handball games
-
భారత్‌లో ఆసియా హ్యాండ్‌బాల్ టోర్నీ
న్యూఢిల్లీ: ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌కు భారత్ తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 10 వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీకి కజకస్తాన్‌లోని అల్మాటీ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... మధ్య ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వేదికను తరలించారు. చాంపియన్‌షిప్‌లో భారత్‌తో పాటు ఇరాన్, దక్షిణ కొరియా, చైనా, జపాన్, కజకిస్తాన్, హాంకాంగ్, సింగపూర్ జట్లు కూడా పాల్గొననున్నాయి. ‘20వ ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్సిప్నకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. తక్కువ సమయంలో ఇందుకు అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. ఈ టోర్నీ నిర్వహణతో హ్యాండ్‌బాల్‌లో భారత్ శక్తివంతమైన క్రీడా దేశంగా ఎదిగిందనేది ప్రతిబింబిస్తుంది. తక్కువ సమయంలో ముందుకొచ్చిన భారత్... తమ ఆతిథ్యంతోనూ ఆకట్టుకుంటుందనే నమ్మకముంది’ అని ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య ప్రతినిధి అబ్దుల్లా అల్ తయ్యబ్ అన్నారు. భారత మహిళల జట్టు ఈ టోర్నీలో పాల్గొననుండటం ఇది ఎనిమిదోసారి కాగా... ఇందులో అత్యుత్తమంగా మన జట్టు 2022, 2000లో ఆరో స్థానంలో నిలిచింది. -
హ్యాండ్‌బాల్ చాంపియన్ ఆంధ్రప్రదేశ్
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌ను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం సాయంత్రం హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ 35–30 తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించింది. 40 నిమిషాల పోరులో తొలి అర్ధ భాగం ముగిసే సరికి రాజస్తాన్ 2 పాయింట్లు ముందంజలో ఉండగా... రెండో అర్ధ భాగంలో చెలరేగిన ఆంధ్రప్రదేశ్ చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పి.సత్యనారాయణరాజు ట్రోఫీలు అందజేశారు. -
హ్యాండ్‌బాల్ ఛైర్మన్‌గా జగన్ మోహన్ రావు
సాక్షి, హైదరాబాద్ : జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (హెచ్ఎఫ్ఐ) ఎన్నికల్లో తెలంగాణకు చెందిన అరిశెనపల్లి జగన్ మోహన్‌రావు విజయ దుందుభి మోగించారు. ఈనెల 18న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవగా అధ్యక్ష పదవికి జగన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లక్నో లోని హెచ్ ఎఫ్ ఐ ప్రధాన కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేశారు.జాతీయ కార్యవర్గంలోని ఇతర పదవులకు ముందు ఒకటి కంటే ఎక్కువే నామినేషన్లు పడ్డా ఎన్నికలు ఏకగ్రీవమయ్యేలా జగన్ మంత్రాంగం నడిపారు. భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి, హ్యాండ్‌బాల్ ప్రధాన కార్యదర్శి ఆనందీశ్వర్ పాండే సహకారంతో అసోసియేషన్ పై పట్టు సంపాదించిన జగన్ స్వల్ప కాలంలోనే అధ్యక్ష స్థాయికి ఎదిగారు. 2018లో క్రీడారంగంలోకి ప్రవేశం.. జగన్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని దండుమైలారం. స్వతహాగా పారిశ్రామిక వేత్త అయిన జగన్ క్రీడలపై ఆసక్తితో వాటి అభివృద్ధికి నడుం బిగించారు. 47 ఏళ్ల జగన్ 2018లో జరిగిన తెలంగాణ టీ20 లీగ్ నిర్వహణలో కీలకపాత్ర పోషించడంతో పాటు మెదక్ మేవరిక్స్ జట్టు యజమాని కూడా. ఆ టోర్నీలో మేవరిక్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆసియా హ్యాండ్ బాల్ పోటీల ద్వారా.. ఒలింపిక్ క్రీడైన హ్యాండ్‌బాల్ కార్యకలాపాల్లో 2018 నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న జగన్ మోహన్‌రావు 2019లో తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఆసియా హ్యాండ్ బాల్, ఇంటర్ డిస్ట్రిక్ట్ జాతీయ హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ వేదికగా విజయవంతంగా నిర్వహించి జాతీయ స్థాయిలో అందరి దృష్టి ఆకర్షించారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించడంతో జాతీయ ఫెడరేషన్ ఉపాధ్యక్ష పదవిని జగన్‌కు కట్టబెట్టారు. టార్గెట్ ఒలింపిక్స్‌గా పనిచేస్తాం: జగన్ ముందుగా నా మీద ప్రేమ, ఆప్యాయతలతో హ్యాండ్‌బాల్ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న 29 రాష్ట్ర సంఘాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా మీద నమ్మకం ఉంచి ఇంతటి గురుతర బాధ్యతలను అప్పగించినందుకు శక్తి వంచన లేకుండా హ్యాండ్‌బాల్ అభివృద్ధికి కృషి చేస్తా. మన దేశంలో గ్రామీణ స్థాయి నుంచి హ్యాండ్‌బాల్‌కు మంచి క్రేజ్ ఉంది. అయితే, వాణిజ్యపరంగా పోలిస్తే క్రికెట్, బ్యాడ్మింటన్ కంటే చాలా వెనకపడి ఉండటంతో ఒక లెవల్ వద్దే నిలిచిపోయింది. ఇండోర్ గేమ్ అయిన హ్యాండ్‌బాల్ మౌలికవసతుల లేమి కారణంగా మెట్రో నగరాలు మొదలు గ్రామాల వరకూ అవుట్డోర్ స్పోర్ట్‌లా మారిపోయింది. *హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త కార్యవర్గం ప్రెసిడెంట్ : అరిశెనపల్లి జగన్ మోహన్ రావు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ : డాక్టర్ ఆనందీశ్వర్ పాండే,డాక్టర్ ప్రదీప్ కుమార్ బలంచు (జార్ఖండ్) వైస్ ప్రెసిడెంట్స్ : పద్మశ్రీ సత్త్ పాల్, అమల్ నారాయణ్ పటోవని, రీనా సవీన్ జనరల్ సెక్రెటరీ : ప్రీత్ సింగ్ సలూరియా జాయింట్ సెక్రెటరీ : తేజ్ రాజ్ సింగ్, బ్రిజ్ కుమార్ శర్మ, ఎన్.కె.శర్మ, వీణా శేఖర్ ట్రెజరర్ : వినయ్ కుమార్ సింగ్ (గుజరాత్) -
హైదరాబాద్ హ్యాండ్‌బాల్ కెప్టెన్‌గా నందిత
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్ బాలికల జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా నందిత మారన్‌ను ఎంపిక చేశారు. సిద్దిపేట్‌లోని మద్దూర్‌లో నేటి నుంచి గురువారం వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. జట్టు వివరాలు: నందిత మారన్ (కెప్టెన్), హరిత, సెహరా, మేఘన, తనీషా, ఉమ, గాయత్రి, దీప, హేమలత, ఎన్. ప్రణీత, సిద్ధి, యషిక, రక్షిత, మాధవి, హంసిక, హైందవి. -
ఆసియా చాంప్ బహ్రెయిన్
హైదరాబాద్: ఆసియా క్లబ్ లీగ్ పురుషుల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో బహ్రెయిన్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వేదికగా జరిగిన ఈ అంతర్జాతీయ టోర్నీలో బహ్రెయిన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో బహ్రెయిన్ 21–16తో ఖతర్ క్లబ్‌పై విజయం సాధించింది. మొత్తం 9 దేశాలకు చెందిన 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఖతర్‌కే చెందిన అల్ అహిల్ క్లబ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. యూఏఈకి చెందిన షార్జా జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఫైనల్ అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జె. సంతోష్ కుమార్, ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహ్మద్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి బహ్రెయిన్ జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భారత హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షులు రామ సుబ్రమణి, కార్యదర్శి ఆనందేశ్వర్ పాల్గొన్నారు. -
30 నుంచి బాలికల హ్యాండ్‌బాల్ పోటీలు
హిందూపురం అర్బన్ : రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఈనెల 30 నుంచి నిర్వహిస్తున్నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బలరామిరెడ్డి, కార్యదర్శి, పీడీ ముస్తఫాకమల్బాషా, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆదేశాలతో ప్రతిష్టాత్మాకంగా నిర్వహిస్తున్న ఈపోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు హిందూపురంలోనే 15 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. సెప్టెంబరులో కర్ణాటకలోని రాణిబెంగళూరులో జరగనున్న జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.