బరువు తగ్గడానికి  ఫుల్లుగా లాగించండి | Family health counciling:gym diet disadvantages | Sakshi
Sakshi News home page

బరువు తగ్గడానికి  ఫుల్లుగా లాగించండి

Published Thu, Sep 20 2018 12:21 AM | Last Updated on Thu, Sep 20 2018 12:25 AM

Family health counciling:gym diet disadvantages - Sakshi

జీఎమ్‌ డైట్‌ ఒక విలక్షణమైన డైట్‌. తమ సంస్థలోని ఉద్యోగులు బరువు పెరగకుండా ఆరోగ్యకరంగా ఉండాలని ‘జనరల్‌ మోటార్స్‌’ సంస్థ అనేక పరిశోధనల తర్వాత ఒక డైట్‌ను రూపొందించింది. ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారాన్ని కడుపునిండా తిన్నప్పటికీ బరువు పెరగరన్నది ఈ డైట్‌ ప్రక్రియ సిద్ధాంతం. ప్రయత్నించండి... బరువు తగ్గండి. ‘జీఎమ్‌ డైట్‌’ అంటే ‘జనరల్‌ మోటార్స్‌ డైట్‌’కు సంక్షిప్తరూపం. ఈ డైట్‌తో కేవలం ఒక వారంలో దాదాపు ఆరేడు కిలోల వరకు తగ్గవచ్చు. వారంలోని ఒక్కో రోజు ఒక్కో విధమైన ఆహారం (ఫుడ్‌) లేదా ఆహార సముదాయాన్ని (ఫుడ్‌ గ్రూపును) తీసుకోవడం ఈ డైట్‌ ప్రత్యేకత. జీఎమ్‌ డైట్‌ విధానం కొవ్వులను వేగంగా మండించేలా చేస్తూ బరువు తగ్గిస్తుంది. ఈ విధానంలో ఎప్పుడూ ఒంటికి క్యాలరీలు అవసరమవుతూ ఉంటాయి. అవి దొరక్క ఒంట్లోని క్యాలరీలు దహించుకుపోతూ ఉండటం వల్ల బరువు తగ్గుతుంది. జీఎమ్‌ డైట్‌ ఎలా ఉపయోగపడుతుందంటే... జీఎమ్‌ డైట్‌లో తీసుకునే ఆహారాలు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. కొవ్వులను మరింతగా దహనం చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ ప్రక్రియలో తీసుకునే ఆహారాలు పుష్కలమైన నీటిపాళ్లను కలిగి ఉంటాయి. అందువల్ల ఇవన్నీ ఒంట్లోని కొన్ని వ్యర్థాలు, విషాలు బయటకు వెళ్లేలా చేయడంలో సమర్థంగా పని చేస్తాయి. ఈ డైట్‌ విధానం వల్ల ప్రయోజనం పొంది, దీన్ని ఆమోదించేవారు చెప్పే మాట ఏమిటంటే... ఐదు రోజుల నుంచి ఏడు రోజుల గడువు ఇస్తూ మాటిమాటికీ ఈ ఆహార ప్రక్రియను రిపీట్‌ చేస్తూ కొనసాగించడం వల్ల చాలా బరువు తగ్గొచ్చని, మళ్లీ బరువు పెరగకుండా ఉండొచ్చని. 

ఇంకా ఏమేమి తీసుకోవాలి... దాంతో ప్రయోజనం ఏమిటి?  
►ఈ ఆహార ప్రక్రియలో రోజూ 8 – 12 గ్లాసుల నీళ్లు తీసుకుంటూ ఉండటం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు ఒంట్లోంచి అనవసర పదార్థాలు బయటకు విసర్జితమవుతాయి. 
►ఈ ప్రక్రియ సమయంలో వ్యాయామం చేయడం తప్పనిసరి కాదుగానీ అభిరుచి ఉంటే చేయవచ్చు. అలా చేయదలచినప్పుడు మొదటి మూడు రోజులు మాత్రమే చేయాలి. 
►  ఈ ప్రక్రియను అనుసరించేవారు ప్రతిరోజూ రెండు నుంచి మూడు గిన్నెల (బౌల్స్‌లో) ‘జీఎమ్‌ వండర్‌ సూప్‌’ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సూప్‌ను క్యాబేజ్, సెలెరీ, టొమాటోలు, ఉల్లిగడ్డలు, బెల్‌పెప్పర్స్‌తో తయారుచేస్తారు. ఇది మనమూ చేసుకోవచ్చు. పై పదార్థాలతో మనం చారు కాచుకున్నట్లుగానే దీన్ని తయారు చేసుకోవచ్చు. 

జీఎమ్‌ డైట్‌ పాటించే సమయంలో  కొన్ని సూచనలు 
► జీఎమ్‌ డైట్‌ పాటించేవారు కాఫీలు తాగవచ్చా అనే సందేహం వస్తుంది. కాఫీలను నిపుణులు సిఫార్సు చేయరు. అయితే హెర్బల్‌ టీ మాత్రం పరిమితంగా కొన్నిసార్లు తీసుకోవచ్చు. 
►జీఎమ్‌ వండర్‌సూప్‌కు ఏవైనా ప్రతిబంధకాలు ఉన్నాయా అని కొందరు అడుగుతుంటారు. అది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రోజులో రెండు మూడు సార్లైనా దీన్ని తీసుకోవచ్చు. డైట్‌ పాటించే సమయంలో ఆకలిగా అనిపించినప్పుడు దీన్ని తీసుకోవచ్చు. 
► డైట్‌ ప్లాన్‌లో ఉండగా ఆల్కహాల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ఆల్కహాల్‌తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు ఏవీ లేవు. 
► డైట్‌ ప్లాన్‌లో ఉన్నప్పుడు బయట తినాల్సిన పరిస్థితి ఏర్పడితే బయటి ఆహారం తీసుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. అయితే డైట్‌ప్లాన్‌లో ఉన్నప్పుడు బయటి ఆహారం ఎలాంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. మీరు పూర్తిగా పాటించగలిగే సమయంలోనే డైట్‌ను ప్లాన్‌ చేసుకోవాలి. బయటి ఆహారాల్లో ప్రాసెస్‌ చేసినవి ఉండవచ్చు. హానికారక రసాయనాలు కలిసిన ఆహారపదార్థాలూ ఉండవచ్చు. ఉదాహరణకు బ్రెడ్‌ తయారీకి ఉపయోగించే పిండిలోనూ, ఇతర మాంసాహారాల్లోనూ  కొన్ని కండిషనర్లు, సల్ఫేట్స్, మోనోసోడియమ్‌ గ్లుటామేట్‌ వంటి రుచిని ఇచ్చే చైనా ఉప్పు వంటివి, నైట్రేట్లు, ఫాస్ఫేట్లు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తీపిని ఇచ్చే అనేక పదార్థాలతో పాటు ఎక్కువ మోతాదులో ఉప్పు కూడా ఉండవచ్చు. అసలు జీఎమ్‌ డైట్‌ పాటించేదే వీటన్నింటి నుంచి దూరంగా ఉండటం కోసమే. అలాంటప్పుడు అవి తినాల్సి వస్తే జీఎమ్‌ డైట్‌ పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలేమీ ఒనగూరవు. 
►నాలుగోరోజున పాలు తీసుకోవాలని జీఎమ్‌ డైట్‌ నిబంధన కదా... ఒకవేళ పాలు అంత ఇష్టంగా లేకపోతే మజ్జిగ లేదా పెరుగు తినవచ్చా అని చాలామందిలో సందేహాలు వస్తుంటాయి. అయితే పాలు తీసుకోవడం అంతగా ఇష్టపడకపోతే పెరుగు లేదా మజ్జిగ తీసుకోవచ్చు. అయితే పెరుగు లేదా మజ్జిగలో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోకూడదు. 
►   జీఎమ్‌ డైట్‌ను అనుసరించడంలో భాగంగా చపాతీలు, గోధుమలు, తృణధాన్యాలు, బ్రెడ్‌ వంటివి ఏమాత్రం తీసుకోకూడదు. 
►రోజూ పొద్దున్నే నిమ్మనీళ్లలో తేనె కలుపుకొని తాగడం మంచిదంటారు కదా... మరి జీఎమ్‌ డైట్‌ సమయంలో ఈ పని చేయవచ్చా అని కొంతమందిలో ఒక సందేహం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అనుసరించేవారు తేనె తీసుకోకూడదు. దానికి బదులు నిమ్మకాయనీరు (చక్కెర లేకుండా) ఎంతైనా తీసుకోవచ్చు. 
►శాకాహారులు  మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకోదగినవి... కొబ్బరినూనె, ఆలివ్‌నూనె, వెన్న లేదా నెయ్యి. కొందరు  మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా పెరుగు కూడా తీసుకుంటారు. అది కూడా మంచిదే. 
► జీఎమ్‌ డైట్‌లో భాగంగా ఉప్పు, మిరియాలు లేదా ఇతర సుగంధద్రవ్యాలు (స్పైసెస్‌) తీసుకోవచ్చా అంటే...  ఉప్పు చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ డైట్‌లో ఉన్నవారు చాలా ఎక్కువగా నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మూత్రం రూపంలో మనలోంచి వెళ్లిపోయే లవణాల కోసం ఉప్పు తీసుకోవడం అవసరమే అయినా దాన్ని  చాలా పరిమితంగానే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. సముద్రపు ఉప్పు అయితే ఇంకాస్త మంచిది. మిరియాల వంటి చెట్ల నుంచి వచ్చే (హెర్బల్‌) సుగంధద్రవ్యాలన్నీ తీసుకోవచ్చు. మీ ఆహారానికి మంచి ఫ్లేవర్‌ తెచ్చుకొని, తినేందుకు అనువైనవిగా చేసుకునేందుకు ఈ డైట్‌లో స్పైసెస్‌ ఒక మంచి మార్గం. 
►జీఎమ్‌ డైట్‌లో భాగంగా ఎండుఫలాలను (నట్స్‌) తీసుకోవడం ఏమాత్రం సరికాదు. అయితే మొదటిరోజున, మూడోరోజున... ఇలా జీఎమ్‌ డైట్‌ అనుమతించిన రోజుల్లో సాధారణ తాజా ఫలాలను మాత్రం తీసుకోవచ్చు. నట్స్‌ లేదా డ్రైఫ్రూట్స్‌లో పోషకాలన్నీ చాలా గాఢతతో చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్ది ఆహారంతోనే ఎక్కువ పోషకాలు ఒంట్లోకి వెళ్తాయి. అందుకే జీఎమ్‌ డైట్‌ పాటిస్తున్న కాలంలో వాటిని తీసుకోడానికి వీల్లేదు. అయితే డైట్‌ ప్లాన్‌ ముగిశాక మాత్రం... చాలా కొద్ది కొద్ది పరిమితుల్లో అప్పుడప్పుడు మాత్రం వాటిని తీసుకోవచ్చు. 
►   జీఎమ్‌ డైట్‌ ప్లాన్‌ వ్యవధి ముగిశాక ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది చాలామందిలో ఉండే ఒక సందేహం. ఎవరికి వారు తమ సాధారణ ఆహారాన్ని తీసుకోవచ్చు. అయితే మునపటిలా ఏది పడితే అది... ఎంత పడితే అంత, ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా... మంచి ఆరోగ్యకరమైన సమతుల ఆహారం, నిర్ణీతమైన వేళలకు తింటూ మంచి జీవనశైలిని పాటించాలి. మంచి సమతుల ఆహారం అంటే... మీ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అన్నీ సమపాళ్లలో అందేలాంటి భోజనం. అందులో ఆకుకూరలు, కాయగూరల వంటివి చాలా ఎక్కువగా ఉండాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. పొట్టు తీయని హోల్‌ గ్రెయిన్స్‌ తినడం చాలా మంచిది. అప్పుడు మాత్రమే జీఎమ్‌ డైట్‌తో ఒనగూరిన ఫలితాలు కాస్తంత ఎక్కువ రోజులు ఉంటాయి. 
► జీఎమ్‌ డైట్‌ ప్లాన్‌ వ్యవధి ముగిశాక... యథాతథంగా తింటున్నప్పుడు మళ్లీ బరువు పెరుగుతామా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అవును... ముందుగా పేర్కొన్నట్లు మంచి సమతులాహారం తీసుకోకుండా... ఇష్టం వచ్చినట్లుగా తింటూ సక్రమమైన జీవనశైలి పాటించకపోతే... చాలా కొద్దికాలంలోనే మళ్లీ బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. అయితే తగ్గిన బరువు అలాగే ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా మంచి ఆహారపు అలవాట్లు, మంచి జీవనశైలిని అనుసరించాలి. అయితే కొందరిలో థైరాయిడ్‌ వంటి ఆరోగ్యకారణాల వల్ల బరువు పెరుగుతుంటే మాత్రం వారిలో ఈ డైట్‌ వల్ల ప్రయోజనం ఉండదు. వారు తమకు ఉన్న అసలు సమస్య (అండర్‌లైయింగ్‌ ప్రాబ్లమ్‌)కు చికిత్స తీసుకోవాలి. 
► జీఎమ్‌ డైట్‌ను మొదలు పెట్టాక అదేపనిగా దీన్ని కొనసాగించవచ్చా... అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే నిర్ణీత వ్యవధి కోసం దీన్ని పాటించాక... మళ్లీ మొదలు పెట్టడానికి తప్పకుండా గ్యాప్‌ ఇవ్వాలి. జీఎమ్‌ డైట్‌ప్లాన్‌నే ఒక జీవనశైలి అలవాటుగా మార్చుకోకూడదు. ఏదైనా డైట్‌ప్లాన్‌ మళ్లీ ప్రారంభించాలని అనుకుంటే మాత్రం...  కనీసం రెండు వారాల వ్యవధి తర్వాత మళ్లీ ఆ డైట్‌ప్లాన్‌ మొదలుపెట్టాలి. 
► జీఎమ్‌ డైట్‌ పాటిస్తున్నప్పుడు యోగా చేయవచ్చా లేదా అన్నది చాలామందిలో ఉండే సందేహం. అయితే జీఎమ్‌ డైట్‌ పాటిస్తూ యోగా చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. వ్యాయామం చేయాలన్న నియమేమీ లేదుగానీ... ఒకవేళ ఇష్టమై చేస్తుంటే మాత్రం మంచిదే. అయితే చాలా శ్రమతో కూడుకున్న వ్యాయామాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగాలాంటివీ, శారీరక శ్రమ లేనివి మాత్రం మామూలుగానే చేసుకోవచ్చు. 
గమనిక : జీఎమ్‌ డైట్‌ను పాటించే సమయంలో మొదటి రెండు రోజులు తగిన ప్రోటీన్, మిగతా రోజుల్లో అన్ని పోషకాలు అందక కొందరిలో సమస్యలు రావచ్చు. అందుకే దీన్ని ప్రారంభించాలనుకున్న వారు ఒకసారి డాక్టర్‌ లేదా డైట్‌ నిపుణులను సంప్రదించి, తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా డైట్‌ప్లాన్‌ పొంది అప్పుడు  మొదలుపెట్టడం మంచిది. 

జీఎమ్‌ డైట్‌ ప్రతికూలతలు
ఈ ఆహార ప్రక్రియలో కొన్ని రకాల ప్రతికూలతలు ఉన్నాయి. అవి... 
►ఇది బరువు తగ్గిస్తుంది. కానీ ఈ ఆహారం బరువును ఎలా తగ్గిస్తుందన్న  విషయంలో ఎలాంటి నిరూపిత అధ్యయనమూ లేదు. 
►ఈ ఆహారం సమతులాహారం కాదు. దీన్ని తీసుకున్నప్పుడు కొన్ని రకాల అసంతృప్తులు, ఆకలి ఉంటాయి. రకరకాల ఆహారాలు తీసుకుంటున్నప్పుడు మనకు అవసరమైన కొన్ని సూక్ష్మపోషకాలు ఒంటికి అందకపోవచ్చు. 
►వారంలోని చాలా రోజుల్లో ఒంటికి అవసరమైన ప్రోటీన్‌ అందదు. అందినది చాలా తక్కువ. అది సరిపోదు. 
► ముందుగా చెప్పినట్లే చాలా సందర్భాల్లో ఒంటికి అవసరమైన అన్ని పోషకాలు అందవు. ముఖ్యంగా మొదటి మూడు రోజులూ ఒంటికి అవసరమైన కొవ్వులు, విటమిన్‌ బి12, ఐరన్, క్యాల్షియమ్‌ వంటివి లోపించే ప్రమాదం ఉంది. 
►జీఎమ్‌ డైట్‌తో ఒనగూరే ప్రయోజనం కేవలం తాత్కాలికం. అందుకే కొంత వ్యవధి ఇస్తూ మాటిమాటికీ చేయాలంటూ దీనితో ప్రయోజనం పొంది, దీన్ని ఆమోదించిన వారు చెబుతుంటారు. 


జీఎమ్‌ డైట్‌ పాటించే పద్ధతి

డా. సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్,  కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement