భార్యా హంతకునికి యావజ్జీవం
అనంతపురం లీగల్ : అనుమానంతో భార్యపై కిరోసిన్ పోసి హత్యచేసిన భర్త హాజీవలికి అనంతపురం మూడవ అదనపు జిల్లా సెషన్స్ (ఫాస్ట్‌ట్రాక్) కోర్టు బుధవారం యావజ్జీవ శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు... నగరంలోని స్టాలిన్‌నగర్‌కు చెందిన లారీడ్రైవర్ హజీవలి, అతని భార్య సయ్యద్ మసూద్ బీలకు విభేదాలున్నాయి. బేల్దారి పనికి వెళ్లే భార్యను ప్రతి విషయంలోనూ అనుమానిస్తూ హాజీవలి గొడవ పడేవాడు. 2015 జూలై 7న సాయంత్రం భర్త పిలుస్తున్నాడని చెప్పటంతో ఇంటికి హడావుడిగా వెళ్లింది. ఆమె వచ్చీరాగానే దాడిచేసి, ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు.
చుట్టుపక్కలవారు గమనించి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అయినా పరిస్థితి విషమించి మసూద్బీ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. మూడవ అదనపు జిల్లా సెషన్స్ (ఫాస్ట్‌ట్రాక్) కోర్టు పదిమంది సాక్ష్యులను విచారించింది. ప్రాసిక్యూషన్ తరఫున బి.నాగలింగం హాజరయ్యారు. సాక్ష్యాధారాలు, వాదోపవాదనల అనంతరం హాజీవలిపై నేరాపోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి బి.సునీత యావజ్జీవ కఠిన కారాగారశిక్ష , పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు.