వాకింగ్ అంటే తెలుసు, జాగింగ్ అంటే తెలుసు, మరి ప్లాగింగ్ అంటే మీకు తెలుసా ? వంట్లో కొవ్వు కరిగించే కొత్త ట్రెండ్ ఇది. పశ్చిమ దేశాలను ఊపేస్తున్న ఈ కొత్త ఫిట్‌నెస్ క్రేజ్ ఇప్పుడు భారత్‌కూ పాకింది. స్వామికార్యంతో పాటు స్వకార్యం అన్నట్టుగా అటు వంటికి ఫిటినెస్, ఇటు పర్యావరణానికి హితం
అదెలాగంటే...
ఇవాళ రేపు అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిపోతోంది. ఉదయాన్నే లేవగానే కాసేపు రోడ్ల మీద పరుగులు తీయాలి.. వళ్లు విల్లులా వంచి చెమట్లు పట్టేలా వ్యాయామం చేయాలి.. అప్పుడే అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. అదే చేత్తో రోడ్డు పక్కనే ఉన్న చెత్తా చెదారాన్ని ఊడ్చేస్తే.. ఎలాగుంటుంది. ? పొద్దున్నే వీధుల్లో బ్రిస్క్ వాకింగ్‌లు, జాగింగ్‌లు చేసే వాళ్లు ఊరికే అలా పరుగులు పెట్టకుండా చేత్తో ఒక బ్యాగ్ పట్టుకొని రోడ్డుకిరువైపులా ఉండే చెత్తను ఏరాలి. ఎక్కడపడితే అక్కడ మనకి ప్లాస్టిక్ బాటిల్స్, ఖాళీ చిప్స్ పాకెట్స్, సిగరెట్ పీకలు, గుట్కా ప్యాకెట్లు, ఐస్‌క్రీమ్ పుల్లలు కనిపిస్తూనే ఉంటాయి.
వాటిని ఏరివేస్తూ జాగింగ్ చేయాలి. కాసేపు పరుగులు పెడుతూ, మరి కాసేపు చెత్తను ఏరడానికి నడుం వంచుతూ, మళ్లీ నడుం ఎత్తి పరిగెత్తడం వల్ల శరీరానికి అదనపు వ్యాయామం సమకూరడమే కాదు, రోడ్లన్నీ పరిశుభ్రంగా తళతళలాడిపోతాయి. అంతేకాదు చేతిలో బరువున్న బ్యాగ్‌ను పట్టుకొని పరుగు తీయడం వల్ల కూడా అదనపు క్యాలరీలు ఖర్చు అవుతాయి. శారీరక వ్యాయామంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవలన్న ఆలోచన నుంచి వచ్చిన ఈ సరికొత్త ఫిట్‌నెస్ ప్రక్రియ ప్రపంచ దేశాల్లో క్రేజ్ పెంచుతోంది
ఎక్కడ మొదలైంది ?
ప్లాగింగ్ గత ఏడాది స్వీడన్ దేశంలో మొదలైంది. పర్యావరణ ప్రేమికులు కొందరు ఊరికే వాకింగ్ చేయకుండా రోడ్ల పక్కన పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరితే రోడ్లను కాస్త శుభ్రం చేసినట్టు ఉంటుందన్న ఆలోచనతో దీనిని మొదలుపెట్టారు. తాము చేసిన పనిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతే ఒక్కసారిగా అది వైరల్‌గా మారిపోయింది. అలా స్వీడన్ నుంచి నార్వే, డెన్మార్క్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, థాయ్‌ల్యాండ్, కెనడా, మలేసియా ఇలా ఒక్కో దేశానికి పాకింది. ఇప్పుడు భారత్‌లోనూ చాలా నగరాల్లో ఈ ట్రెండ్ ఊపేస్తోంది. ఇప్పడు ఢిల్లీ, బెంగుళూరు, పుణె, ముంబై, థాణె వంటి నగరాల్లో ఉదయాన్నే చూస్తే చేత్తో బ్యాగ్‌లు పట్టుకొని పరుగులు పెడుతున్న యువతరం రోడ్డు పక్కన పడి ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.
ప్లాగింగ్ పదం ఎలా వచ్చింది ?
జాగింగ్, పిక్‌అప్ అన్న రెండు పదాల కలయికే ప్లాగింగ్. ఈ పదం స్వీడిష్ భాషలోని ప్లోకా అప్ అన్న పదం నుంచి వచ్చింది. ప్లోకా అప్ అంటే పిక్ అప్ అని అర్థం.. అంటే జాగింగ్ చేస్తూనే రోడ్డు పక్కనున్న చెత్తా చెదారాన్ని ఎత్తివేయడం.. ఎకోఫ్రెండ్లీగా మనం మారాలన్న ఉద్దేశం ఈపదంలోనే కనిపిస్తుంది.
దేనికెన్ని క్యాలరీలు ఖర్చు !
రోజుకి అరగంట వాకింగ్ చేస్తే 120 క్యాలరీలు
అరగంట జాగింగ్ చేస్తే 235 క్యాలరీలు
అదే అరగంట ప్లాగింగ్ చేస్తే 288 క్యాలరీలు
భారత్‌కి ఎంతో అవసరం
మిగిలిన దేశాల సంగతేమో కానీ భారత్‌కు ఈ ప్లాగింగ్ అన్నది చాలా అవసరం. మన దేశంలో రోడ్డు పక్కనే చెత్తను పడేయం సర్వసాధారణ విషయం.. మన దేశం కూడా అద్దంలా మెరిసిపోవాలన్న ఉద్దేశంతో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం.. ప్లాగింగ్ చేయడం వల్ల మన శరీరానికి ఫిట్‌నెస్ రావడమే కాదు, స్వచ్ఛ భారత్ కలని కూడా నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో యువతతో ఇదే అభిప్రాయంతో ప్లాగింగ్ చేద్దాం పదండి అంటూ నినదిస్తున్నారు. దీనిని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. రోజూ ప్లాగింగ్ చేస్తున్న వారిలో ఐటీ నిపుణులు, డాక్టర్లు, టీచర్లు, ఫిజియో థెరపిస్టులు ఎక్కువగా కనిపిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ ప్లాగింగ్ ప్రణాళికలు
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరపాలక సంస్థ కూడా ప్లాగింగ్ చేయాలంటూ పిలుపు ఇస్తోంది. ప్రజల్లో ప్లాగింగ్ పట్ల అవగాహన పెరిగితే హైదరాబాద్ శుభ్రపడుతుందన్న ఆలోచనతో ఉంది. ప్రజలు గ్రూపులు, గ్రూపులుగా ఈ ప్లాగింగ్ చేస్తే వ్యాయామంలో ఉన్న ఒక రొటీన్‌ను కూడా అధిగమించవచ్చునన్న భావనతో ఉంది. .
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment