హిందూపురం అర్బన్ : రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఈనెల 30 నుంచి నిర్వహిస్తున్నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బలరామిరెడ్డి, కార్యదర్శి, పీడీ ముస్తఫాకమల్‌బాషా, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆదేశాలతో ప్రతిష్టాత్మాకంగా నిర్వహిస్తున్న ఈపోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు హిందూపురంలోనే 15 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. సెప్టెంబరులో కర్ణాటకలోని రాణిబెంగళూరులో జరగనున్న జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.