సత్వరం హమాలీల సమస్యలు పరిష్కరించండి
ఏపీ పౌరసరఫరాల సంస్థ హమాలీల సంఘం ప్రధాన కార్యదర్శి పి.శివశంకరరావు
చిలకలపూడి :
కాలయాపన చేయకుండా ఎంఎల్‌ఎస్ పాయింట్లు, గోడౌన్లలో పనిచేస్తున్న హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ పౌరసరఫరాల సంస్థ హమాలీల సంఘం ప్రధాన కార్యదర్శి పి.శివశంకరరావు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 జనవరి 1వ తేదీ నుంచి కొత్త వేతనాలు అమలు జరగాల్సి ఉందని, నేటికీ హమాలీల సంఘాలతో వేతనాల సమస్యలపై చర్చించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం హమాలీల వేతనాల అంశంపై నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. హమాలీలను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కూలీ రేట్లను క్వింటాల్‌కు రూ.12 నుంచి రూ.30కు పెంచి అరియర్స్‌ను చెల్లించాలని కోరారు. అద్దె గోడౌన్ల స్థానంలో సొంత గోడౌన్లను నిర్మించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో ఏవీఎస్‌ఎన్ మూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు బి.రమేష్, సీఐటీయూ పట్టణ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.