hamalis
-
సత్వరం హమాలీల సమస్యలు పరిష్కరించండి
ఏపీ పౌరసరఫరాల సంస్థ హమాలీల సంఘం ప్రధాన కార్యదర్శి పి.శివశంకరరావు చిలకలపూడి : కాలయాపన చేయకుండా ఎంఎల్ఎస్ పాయింట్లు, గోడౌన్లలో పనిచేస్తున్న హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ పౌరసరఫరాల సంస్థ హమాలీల సంఘం ప్రధాన కార్యదర్శి పి.శివశంకరరావు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 జనవరి 1వ తేదీ నుంచి కొత్త వేతనాలు అమలు జరగాల్సి ఉందని, నేటికీ హమాలీల సంఘాలతో వేతనాల సమస్యలపై చర్చించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం హమాలీల వేతనాల అంశంపై నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. హమాలీలను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కూలీ రేట్లను క్వింటాల్‌కు రూ.12 నుంచి రూ.30కు పెంచి అరియర్స్‌ను చెల్లించాలని కోరారు. అద్దె గోడౌన్ల స్థానంలో సొంత గోడౌన్లను నిర్మించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో ఏవీఎస్‌ఎన్ మూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు బి.రమేష్, సీఐటీయూ పట్టణ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
నేటి నుంచి ఉల్లి కొనుగోళ్లు బంద్
– సంచులు మార్చడంలో మొండికేసిన హమాలీలు – బస్తాకు ఆదనంగా రూ.1.50 చెల్లించాలని డిమాండ్ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం నుంచి ఉల్లి క్రయ,విక్రయాలు బంద్ కానున్నాయి. హమాలీల సమస్య కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు జరుగవని మార్కెట్ కమిటీ అధికారులు ప్రకటించారు. సంచుల్లోనే ఉల్లి కొనుగోలు చేపట్టడం వల్ల హమాలీల సమస్య ఉత్పన్నమైంది. రైతులు తెచ్చిన బస్తాల్లోంచి మూడు,నాలుగు బస్తాలను కిందపోసి వాటి ఆధారంగా కొనుగోలు చేస్తారు. కొనుగోలు తర్వాత రైతులు తెచ్చిన బస్తాల్లోంచి ఉల్లిని కొనుగోలుదారు బస్తాల్లోకి మార్చి కాటా వేయాల్సిఉంది. రైతులు తెచ్చిన ఉల్లిని కొనుగోలు దారు బస్తాల్లోకి మార్చడం మా పని కాదంటే...మా పని కాదని కోత, పట్టుడు హమాలీలు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో బుధవారం ఉల్లికొనుగోళ్లు జరగలేదు. అయితే గురువారం హమాలీలను ఒప్పించి కొంతవరకు ఉల్లికొనిపించారు. హమాలీలతో రాత్రి వరకు చర్చలు జరిగాయి. బస్తాకు రూ. 1.50 అదనంగా చెల్లిస్తే సంచులు మార్చడానికి సిద్ధమని హమాలీలు చెబుతున్నారు. దీన్ని భరించలేమని చెగుతున్న కొనుగోలుదారులు ఆ భారాన్ని రైతులపై వేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు మార్కెట్‌కు ఉల్లి తీసుకరాకూడదని అధికారులు రైతులకు సూచించారు. -
హమాలీల అమ్మాయిలకు స్కాలర్షిప్లు
గ్రూప్-1కు రూ. 50 వేలు, సివిల్స్‌కు ప్రిపేరయితే రూ. లక్ష సెక్యూరిటీ గార్డుల వేతనం రూ. 13 వేలుగా నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మార్కెట్ యార్డుల్లో పనిచేసే హమాలీల అమ్మాయిల కోసం స్కాలర్షిప్లను ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీల కార్యదర్శులతో బుధవారం మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దాంతోపాటు సెక్యూరిటీ గార్డులు, హమాలీ, దడువాయి కార్మికులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ హమాలీల ఆడపిల్లలకు ఇంటర్‌కు రూ. 2 వేలు, డిగ్రీకి రూ. 3 వేలు, పీజీకి రూ. 5 వేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గ్రూప్-1 మెయిన్స్ కోచింగ్ తీసుకునే వారికి రూ. 50 వేల సహకారం, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంటే రూ. లక్ష ఇవ్వనున్నట్టు తెలిపారు. మార్కెట్ యార్డుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డుల వేతనాన్ని రూ. 6,700 నుంచి రూ. 13 వేలు పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. సెక్యూరిటీ గార్డులు, హమాలీ, దడువాయి, మహిళా కూలీలకు ఆరు నెలలకోసారి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని కార్యదర్శులకు సూచించారు. వారందరికీ ఈ నెల నుంచే రూ. 2 లక్షల బీమా వర్తించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. దీనిని వచ్చే ఏడాది నుంచి రూ.5 లక్షలు చేసేలా కార్మికశాఖతో మాట్లాడనున్నట్టు చెప్పారు. హమాలీల యూనిఫాం కోసం 3 వేలు ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. జీరో వ్యాపారాన్ని నిరోధించండి: మార్కెట్ యార్డుల్లో జీరో వ్యాపారం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. రైతులకు తక్‌పట్టీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటే రైతుకు, మార్కెట్ కమిటీకీ ఆదాయం పెరుగుతుందన్నారు. మార్కెట్ కార్యదర్శులు ప్రతినెలా చెక్ పోస్టులు, రైసు మిల్లులను తనిఖీ చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన మార్కెట్ ఫీజుల లక్ష్యాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. తమ వేతనాలు పెంచాలంటూ సమావేశం సందర్భంగా మార్కెట్ యార్డుల్లో పనిచేసేవారు మంత్రిని కోరారు. స్పందించిన హరీశ్ మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు.