Habib Nagar
-
హబీబ్‌నగర్‌లో దారుణం.. కూల్ డ్రింక్ చోరీ చేశాడని..
సాక్షి, హైదరాబాద్: కూల్ డ్రింక్ దొంగతనం చేశాడంటూ ఓ దుకాణ యజమాని తొమ్మిదేళ్ల బాలుడిని దుస్తులు ఊడదీసి చేతులు, కాళ్లు కట్టేసి చితకబాదడమేగాక ప్రైవేట్ పార్ట్స్ పై కారం చల్లి పైశాచికానందం పొందారు. అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని వీడియో తీసి బాలుడి తల్లికి పంపించిన సంఘటన హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై గాయత్రి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక అఫ్జల్‌సాగర్ కట్ట ప్రధాన రహదారిపై అబ్రహీమ్ జనరల్ అండ్ స్టేషనరీ దుకాణాన్ని అదే ప్రాంతానికి చెందిన కృష్ణ అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. ఖదిరియా మసీదు సమీపంలో ఉండే బాలుడు (9) తరచూ సదరు దుకాణానికి సరుకుల కొనుగోలు నిమిత్తం వచ్చేవాడు. ఈ క్రమంలో ఇటీవల అతను దుకాణంలో కూల్ డ్రింక్ బాటిల్ దొంగలించాడు. దీనిని గుర్తించిన కృష్ణ సోమవారం బాలుడిని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటి టెర్రస్ పైకి తీసుకువెళ్లి అతడి బట్టలు ఊడదీసి, చేతులు కాళ్లు కట్టేశాడు. ఆపై బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై కారం పొడి చల్లాడు. బాధను భరించలేక బాలుడు కేకలు వేశాడు. అంతేకాకుండా ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసి బాలుడి తల్లికి షేర్ చేశాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తమ బంధువుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న హబీబ్‌నగర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన బాలుడిని చేరదీసుకుని చికిత్స నిమిత్తం నాంపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతడి దాడికి పాల్పడిన కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు. దాడి చేసిన విషయం వాస్తవమేనని ఒప్పుకోవడంతో నిందితుడిపై కేసులు నమోదు చేశారు. దుకాణంలో చోరీకి పాల్పడిన బాలుడిని విచారించేందుకు సీడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు. బాలుడిపై దాడి అమానుషం కూల్‌డ్రింక్ చోరీ చేశాడనే నెపంతో ఓ బాలుడి పట్ల దుకాణం యజమాని ప్రవర్తించిన తీరు దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న పిల్లలపై ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే శిక్షాస్మృతిని మార్చాలని కోరారు. చదవండి: ఆన్లైన్ గేమ్ ఆడి.. రూ.95 లక్షలు ఓడి.. -
మొబైల్ ఇవ్వనందుకు దాడి.. కత్తులు, కట్టెలు, నిక్కల్స్‌తో పంచ్‌లు
సాక్షి, నాంపల్లి: హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి ఓ రౌడీషీటర్ హల్చల్ చేశాడు. రౌడీషీటర్‌తో పాటు మరో పది మంది అనుచరులు కత్తులు, కట్టెలు, నిక్కల్స్‌తో పంచ్‌లు కొట్టారు. దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుభాన్‌పుర ప్రాంతానికి చెందిన సమీర్ అనే రౌడీషీటర్ తన అనుచరుడిని ఏక్‌మినార్ మసీదు సమీపంలో ఉండే ఓ మొబైల్ షాపుకి పంపించారు. తన పేరును చెప్పి మొబైల్ తీసుకురమ్మని ఆదేశించారు. మొబైల్ షాపు యజమాని మహ్మద్ ఆసిఫ్ నిరాకరించడంతో ఆగ్రహించిన రౌడీషీటర్ అర్థరాత్రి తన అనుచరులతో దర్గా షాఖామూస్‌లో నివాసం ఉండే మహ్మద్ ఆసిఫ్ ఇంటికి చేరువలో కాపుకాశారు. ఆదివారం రాత్రి మొబైల్ షాపు మూసివేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో రౌడీషీటర్, అతని అనుచరులు మహ్మద్ ఆసిఫ్‌ను అడ్డగించి నిక్కల్స్‌తో పంచ్‌లు కొట్టారు. దాడిని ఆపటానికి వచ్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడ్డ వారి ఇద్దరు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీటర్ సమీర్ పారిపోయాడు. దాడిలో సమీర్‌తో పాటు మరో రౌడీషీటర్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పారిపోయిన వారిని త్వరలోనే పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ నరేందర్ తెలియజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2019వ సంవత్సరంలో రౌడీషీటర్ సమీర్ పీడీ యాక్టులో జైలుకు వెళ్లి వచ్చారు. దాడిలో మహ్మద్ ఆసిఫ్‌తో పాటుగా అంజద్‌ఖాన్, బాబు, వీరి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు అయ్యాయి. -
అనుమానం..పెనుభూతం
నాంపల్లి: అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన సంఘటన సోమవారం హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుభాన్పురకు చెందిన మహ్మద్ ఇమ్రాన్, అదే ప్రాంతానికి చెందిన షరీఫా బేగం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా షరీఫాపై అనుమానం పెంచుకున్న ఇమ్రాన్ తరచూ ఆమెతో గొడవ పడుతున్నాడు. అతడి వేధింపులు తాళలేక షరీఫా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్న ఇమ్రాన్ అందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా షరీఫాకు ఫోన్ చేసి తాను పూర్తిగా మారిపోయానని, ఇంటిని ఖాళీ చేసి మరో ఇంటికి మారదామని చెప్పాడు. అతని మాటలు నమ్మిన షరీఫా ఇంటికి తిరిగివచ్చింది. పథకంలో భాగంగా దర్గా యూసుఫియన్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో రెండు గదులను అద్దెకు తీసుకున్న ఇమ్రాన్ అందులో కాపురం పెట్టాడు. ఆదివారం రాత్రి అతను షరీఫా గొంతు నులుమి హత్య చేశాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఇమ్రాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
నడిరోడ్డుపై దారుణ హత్య
పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దుండగులు అతి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన నగరంలోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఆగాపూర్ రోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. ఈ దాడిలోయువకుడి తల పూర్తిగా ఛిద్రమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.