హమాలీల అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు
- గ్రూప్-1కు రూ. 50 వేలు, సివిల్స్‌కు ప్రిపేరయితే రూ. లక్ష
- సెక్యూరిటీ గార్డుల వేతనం రూ. 13 వేలుగా నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ యార్డుల్లో పనిచేసే హమాలీల అమ్మాయిల కోసం స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీల కార్యదర్శులతో బుధవారం మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దాంతోపాటు సెక్యూరిటీ గార్డులు, హమాలీ, దడువాయి కార్మికులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ హమాలీల ఆడపిల్లలకు ఇంటర్‌కు రూ. 2 వేలు, డిగ్రీకి రూ. 3 వేలు, పీజీకి రూ. 5 వేల చొప్పున స్కాలర్‌షిప్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గ్రూప్-1 మెయిన్స్ కోచింగ్ తీసుకునే వారికి రూ. 50 వేల సహకారం, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంటే రూ. లక్ష ఇవ్వనున్నట్టు తెలిపారు.
మార్కెట్ యార్డుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డుల వేతనాన్ని రూ. 6,700 నుంచి రూ. 13 వేలు పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. సెక్యూరిటీ గార్డులు, హమాలీ, దడువాయి, మహిళా కూలీలకు ఆరు నెలలకోసారి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని కార్యదర్శులకు సూచించారు. వారందరికీ ఈ నెల నుంచే రూ. 2 లక్షల బీమా వర్తించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. దీనిని వచ్చే ఏడాది నుంచి రూ.5 లక్షలు చేసేలా కార్మికశాఖతో మాట్లాడనున్నట్టు చెప్పారు. హమాలీల యూనిఫాం కోసం 3 వేలు ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.
జీరో వ్యాపారాన్ని నిరోధించండి:
మార్కెట్ యార్డుల్లో జీరో వ్యాపారం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. రైతులకు తక్‌పట్టీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటే రైతుకు, మార్కెట్ కమిటీకీ ఆదాయం పెరుగుతుందన్నారు. మార్కెట్ కార్యదర్శులు ప్రతినెలా చెక్ పోస్టులు, రైసు మిల్లులను తనిఖీ చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన మార్కెట్ ఫీజుల లక్ష్యాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. తమ వేతనాలు పెంచాలంటూ సమావేశం సందర్భంగా మార్కెట్ యార్డుల్లో పనిచేసేవారు మంత్రిని కోరారు. స్పందించిన హరీశ్ మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు.