నిందితుడు కృష్ణ
సాక్షి, హైదరాబాద్: కూల్ డ్రింక్ దొంగతనం చేశాడంటూ ఓ దుకాణ యజమాని తొమ్మిదేళ్ల బాలుడిని దుస్తులు ఊడదీసి చేతులు, కాళ్లు కట్టేసి చితకబాదడమేగాక ప్రైవేట్ పార్ట్స్ పై కారం చల్లి పైశాచికానందం పొందారు. అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని వీడియో తీసి బాలుడి తల్లికి పంపించిన సంఘటన హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై గాయత్రి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక అఫ్జల్‌సాగర్ కట్ట ప్రధాన రహదారిపై అబ్రహీమ్ జనరల్ అండ్ స్టేషనరీ దుకాణాన్ని అదే ప్రాంతానికి చెందిన కృష్ణ అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు.
ఖదిరియా మసీదు సమీపంలో ఉండే బాలుడు (9) తరచూ సదరు దుకాణానికి సరుకుల కొనుగోలు నిమిత్తం వచ్చేవాడు. ఈ క్రమంలో ఇటీవల అతను దుకాణంలో కూల్ డ్రింక్ బాటిల్ దొంగలించాడు. దీనిని గుర్తించిన కృష్ణ సోమవారం బాలుడిని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటి టెర్రస్ పైకి తీసుకువెళ్లి అతడి బట్టలు ఊడదీసి, చేతులు కాళ్లు కట్టేశాడు. ఆపై బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై కారం పొడి చల్లాడు. బాధను భరించలేక బాలుడు కేకలు వేశాడు. అంతేకాకుండా ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసి బాలుడి తల్లికి షేర్ చేశాడు.
దీంతో ఆమె ఈ విషయాన్ని తమ బంధువుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న హబీబ్‌నగర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన బాలుడిని చేరదీసుకుని చికిత్స నిమిత్తం నాంపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతడి దాడికి పాల్పడిన కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు. దాడి చేసిన విషయం వాస్తవమేనని ఒప్పుకోవడంతో నిందితుడిపై కేసులు నమోదు చేశారు. దుకాణంలో చోరీకి పాల్పడిన బాలుడిని విచారించేందుకు సీడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు.
బాలుడిపై దాడి అమానుషం
కూల్‌డ్రింక్ చోరీ చేశాడనే నెపంతో ఓ బాలుడి పట్ల దుకాణం యజమాని ప్రవర్తించిన తీరు దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న పిల్లలపై ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే శిక్షాస్మృతిని మార్చాలని కోరారు.
చదవండి: ఆన్‌లైన్ గేమ్ ఆడి.. రూ.95 లక్షలు ఓడి..
Comments
Please login to add a commentAdd a comment