ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 10 వరకు పోటీలు
న్యూఢిల్లీ: ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌కు భారత్ తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 10 వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీకి కజకస్తాన్‌లోని అల్మాటీ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... మధ్య ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వేదికను తరలించారు.
చాంపియన్‌షిప్‌లో భారత్‌తో పాటు ఇరాన్, దక్షిణ కొరియా, చైనా, జపాన్, కజకిస్తాన్, హాంకాంగ్, సింగపూర్ జట్లు కూడా పాల్గొననున్నాయి. ‘20వ ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌సిప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. తక్కువ సమయంలో ఇందుకు అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. ఈ టోర్నీ నిర్వహణతో హ్యాండ్‌బాల్‌లో భారత్ శక్తివంతమైన క్రీడా దేశంగా ఎదిగిందనేది ప్రతిబింబిస్తుంది.
తక్కువ సమయంలో ముందుకొచ్చిన భారత్... తమ ఆతిథ్యంతోనూ ఆకట్టుకుంటుందనే నమ్మకముంది’ అని ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య ప్రతినిధి అబ్దుల్లా అల్ తయ్యబ్ అన్నారు. భారత మహిళల జట్టు ఈ టోర్నీలో పాల్గొననుండటం ఇది ఎనిమిదోసారి కాగా... ఇందులో అత్యుత్తమంగా మన జట్టు 2022, 2000లో ఆరో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment