
కొవ్వులెక్కువగా ఉన్నాయి కాబట్టి డ్రైఫ్రూట్స్ తింటే లావెక్కుతారని అనుకోవడం అపోహ మాత్రమేనని అంటున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. కాకపోతే వీటిని మరీ ఎక్కువ మోతాదులో తినడం సరికాదని సూచిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే కొవ్వులు శరీరానికి మేలు చేసేవేనని... శరీరం శోషించుకోగల కొవ్వులు కూడా వీటిలో ఉండటం వల్ల వీటితో మేలేగానీ కీడు లేదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. సాధారణంగా ప్రతిరోజూ 30గ్రాముల వరకూ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మేలన్నది అంచనా. కానీ.. వీటిల్లోని కొవ్వుల మోతాదు వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీడిపప్పు, పిస్తాల్లో కొవ్వుల శాతం దాదాపు 50 గ్రాముల వరకూ ఉంటే కొన్ని ఇతర డ్రైఫ్రూట్స్‌లో 70 శాతం వరకూ ఉంటుంది.
అయితే ఈ కొవ్వులు మోనోశాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు. కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గించడం ద్వారా ఇవి శరీరానికి మేలు చేస్తాయి. కేలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉన్నప్పటికీ డ్రైఫ్రూట్స్‌ను తినడం ఆపాల్సిన అవసరం లేదని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయని, రోజూ వీటిని తిన్నవారు దీర్ఘకాలంలో బరువు పెరగడం చాలా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. తాము మొత్త 30 అధ్యయనాలను సమీక్షించామని అన్నింటిలోనూ డ్రైఫ్రూట్స్ తినడానికి బరువు పెరగడానికి మధ్య సంబంధం లేదని స్పష్టం చేశాయని.. ఒక అధ్యయనంలో ఒక పద్ధతి ప్రకారం డ్రైఫ్రూట్స్ తిన్న వారు బరువు తగ్గినట్లు తెలిసిందని ఒక శాస్త్రవేత్త వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment