హైటెక్‌ రాముడు | The Common Man Made Many Machines In East Godavari | Sakshi
Sakshi News home page

హైటెక్‌ రాముడు

Published Wed, Jul 10 2019 8:43 AM | Last Updated on Wed, Jul 10 2019 8:43 AM

The Common Man Made Many Machines In East Godavari - Sakshi

పనికిరాని గ్యాస్‌ సిలిండర్‌తో రాము రూపొందించిన పనసపొట్టు తయారు చేసే యంత్రం

సాక్షి, రామచంద్రపురం(తూర్పుగోదావరి) : సామాన్య మధ్య తరగతి వ్యక్తి. చదివింది ఏడో తరగతే. అయినా ఆరితేరిన మెకానికల్‌ ఇంజినీర్‌లా యంత్రాలు తయారుచేస్తాడు జిల్లాలోని రామచంద్రపురం మండలం ద్రాక్షారామకు చెందిన రెడ్డి రాము. ఆ ఊరిలో బియ్యంపేటకు చెందిన అతన్ని అంతా ఇంజినీరూ అని పిలుస్తారు. ఎవరొచ్చి ఏ అవసరం చెప్పి తన పని సులువు చేయమని అడిగినా తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఓ యంత్రం చేసి ఇచ్చేస్తాడు. 16 ఏళ్ల వయసు చిత్ర నిర్మాత అంగర సత్యానికి చెందిన ట్రాక్టర్‌ ట్రక్కులు తయారు చేసే ఇంజినీరింగ్‌ వర్క్స్‌లో రాము పనికి కుదిరాడు.

అప్పటికి అతడి వయసు 14. తరువాత తోటపేటలో ఉన్న చెల్లూరి భూరికి చెందిన లేతు వర్కుషాపులో, అనపర్తి మండలం పందలపాకలో కిలపర్తి సూర్యారావు చెందిన లేతు వర్కుషాపులో పనిచేశాడు. చివరిగా ఆ అనుభవంతో ద్రాక్షారామలో ఇంటి కిటికీలకు మెష్‌లు, మెట్లకు గ్రిల్స్‌ తయారు చేసే వెల్డింగ్‌ షాపును సొంతంగా ప్రారంభించాడు. జీవనోపాధికి వెల్డింగ్‌ వర్కు చేస్తున్నా బుర్ర నిండా ఇంజినీంగ్‌ ఆలోచనలే. ఇవి చాలవన్నట్టు మరోవైపు బాడీ బిల్డింగ్‌. ఈ ఆసక్తితో స్థానిక శాకా వీరభద్రరావుకు వ్యాయామశాలలో చేరాడు. అక్కడ అతని దృష్టి వ్యాయామ పరికరాలపై పడింది. విడివిడిగా ఉన్న పరికరాలపై పడింది. వాటి స్థానంలో బహుళ ప్రయోజనకరమైన పరికరాల తయారీ ప్రారంభించాడు. ఇతని దగ్గర వ్యాయామ పరికరాలు కంపెనీ పరికరాలకు దీటుగా, తక్కువ ధరలోనే దృఢంగా ఉంటున్నాయని ఆనోటా ఈనోటా పాకి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆర్డర్లు రావడం మొదలుపెట్టాయి.


రాము రూపొందించిన మల్టీపర్పస్‌ అబ్డామిన్‌ మెషీన్‌, ఇటుక తయారీ యంత్రం

రాజమహేంద్రవరంలోని గౌతమి వ్యాయామశాల వంటి అనేక వ్యాయామశాలలు రాముతో అనేక వ్యాయామ పరికరాలు తయారు చేయించుకున్నారు. రాము అక్కడితో ఆగలేదు. ఇలా ఎవరి అవసరాలకు తగ్గట్టు వారికి ఎన్నో పరికరాలు చేసి ఇచ్చేవాడు. రామచంద్రపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్టణాలకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు తమ ప్రాజెక్టుల కోసం రామును సంప్రదించి వారి ప్రాజెక్టులు తయారు చేయించుకుని వెళ్తుండడం ద్రాక్షారామకే గర్వకారణం. రాము తన డ్రీమ్‌ ప్రాజెక్టుగా ఇటుకల తయారీ యంత్రం కోసం ఏళ్ల తరబడి శ్రమించాడు. కంపెనీలు తయారు చేసే ఇటుకల తయారీ మెషీన్లు ఉన్నా, మరింత సులువుగా పని జరిగేలా పలు నమూనాల్లో ఇటుకల తయారీ యంత్రాలను రూపొందించడంలో ఆరితేరాడు. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి ఇటుకల తయారీదారులు వచ్చి రాముతో ఆ యంత్రాలు తయారు చేయించుకుంటున్నారు.

మోటారు సైకిల్‌ ఇంజిన్‌తో చిన్నపాటి జీపు
పొలం గట్లపై వాడుకోవడానికి అనువుగా చిన్నపాటి జీపును రూపొందిస్తున్నాడు రాము. పాత వాహనాల్లోని పార్టులు ఉపయోగించుకుని రూపొందించే పనిలో ఉన్నాడు. మోటారు సైకిల్‌ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నా దీనికి రివర్స్‌ గేర్‌ కూడా ఏర్పాటు చేస్తుండటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement