువు ఇస్తూ మాటిమాటికీ ఈ ఆహార ప్రక్రియను రిపీట్ చేస్తూ కొనసాగించడం వల్ల చాలా బరువు తగ్గొచ్చని, మళ్లీ బరువు పెరగకుండా ఉండొచ్చని. ఇంకా ఏమేమి తీసుకోవాలి... దాంతో ప్రయోజనం ఏమిటి? ►ఈ ఆహార ప్రక్రియలో రోజూ 8 – 12 గ్లాసుల నీళ్లు తీసుకుంటూ ఉండటం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు ఒంట్లోంచి అనవసర పదార్థాలు బయటకు విసర్జితమవుతాయి. ►ఈ ప్రక్రియ సమయంలో వ్యాయామం చేయడం తప్పనిసరి కాదుగానీ అభిరుచి ఉంటే చేయవచ్చు. అలా చేయదలచినప్పుడు మొదటి మూడు రోజులు మాత్రమే చేయాలి. ► ఈ ప్రక్రియను అనుసరించేవారు ప్రతిరోజూ రెండు నుంచి మూడు గిన్నెల (బౌల్స్‌లో) ‘జీఎమ్ వండర్ సూప్’ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సూప్‌ను క్యాబేజ్, సెలెరీ, టొమాటోలు, ఉల్లిగడ్డలు, బెల్పెప్పర్స్తో తయారుచేస్తారు. ఇది మనమూ చేసుకోవచ్చు. పై పదార్థాలతో మనం చారు కాచుకున్నట్లుగానే దీన్ని తయారు చేసుకోవచ్చు. జీఎమ్ డైట్ పాటించే సమయంలో కొన్ని సూచనలు ► జీఎమ్ డైట్ పాటించేవారు కాఫీలు తాగవచ్చా అనే సందేహం వస్తుంది. కాఫీలను నిపుణులు సిఫార్సు చేయరు. అయితే హెర్బల్ టీ మాత్రం పరిమితంగా కొన్నిసార్లు తీసుకోవచ్చు. ►జీఎమ్ వండర్సూప్కు ఏవైనా ప్రతిబంధకాలు ఉన్నాయా అని కొందరు అడుగుతుంటారు. అది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రోజులో రెండు మూడు సార్లైనా దీన్ని తీసుకోవచ్చు. డైట్ పాటించే సమయంలో ఆకలిగా అనిపించినప్పుడు దీన్ని తీసుకోవచ్చు. ► డైట్ ప్లాన్‌లో ఉండగా ఆల్కహాల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ఆల్కహాల్‌తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు ఏవీ లేవు. ► డైట్ ప్లాన్‌లో ఉన్నప్పుడు బయట తినాల్సిన పరిస్థితి ఏర్పడితే బయటి ఆహారం తీసుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. అయితే డైట్‌ప్లాన్‌లో ఉన్నప్పుడు బయటి ఆహారం ఎలాంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. మీరు పూర్తిగా పాటించగలిగే సమయంలోనే డైట్‌ను ప్లాన్ చేసుకోవాలి. బయటి ఆహారాల్లో ప్రాసెస్ చేసినవి ఉండవచ్చు. హానికారక రసాయనాలు కలిసిన ఆహారపదార్థాలూ ఉండవచ్చు. ఉదాహరణకు బ్రెడ్ తయారీకి ఉపయోగించే పిండిలోనూ, ఇతర మాంసాహారాల్లోనూ కొన్ని కండిషనర్లు, సల్ఫేట్స్, మోనోసోడియమ్ గ్లుటామేట్ వంటి రుచిని ఇచ్చే చైనా ఉప్పు వంటివి, నైట్రేట్లు, ఫాస్ఫేట్లు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తీపిని ఇచ్చే అనేక పదార్థాలతో పాటు ఎక్కువ మోతాదులో ఉప్పు కూడా ఉండవచ్చు. అసలు జీఎమ్ డైట్ పాటించేదే వీటన్నింటి నుంచి దూరంగా ఉండటం కోసమే. అలాంటప్పుడు అవి తినాల్సి వస్తే జీఎమ్ డైట్ పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలేమీ ఒనగూరవు. ►నాలుగోరోజున పాలు తీసుకోవాలని జీఎమ్ డైట్ నిబంధన కదా... ఒకవేళ పాలు అంత ఇష్టంగా లేకపోతే మజ్జిగ లేదా పెరుగు తినవచ్చా అని చాలామందిలో సందేహాలు వస్తుంటాయి. అయితే పాలు తీసుకోవడం అంతగా ఇష్టపడకపోతే పెరుగు లేదా మజ్జిగ తీసుకోవచ్చు. అయితే పెరుగు లేదా మజ్జిగలో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోకూడదు. ► జీఎమ్ డైట్‌ను అనుసరించడంలో భాగంగా చపాతీలు, గోధుమలు, తృణధాన్యాలు, బ్రెడ్ వంటివి ఏమాత్రం తీసుకోకూడదు. ►రోజూ పొద్దున్నే నిమ్మనీళ్లలో తేనె కలుపుకొని తాగడం మంచిదంటారు కదా... మరి జీఎమ్ డైట్ సమయంలో ఈ పని చేయవచ్చా అని కొంతమందిలో ఒక సందేహం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అనుసరించేవారు తేనె తీసుకోకూడదు. దానికి బదులు నిమ్మకాయనీరు (చక్కెర లేకుండా) ఎంతైనా తీసుకోవచ్చు. ►శాకాహారులు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకోదగినవి... కొబ్బరినూనె, ఆలివ్‌నూనె, వెన్న లేదా నెయ్యి. కొందరు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా పెరుగు కూడా తీసుకుంటారు. అది కూడా మంచిదే. ► జీఎమ్ డైట్లో భాగంగా ఉప్పు, మిరియాలు లేదా ఇతర సుగంధద్రవ్యాలు (స్పైసెస్) తీసుకోవచ్చా అంటే... ఉప్పు చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ డైట్లో ఉన్నవారు చాలా ఎక్కువగా నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మూత్రం రూపంలో మనలోంచి వెళ్లిపోయే లవణాల కోసం ఉప్పు తీసుకోవడం అవసరమే అయినా దాన్ని చాలా పరిమితంగానే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. సముద్రపు ఉప్పు అయితే ఇంకాస్త మంచిది. మిరియాల వంటి చెట్ల నుంచి వచ్చే (హెర్బల్) సుగంధద్రవ్యాలన్నీ తీసుకోవచ్చు. మీ ఆహారానికి మంచి ఫ్లేవర్ తెచ్చుకొని, తినేందుకు అనువైనవిగా చేసుకునేందుకు ఈ డైట్లో స్పైసెస్ ఒక మంచి మార్గం. ►జీఎమ్ డైట్లో భాగంగా ఎండుఫలాలను (నట్స్) తీసుకోవడం ఏమాత్రం సరికాదు. అయితే మొదటిరోజున, మూడోరోజున... ఇలా జీఎమ్ డైట్ అనుమతించిన రోజుల్లో సాధారణ తాజా ఫలాలను మాత్రం తీసుకోవచ్చు. నట్స్ లేదా డ్రైఫ్రూట్స్‌లో పోషకాలన్నీ చాలా గాఢతతో చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్ది ఆహారంతోనే ఎక్కువ పోషకాలు ఒంట్లోకి వెళ్తాయి. అందుకే జీఎమ్ డైట్ పాటిస్తున్న కాలంలో వాటిని తీసుకోడానికి వీల్లేదు. అయితే డైట్ ప్లాన్ ముగిశాక మాత్రం... చాలా కొద్ది కొద్ది పరిమితుల్లో అప్పుడప్పుడు మాత్రం వాటిని తీసుకోవచ్చు. ► జీఎమ్ డైట్ ప్లాన్ వ్యవధి ముగిశాక ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది చాలామందిలో ఉండే ఒక సందేహం. ఎవరికి వారు తమ సాధారణ ఆహారాన్ని తీసుకోవచ్చు. అయితే మునపటిలా ఏది పడితే అది... ఎంత పడితే అంత, ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా... మంచి ఆరోగ్యకరమైన సమతుల ఆహారం, నిర్ణీతమైన వేళలకు తింటూ మంచి జీవనశైలిని పాటించాలి. మంచి సమతుల ఆహారం అంటే... మీ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అన్నీ సమపాళ్లలో అందేలాంటి భోజనం. అందులో ఆకుకూరలు, కాయగూరల వంటివి చాలా ఎక్కువగా ఉండాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. పొట్టు తీయని హోల్ గ్రెయిన్స్ తినడం చాలా మంచిది. అప్పుడు మాత్రమే జీఎమ్ డైట్‌తో ఒనగూరిన ఫలితాలు కాస్తంత ఎక్కువ రోజులు ఉంటాయి. ► జీఎమ్ డైట్ ప్లాన్ వ్యవధి ముగిశాక... యథాతథంగా తింటున్నప్పుడు మళ్లీ బరువు పెరుగుతామా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అవును... ముందుగా పేర్కొన్నట్లు మంచి సమతులాహారం తీసుకోకుండా... ఇష్టం వచ్చినట్లుగా తింటూ సక్రమమైన జీవనశైలి పాటించకపోతే... చాలా కొద్దికాలంలోనే మళ్లీ బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. అయితే తగ్గిన బరువు అలాగే ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా మంచి ఆహారపు అలవాట్లు, మంచి జీవనశైలిని అనుసరించాలి. అయితే కొందరిలో థైరాయిడ్ వంటి ఆరోగ్యకారణాల వల్ల బరువు పెరుగుతుంటే మాత్రం వారిలో ఈ డైట్ వల్ల ప్రయోజనం ఉండదు. వారు తమకు ఉన్న అసలు సమస్య (అండర్లైయింగ్ ప్రాబ్లమ్)కు చికిత్స తీసుకోవాలి. ► జీఎమ్ డైట్‌ను మొదలు పెట్టాక అదేపనిగా దీన్ని కొనసాగించవచ్చా... అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే నిర్ణీత వ్యవధి కోసం దీన్ని పాటించాక... మళ్లీ మొదలు పెట్టడానికి తప్పకుండా గ్యాప్ ఇవ్వాలి. జీఎమ్ డైట్ప్లాన్నే ఒక జీవనశైలి అలవాటుగా మార్చుకోకూడదు. ఏదైనా డైట్‌ప్లాన్ మళ్లీ ప్రారంభించాలని అనుకుంటే మాత్రం... కనీసం రెండు వారాల వ్యవధి తర్వాత మళ్లీ ఆ డైట్‌ప్లాన్ మొదలుపెట్టాలి. ► జీఎమ్ డైట్ పాటిస్తున్నప్పుడు యోగా చేయవచ్చా లేదా అన్నది చాలామందిలో ఉండే సందేహం. అయితే జీఎమ్ డైట్ పాటిస్తూ యోగా చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. వ్యాయామం చేయాలన్న నియమేమీ లేదుగానీ... ఒకవేళ ఇష్టమై చేస్తుంటే మాత్రం మంచిదే. అయితే చాలా శ్రమతో కూడుకున్న వ్యాయామాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగాలాంటివీ, శారీరక శ్రమ లేనివి మాత్రం మామూలుగానే చేసుకోవచ్చు. గమనిక : జీఎమ్ డైట్‌ను పాటించే సమయంలో మొదటి రెండు రోజులు తగిన ప్రోటీన్, మిగతా రోజుల్లో అన్ని పోషకాలు అందక కొందరిలో సమస్యలు రావచ్చు. అందుకే దీన్ని ప్రారంభించాలనుకున్న వారు ఒకసారి డాక్టర్ లేదా డైట్ నిపుణులను సంప్రదించి, తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా డైట్‌ప్లాన్ పొంది అప్పుడు మొదలుపెట్టడం మంచిది. జీఎమ్ డైట్ ప్రతికూలతలు ఈ ఆహార ప్రక్రియలో కొన్ని రకాల ప్రతికూలతలు ఉన్నాయి. అవి... ►ఇది బరువు తగ్గిస్తుంది. కానీ ఈ ఆహారం బరువును ఎలా తగ్గిస్తుందన్న విషయంలో ఎలాంటి నిరూపిత అధ్యయనమూ లేదు. ►ఈ ఆహారం సమతులాహారం కాదు. దీన్ని తీసుకున్నప్పుడు కొన్ని రకాల అసంతృప్తులు, ఆకలి ఉంటాయి. రకరకాల ఆహారాలు తీసుకుంటున్నప్పుడు మనకు అవసరమైన కొన్ని సూక్ష్మపోషకాలు ఒంటికి అందకపోవచ్చు. ►వారంలోని చాలా రోజుల్లో ఒంటికి అవసరమైన ప్రోటీన్ అందదు. అందినది చాలా తక్కువ. అది సరిపోదు. ► ముందుగా చెప్పినట్లే చాలా సందర్భాల్లో ఒంటికి అవసరమైన అన్ని పోషకాలు అందవు. ముఖ్యంగా మొదటి మూడు రోజులూ ఒంటికి అవసరమైన కొవ్వులు, విటమిన్ బి12, ఐరన్, క్యాల్షియమ్ వంటివి లోపించే ప్రమాదం ఉంది. ►జీఎమ్ డైట్‌తో ఒనగూరే ప్రయోజనం కేవలం తాత్కాలికం. అందుకే కొంత వ్యవధి ఇస్తూ మాటిమాటికీ చేయాలంటూ దీనితో ప్రయోజనం పొంది, దీన్ని ఆమోదించిన వారు చెబుతుంటారు. జీఎమ్ డైట్ పాటించే పద్ధతి డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ప్లాగింగ్ చేద్దాం చలో
వాకింగ్ అంటే తెలుసు, జాగింగ్ అంటే తెలుసు, మరి ప్లాగింగ్ అంటే మీకు తెలుసా ? వంట్లో కొవ్వు కరిగించే కొత్త ట్రెండ్ ఇది. పశ్చిమ దేశాలను ఊపేస్తున్న ఈ కొత్త ఫిట్నెస్ క్రేజ్ ఇప్పుడు భారత్‌కూ పాకింది. స్వామికార్యంతో పాటు స్వకార్యం అన్నట్టుగా అటు వంటికి ఫిటినెస్, ఇటు పర్యావరణానికి హితం అదెలాగంటే... ఇవాళ రేపు అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిపోతోంది. ఉదయాన్నే లేవగానే కాసేపు రోడ్ల మీద పరుగులు తీయాలి.. వళ్లు విల్లులా వంచి చెమట్లు పట్టేలా వ్యాయామం చేయాలి.. అప్పుడే అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. అదే చేత్తో రోడ్డు పక్కనే ఉన్న చెత్తా చెదారాన్ని ఊడ్చేస్తే.. ఎలాగుంటుంది. ? పొద్దున్నే వీధుల్లో బ్రిస్క్ వాకింగ్లు, జాగింగ్లు చేసే వాళ్లు ఊరికే అలా పరుగులు పెట్టకుండా చేత్తో ఒక బ్యాగ్ పట్టుకొని రోడ్డుకిరువైపులా ఉండే చెత్తను ఏరాలి. ఎక్కడపడితే అక్కడ మనకి ప్లాస్టిక్ బాటిల్స్, ఖాళీ చిప్స్ పాకెట్స్, సిగరెట్ పీకలు, గుట్కా ప్యాకెట్లు, ఐస్‌క్రీమ్ పుల్లలు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని ఏరివేస్తూ జాగింగ్ చేయాలి. కాసేపు పరుగులు పెడుతూ, మరి కాసేపు చెత్తను ఏరడానికి నడుం వంచుతూ, మళ్లీ నడుం ఎత్తి పరిగెత్తడం వల్ల శరీరానికి అదనపు వ్యాయామం సమకూరడమే కాదు, రోడ్లన్నీ పరిశుభ్రంగా తళతళలాడిపోతాయి. అంతేకాదు చేతిలో బరువున్న బ్యాగ్‌ను పట్టుకొని పరుగు తీయడం వల్ల కూడా అదనపు క్యాలరీలు ఖర్చు అవుతాయి. శారీరక వ్యాయామంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవలన్న ఆలోచన నుంచి వచ్చిన ఈ సరికొత్త ఫిట్నెస్ ప్రక్రియ ప్రపంచ దేశాల్లో క్రేజ్ పెంచుతోంది ఎక్కడ మొదలైంది ? ప్లాగింగ్ గత ఏడాది స్వీడన్ దేశంలో మొదలైంది. పర్యావరణ ప్రేమికులు కొందరు ఊరికే వాకింగ్ చేయకుండా రోడ్ల పక్కన పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరితే రోడ్లను కాస్త శుభ్రం చేసినట్టు ఉంటుందన్న ఆలోచనతో దీనిని మొదలుపెట్టారు. తాము చేసిన పనిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతే ఒక్కసారిగా అది వైరల్‌గా మారిపోయింది. అలా స్వీడన్ నుంచి నార్వే, డెన్మార్క్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, థాయ్‌ల్యాండ్, కెనడా, మలేసియా ఇలా ఒక్కో దేశానికి పాకింది. ఇప్పుడు భారత్‌లోనూ చాలా నగరాల్లో ఈ ట్రెండ్ ఊపేస్తోంది. ఇప్పడు ఢిల్లీ, బెంగుళూరు, పుణె, ముంబై, థాణె వంటి నగరాల్లో ఉదయాన్నే చూస్తే చేత్తో బ్యాగ్‌లు పట్టుకొని పరుగులు పెడుతున్న యువతరం రోడ్డు పక్కన పడి ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్లాగింగ్ పదం ఎలా వచ్చింది ? జాగింగ్, పిక్అప్ అన్న రెండు పదాల కలయికే ప్లాగింగ్. ఈ పదం స్వీడిష్ భాషలోని ప్లోకా అప్ అన్న పదం నుంచి వచ్చింది. ప్లోకా అప్ అంటే పిక్ అప్ అని అర్థం.. అంటే జాగింగ్ చేస్తూనే రోడ్డు పక్కనున్న చెత్తా చెదారాన్ని ఎత్తివేయడం.. ఎకోఫ్రెండ్లీగా మనం మారాలన్న ఉద్దేశం ఈపదంలోనే కనిపిస్తుంది. దేనికెన్ని క్యాలరీలు ఖర్చు ! రోజుకి అరగంట వాకింగ్ చేస్తే 120 క్యాలరీలు అరగంట జాగింగ్ చేస్తే 235 క్యాలరీలు అదే అరగంట ప్లాగింగ్ చేస్తే 288 క్యాలరీలు భారత్‌కి ఎంతో అవసరం మిగిలిన దేశాల సంగతేమో కానీ భారత్‌కు ఈ ప్లాగింగ్ అన్నది చాలా అవసరం. మన దేశంలో రోడ్డు పక్కనే చెత్తను పడేయం సర్వసాధారణ విషయం.. మన దేశం కూడా అద్దంలా మెరిసిపోవాలన్న ఉద్దేశంతో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం.. ప్లాగింగ్ చేయడం వల్ల మన శరీరానికి ఫిట్నెస్ రావడమే కాదు, స్వచ్ఛ భారత్ కలని కూడా నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో యువతతో ఇదే అభిప్రాయంతో ప్లాగింగ్ చేద్దాం పదండి అంటూ నినదిస్తున్నారు. దీనిని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. రోజూ ప్లాగింగ్ చేస్తున్న వారిలో ఐటీ నిపుణులు, డాక్టర్లు, టీచర్లు, ఫిజియో థెరపిస్టులు ఎక్కువగా కనిపిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్లాగింగ్ ప్రణాళికలు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరపాలక సంస్థ కూడా ప్లాగింగ్ చేయాలంటూ పిలుపు ఇస్తోంది. ప్రజల్లో ప్లాగింగ్ పట్ల అవగాహన పెరిగితే హైదరాబాద్ శుభ్రపడుతుందన్న ఆలోచనతో ఉంది. ప్రజలు గ్రూపులు, గ్రూపులుగా ఈ ప్లాగింగ్ చేస్తే వ్యాయామంలో ఉన్న ఒక రొటీన్‌ను కూడా అధిగమించవచ్చునన్న భావనతో ఉంది. . (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
రిమ్జిమ్.. బ్రెయిన్ జిమ్
దేహం ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌కు వెళతాం.. మరి బ్రెయిన్ ఫిట్‌గా (చురుగ్గా) ఉండాలంటే..! ఇందుకు ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి. వీటిని చేయించేందుకు ప్రత్యేక జిమ్‌లు కూడా ఉన్నాయి. ఇక్కడ కేవలం జ్ఞాపకశక్తిని పెంచే వ్యాయామాలు మాత్రమే చేయిస్తారు. ఇప్పుడు సిటీలో వీటికి క్రేజ్ పెరిగింది. మలేషియాలో అంకురించిన బ్రెయిన్ జిమ్ కాన్సెప్ట్ ఇప్పుడు సిటీవాసులను అలరిస్తోంది. ఇన్నాళ్లు చదువుతో బిజీగా గడిపిన తమ పిల్లల్లో చురుకుదనాన్ని పెంచేందుకు దోహదపడుతున్న ఈ డిఫరెంట్ ఎక్సర్సైజులకు పిల్లల తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. సమ్మర్లో ఈ యాక్టివిటీని నేర్చుకునేందుకు పిల్లలను ఆయా శిక్షణ సంస్థల్లో చేర్పిస్తున్నారు. * శిక్షణకు క్యూ కడుతున్న పిల్లలు * జ్ఞాపకశక్తి పెంచే విభిన్న వ్యాయామాలు.. ఎల్కేజీ నుంచి తమ పిల్లలు చదువులో ముందుండాలనే తాపత్రయం నేటి తల్లిదండ్రుల్లో పెరిగింది. దగ్గరుండి మరీ సందేహలు తీరుస్తున్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేక పోతున్నారు. లాస్ట్ బెంచ్ విద్యార్థులను సైతం ఫస్ట్ ర్యాంకర్స్లా తీర్చిదిద్దడానికి పుట్టుకొచ్చిందే బ్రెయిన్ జిమ్. పిల్లల మెదడుకు పదునుపెట్టి.. చురుగ్గా పనిచేసే కిటుకులను నేర్పిస్తోంది. అంతే కాదండోయ్ మెమొరీ గేమ్స్, డాన్స్, ఫన్ యాక్టివిటీస్, రిలాక్సేషన్ ఎక్సర్సైజులను పిల్లలకు నేర్పిస్తున్నారు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, గ్రాహకశక్తితో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతున్నారు. రెగ్యులర్‌కు భిన్నంగా.. పిల్లలను అన్ని పనుల్లో చురుగ్గా ఉంచేందుకు దోహదం చేసే ఈ బ్రెయిన్ జిమ్‌లో నిపుణుల మార్గదర్శనంలో ఐదేళ్ల నుంచి పదహరేళ్ల పిల్లలతో విభిన్నమైన ఆసనాలు వేయిస్తారు. సాధారణంగా మెడిటేషన్.. మానసిక ప్రశాంతతో పాటు ఏకాగ్రతను పెంచుతుంది. ‘మేం చెప్పే ఎక్సర్సైజు చేస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. భావోద్వేగాలను కంట్రోల్ చేయగలరు. ఒక్కముక్కలో చెప్పాలంటే అన్ని విషయాల్లో పిల్లలు చాలా చురుగ్గా, చాకచాక్యంగా ఉంటార’ని చెబుతున్నారు బ్రెయిన్ జిమ్ ఎక్స్పర్ట్స్. బ్రెయిన్ జిమ్‌లో కుడి, ఎడమ చేతులు ఒకేసారి పనిచేసేలా ఎక్సర్సైజులు ఉంటాయి. హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్ కోసం ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి. అయితే రెగ్యులర్ వ్యాయామాలకు భిన్నంగా ఉండటంతో వీటిని చేసేందుకు చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. మెమొరీ గేమ్స్‌పై ఆసక్తి.. మెమొరీ గేమ్స్ పిల్లల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. ‘20 మంది పిల్లలకు మెమరీ గేమ్‌ను చూపెడతాం. పది మందిని గుర్తు పెట్టుకోమంటాం. ఏ పొజిషన్లో ఏమున్నాయో గుర్తు పెట్టుకొని వాళ్లు మళ్లీ చెప్పాలి. ఇలా ట్రయాంగిల్, సబ్ ట్రయాంగిల్లో నంబర్లు చూపెడతాం. ఇలా చేయడం వల్ల పిల్లలు చూసింది చూసినట్టు గుర్తు పెట్టుకోవడానికి అవకాశముంటుంది. దీన్ని ఫొటోగ్రఫిక్ మెమొరీ అని కూడా అంటారు’ అని చెబుతున్నారు ఎంబీఎం ఇన్స్ట్రక్టర్ సపర్ణ. అలాగే మైండ్ రిలాక్స్ కోసం చేయించే డాన్స్‌కు కూడా పిల్లల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్కూల్లో పుస్తకాలు, ఇంటికొచ్చాక వీడియో గేమ్స్, లేదంటే కంప్యూటర్ ముందు కాలం వెళ్లదీస్తున్న సిటీ పిల్లలకు ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ ఉండటం లేదు. అందుకే ఎంబీఎం నేర్పిస్తున్న మలేషియన్ డాన్స్ స్టెప్పులపై పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారు సిటీ కిడ్స్. ఇంకా మ్యూజిక్, డిస్కషన్స్, ఆలోచనలు పంచుకోవడం లాంటి అంశాల్లోనూ పిల్లలు పరిణతి సాధించేలా చూస్తున్నారు నిపుణులు. కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, హబ్సిగూడలో ఎంబీఎం కేంద్రాలున్నాయి. ఈ సెంటర్స్‌లో పిల్లలతో పాటు అరవై ఏళ్ల వయసు వారిని కూడా ఒత్తిడి నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్, సెల్ఫ్ మోటివేటింగ్, క్రియేటివిటీ ఇంట్రెస్టు వంటివి కూడా నేర్పిస్తున్నారు. శిక్షణ తరగతులు... బ్రెయిన్ జిమ్, మెమొరీ ట్రైనింగ్, కాన్సంట్రేషన్ అటెన్షన్ ఇంప్రూవ్మెంట్, బిహేవియర్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంఫ్రూవ్‌మెంట్, క్రాఫ్ట్, హ్యాండ్ రైటింగ్‌లో క్లాసులు నిర్వహిస్తోంది మిడ్ బ్రెయిన్ మాస్టర్స్. చేరాలనుకునేవారు 81250 50015 నంబర్లో సంప్రదింవచ్చని సంస్థ నిర్వాహకులు తెలిపారు. -
దేహ దారుఢ్యానికి.. ఫిట్నెస్ ట్రైనింగ్
అప్‌కమింగ్ కెరీర్ : నేటి ఆధునిక కాలంలో ఆరోగ్య పరిరక్షణ, దేహ దారుఢ్యంపై ప్రజల్లో ఎంతగానో అవగాహన పెరిగింది. అందుకే జిమ్‌లు, ఫిటినెస్ సెంటర్ల బాటపడుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించు కొనేందుకు ఫిటినెస్ ట్రైనర్ సూచనలను పాటిస్తూ చెమటలు చిందిస్తున్నారు. ఇప్పటి యువతను అమితంగా ఆకర్షిస్తున్న అంశం... సిక్స్‌ప్యాక్ బాడీ. సినీ నటుల తరహాలో ఆరు ఫలకల దేహం కోసం జిమ్‌లలో చేరి, గంటల తరబడి కష్టపడుతున్నారు. ప్రజాదరణ లభిస్తుండడంతో ప్రతి గల్లీలో జిమ్‌లు వెలుస్తున్నాయి. వీటిలో శిక్షణ ఇచ్చే ట్రైనర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ ట్రైనింగ్ అనేది ఉద్యోగానికి, ఉపాధికి వంద శాతం భరోసా కల్పిస్తున్న కెరీర్‌గా గుర్తింపు పొందింది. ఇందులో అవకాశాలకు, ఆదాయానికి లోటు లేకపోవడంతో ఎంతోమంది ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు. సెలబ్రిటీ ట్రైనర్లకు అధిక ఆదాయం వ్యాయామ శిక్షకులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు సులువుగా లభిస్తున్నాయి. జిమ్‌లు, ఫిటినెస్ సెంటర్లలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. ప్రారంభంలో ఏదైనా జిమ్‌లో పనిచేసి, తగిన అనుభవం సంపాదించుకున్న తర్వాత సొంతంగా జిమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. మరోవైపు కార్పొరేట్ ఫిట్నెస్ సెంటర్లు రంగ ప్రవేశం చేస్తున్నాయి. వీటిలో ట్రైనర్లకు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. సినీ నటులు, ప్రముఖులు నెలకు రూ.లక్ష వరకు వేతనం చెల్లిస్తూ సొంత ట్రైనర్లను నియమించుకుంటు న్నారు. ఫిట్‌నెస్‌పై టీవీ ఛానళ్లలో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ప్రేక్షకుల సందేహాలకు ట్రైనర్లతో సలహాలు, సూచనలు ఇప్పిస్తున్నారు. పత్రికలు, మ్యాగజైన్లలోనూ ట్రైనర్ల ఆధ్వర్యంలో ఫిట్నెస్ శీర్షికలు ప్రచురితమవుతున్నా యి. వీటన్నింటి వల్ల వ్యాయామ శిక్షకులకు ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. నైపుణ్యం కలిగిన శిక్షకులకు డిమాండ్ ఫిట్నెస్ ట్రైనర్‌గా రాణించాలంటే ముందు తన ఆరోగ్యాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాలి. బాడీ ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నైపుణ్యం కలిగిన ఇన్స్ట్రక్టర్లకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. కాబట్టి ఆసక్తి కలిగిన యువత ఈ రంగంలోకి నిస్సందేహంగా అడుగుపెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అర్హతలు: హెల్త్ అండ్ ఫిటినెస్ ట్రైనింగ్‌పై మనదేశంలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో వీటిలో చేరొచ్చు. ఫిటినెస్ శిక్షకులకు ప్రత్యేకంగా ఎలాంటి విద్యార్హతలు అవసరం లేకపోయినా ఇలాంటి కోర్సులు చేసినవారికి మంచి అవకాశాలు దక్కుతాయి. వేతనాలు: జిమ్‌లో ఫిటినెస్ ట్రైనర్‌కు ప్రారంభంలో నెలకు రూ.10 వేల వేతనం అందుతుంది. తర్వాత అనుభవాన్ని బట్టి నెలకు రూ.30 వేలకు పైగానే పొందొచ్చు. మోడళ్లు, సినిమా నటులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలకు, వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ట్రైనర్‌గా పనిచేస్తే రూ.లక్షల్లో ఆదాయం ఉంటుంది. ఫిటినెస్ ట్రైనింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: సింబయోసిస్ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్-పుణె వెబ్సైట్: www.schcpune.org ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫిటినెస్ ట్రైనింగ్, వెబ్సైట్: www.iaftworld.com యూనివర్సిటీ ఆఫ్ అలబామా, వెబ్సైట్: www.ua.edu ఫిట్నెస్ ట్రైనర్లకు భారీ డిమాండ్! ఫిట్నెస్.. ఆధునిక మానవుడి ఆరోగ్య సూత్రాల్లో భాగంగా మారిపోయింది. అధిక సంఖ్యలో జిమ్, ఫిట్నెస్ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులైన ఫిట్నెస్ ట్రైనర్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఫిట్‌నెట్ ట్రైనింగ్‌లో కొన్ని విదేశీ సంస్థలు సైతం సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. వాటిలో అర్హత పొంది జిమ్ కేంద్రాల్లో ఫిట్నెస్ శిక్ష కులుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఫిట్నెస్ కోర్సులకు ఇంకా గుర్తింపు రావాల్సి ఉంది. డిగ్రీ, పీజీ స్థాయిలోనూ యూనివర్సిటీలు ఈ కోర్సులను నిర్వహించాలి. అప్పుడే ఫిట్నెస్ కోర్సులపై ఏకరూపత ఏర్పడుతుంది. ఔషధాలు లేని ఎన్నో వ్యాధులకు ఫిట్‌నెట్ మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తోంది. చాలా వ్యాధులకు డాక్టర్లు కూడా వ్యాయామం చేయాలని సూచిస్తుండడం తెలిసిందే. ఫిజియోథెరపిస్ట్‌లు, డాక్టర్లు, బాడీ బిల్డర్స్‌తోపాటు సైన్స్‌పై అవగాహన ఉన్న వారు ఫిట్‌నెట్ ట్రైనర్లుగా రాణిస్తున్నారు. - డా. ఎస్.భక్తియార్ చౌదరి డైరె క్టర్, హైదరాబాద్ స్పైన్ క్లినిక్స్, హైదరాబాద్