handicapped person
-
కళ్లూ, చేతులు పోయాయి సారూ.. అయినా కనికరించరా?
సాక్షి,పెద్దేముల్( వికారబాద్): ఆరు నెలల క్రితం ఇంటి వద్ద జరిగిన ఓ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి సర్వసం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, అధికారులు కనీసం సదరం సరిఫికెట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన తండ్రీకొడుకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పెద్దేముల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బేగరి యాదప్ప, గీత దంపతులకు ఏకైక కుమారుడు వెంకటయ్య. అనారోగ్యంతో కొంతకాలం క్రితం గీత మృతి చెందింది. దీంతో తండ్రీకొడుకు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జూలై 2021లో యాదప్ప ఇంటి వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యాదప్ప కుమారుడు వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని కళ్లూ, రెండు చేతులు పోయాయి. ఒకరి సహాయం లేనిదే బయటకు వెళ్లలేని దుర్భర స్థితి. పేలుడు పదార్థాలకు కావాల్సిన సామగ్రి స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో లభ్యం కావడంతో అప్పట్లో ఆ శాఖ అధికారులు రూ.3 లక్షల నగదు, రెండెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో రూ.1,20 లక్ష నగదు అందచేశారని, మిగతా డబ్బులు, భూమి ఇవ్వటం లేదని యాదప్ప తెలిపారు. ఈ విషయమై పలుమార్లు ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఈ విషయాన్ని ఇటీవల పెద్దేముల్‌కు వచ్చిన కలెక్టర్ నిఖిల దృష్టికి తహసీల్దార్ తీసుకెళ్లారు. పూట గడవని తమకు కనీసం పింఛన్ మంజూరు చేయాలని తండ్రీకొడుకు వేడుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్.. వారికి సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. అయినా అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు గురువారం మధ్యాహ్నం పెట్రోల్ డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఇద్దరూ ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా.. గమనించిన అక్కడున్న వారు పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఫయీమ్ఖాద్రీ వారిని సముదాయించారు. తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. తండ్రీకొడుకుకు తహసీల్దార్, ఎస్ఐ నాగరాజు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఽ సర్టిఫికెట్ ఇవ్వండి: ఎమ్మెల్యే తండ్రీకొడుకు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి, వెంటనే సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. తండ్రీకొడుకును అక్కడే ఉన్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆటోలో వికారాబాద్‌కు తరలించారు. -
మానవత్వం మోసుకెళ్లింది..
సాక్షి, వనపర్తి: మానవత్వం మరిస్తే బతుకుకర్థమే లేదు. తోటి మనిషికి సాయపడితే కలిగే సంతోషాన్ని మించిన సంపదా లేదు. ఒక మంచిపనితో ఎందరి మనసుల్లోనో చోటును ఆస్తిగా సంపాదించుకున్నాడీ వ్యక్తి. వనపర్తి మండలం చందాపూర్‌లో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్లు ఇస్తున్నారని చెప్పడంతో ఓ దివ్యాంగుడు హడావుడిగా వెళ్తూ దారిలో పడిపోయాడు. ఆ చోటునుంచి కదలలేకపోయాడు. అటుగా వెళ్తున్న మరో పింఛన్‌దారుడు గమనించి సదరు దివ్యాంగుడిని కార్యాలయం వరకు ఎత్తుకొని వెళ్లి మానవత్వాన్ని చాటాడు. బుధవారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చదవండి: ‘మిల్లెటు’ బండెక్కి వచ్చేత్తమూ.. -
దివ్యాంగ వలంటీర్ కుటుంబానికి ప్రభుత్వం అండ
సాక్షి, అమరావతి: వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగ వలంటీర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. వివరాలు.. దివ్యాంగురాలైన ఉమ్మనేని భువనేశ్వరి ప్రకాశం జిల్లా ఒంగోలులో వలంటీర్‌గా విధులు నిర్వర్తించేది. ఆర్థిక ఇబ్బందులు, చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం, సోదరి కూడా అనారోగ్యం పాలవ్వడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యింది. గతేడాది డిసెంబర్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. బాధితురాలి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరారు. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. దీనికి సంబంధించిన చెక్కును వాసిరెడ్డి పద్మ మంగళవారం భువనేశ్వరి తల్లి ఉమ్మనేని జానకికి అందించారు. -
కన్నీటితో కడుపు నింపలేక..
మందులు కొనడమనే మాట మర్చిపోయి అన్నం పెడితే చాలు అనుకునే స్థితికి వచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలనే ఆలోచన వదిలేసి ఆ పూటకు కడుపు నింపితే అదే పదివేలు అనుకుంటున్నారు. పిల్లలు పుట్టడం, వారు చక్కగా ఎదగడం.. పేదల బతుకుల్లో కనిపించే సంతోషాలివే. కానీ ఆ దంపతులకు ఈ సంతోషం కూడా మిగల్లేదు. కడుపున పుట్టిన బిడ్డ కదల్లేక మంచంపై పడి ఉంటే కనీసం చికిత్స కోసం ఆలోచన చేయలేని దుస్థితి వారిది. కూలికి ఒకరు.. బిడ్డ వద్ద కాపలాకు మరొకరుగా ఉంటూ బతుకీడుస్తున్నారు. కూలి డబ్బులతో కుటుంబం గడవడం కష్టమవుతున్న తరుణంలో బిడ్డ భవిష్యత్ కోసం చేతులు చాచి సాయం కోరుతున్నారు. శ్రీకాకుళం ఇచ్ఛాపురం మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మ దంపతులు చేస్తున్న అభ్యర్థన ఇది. సాక్షి, ఇచ్ఛాపురం : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కొఠారీ గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మలకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు మోహనరావు. కొడుకు పుట్టగానే తమకు వంశోద్ధారకుడు పుట్టాడన్న సంతోషంతో ఆ దంపతులు మురిసిపోయారు. 7వ తరగతి వరకు ఎంతో చలాకీగా ఉన్న మోహనరావు ఆ తర్వాత ఒక్కసారిగా నీరసించిపోయాడు. కాళ్లు ముందుకు పడకపోవడం, చేతుల్లో చలనం లేకపోవడంతో మంచానికే పరిమితమైపోయాడు. కూలి చేసుకుని బతికే ఆ దంపతులకు కొడుకు పరిస్థితి అర్థం కాలేదు. అప్పులు చేసి మరీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, బరంపురం ఆస్పత్రులకు తిప్పారు. అయినా ఫలితం కనిపించలేదు. రోజూ కూలి పనికి వెళ్తే గానీ వారి కడుపు నిండదు. ఇలాంటి పరిస్థితుల్లో రూ. లక్షలు ఖర్చు పెట్టి కుమారుడికి చికిత్స చేయించడం వారికి అసాధ్యమైపోయింది. ఎదిగొచ్చిన కొడుకుకు తల్లి తోయమ్మ చిన్నపిల్లాడిలా సపర్యలు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో 64 శాతం అంగ వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఉండగా,స్థానిక టీడీపీ నేతలు కేవలం వెయ్యి రూపాయలు పింఛన్ ఇప్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యాంగులకు రూ.3 వేలు అందిస్తున్నారు. అయితే తల్లిదండ్రులిద్దరూ ఒకప్పుడు కూలికి వెళ్లేవారు. కానీ మోహనరావు పరిస్థితి మారినప్పటి నుంచి ఒకరు బిడ్డ వద్ద ఉంటే మరొకరు పనికి వెళ్తున్నారు. ఒకరి కూలి డబ్బులతో కుటుంబం గడవడం, మోహనరావుకు మందులు కొనడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దంపతులు సాయం కోరు తున్నారు. బిడ్డ భవిష్యత్‌ను కాపాడడానికి దాతలు చేయూతనిస్తారని ఆశ పడుతున్నారు. సాయమందించాలనుకునే వారు 90590 67952 నంబరును సంప్రదించాలని కోరుతున్నారు. -
సీఎం జగన్ ఉదారత.. దివ్యాంగుడికి ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు కాళ్లు, చేతులు లేని ఓ దివ్యాంగుడికి సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు. అతన్ని ఆదుకునేందకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆ దివ్యాంగుడికి అందజేశారు. అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ.. లక్ష రూపాయల సాయం అడిగితే.. సీఎం రూ. 5లక్షలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. గొప్ప మానవతావాది ముఖ్యమంత్రిగా లభించడం పేదల అదృష్టం అని తెలిపారు. చదవండి : స్పందించిన సీఎం వైఎస్ జగన్ -
సమస్య వినలేకపోయారు..!
సాక్షి, చిత్తూరు : గుడిపాల మండలం నారగల్లు గ్రామానికి చెందిన రాజేంద్ర అనే రైతు (దివ్యాంగుడు) సంవత్సర కాలంగా భూసమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. పొలంలో ఉన్న తన ఇంటికి దారి సౌకర్యం కల్పించాలని మునుపటి కలెక్టర్ ప్రద్యుమ్నకు వినతి చేసుకున్నాడు. తహసీల్దార్ ద్వారా సమస్య పరిష్కరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను తహసీల్దార్ పట్టించుకోలేదని రాజేంద్ర వాపోయాడు. మంగళవారం మరోసారి కలెక్టర్‌ను కలిసి తమ సమస్య చెప్పుకుంటే పరిష్కారమవుతుందనే ఆశతో నడవలేని స్థితిలో ఉన్న అతను కుమారుడి సాయంతో కలెక్టరేట్‌కు విచ్చేశాడు. కార్యాలయ సిబ్బంది రాజేంద్రను లోనికి అనుమతించలేదు. భూ సమస్య అయితే జేసీకి చెప్పుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో పక్కనే ఉన్న జేసీ చాంబర్‌కు వెళ్లగా, అక్కడ జేసీ అందుబాటులో లేరు. మళ్లీ కలెక్టర్ చాంబర్ వద్దకు వస్తే.. సిబ్బంది నుంచి అదే మాట. ఏం చేయాలో పాలుపోక ఆయన నిరాశతో వెనుదిరిగారు. -
చేయి లేకపోయినా అధైర్యపడలేదు
శామీర్‌పేట్/మూడుచింతలపల్లి: పేదరికం, వైకల్యం అతని ఆత్మవిశ్వాసం ముందు తలవంచాయి. గిరిజన తండా నుంచి జాతీయ స్థాయి క్రీడాకారుడి దాకా అంచలంచెలుగా ఎదిగాడు. ఒంటి చేతితో విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇప్పటికే జాతీయ స్థాయిలో 3 స్వర్ణాలు, 2 రజతాలు, ఓ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ తరఫున థాయ్లాండ్లోజరగనున్న ఐవాస్ పారా వాలీబాల్ వరల్డ్ గేమ్స్‌కు ఎంపికయ్యాడు మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లింగాపూర్ తండాకు చెందిన మహేష్ నాయక్. థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు ఆర్థికపరమైన అడ్డంకులతో కొట్టుమిట్టాడుతున్నాడు. అక్కడికి వెళ్లి రావడానికి రూ.2 లక్షలు అవసరమయ్యాయి. దాతలు సాయపడితే తన ప్రతిభ చాటుతానని మహేష్ ధీమా వ్యక్తంచేస్తున్నాడు. ఆరేళ్ల వయసులోనే చేయి పోగొట్టుకుని.. మహేష్ ఆరేళ్ల ప్రాయంలో ఇంటి సజ్జపై నుంచి కిందపడటంతో చేయి విరిగింది. తల్లిదండ్రులు తండాలోని ఓ నాటు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. 3 రోజుల తర్వాత మహేష్ చేయి కదలలేనంతగా ఉబ్బిపోయింది. దీంతో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ తీసిన వైద్యులు మహేష్ చేతి ఎముక విరిగిందని, అది పూర్తిగా పాయిజన్ అయిందని చెప్పారు. మోచేయి దాకా వరకు తొలగించారు. క్రీడల్లో తనదైన ముద్ర.. చేయి లేకపోయినా మహేష్ అధైర్యపడలేదు. స్నేహితుల సాయంతో బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. కారు, ట్రాక్టర్, లారీ ఇలా వాహనమైనా అలవోకగా నడిపేవాడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు జరిగినా వెళ్లేవాడు. తండా తరఫున జట్టులో చోటు సంపాదించి ప్రతిభ చాటేవాడు. ఒంటిచేత్తో మహేష్ నాయక్ బాల్ని కొడితే బౌండరీ పడాల్సిందే. ఆ ప్రతిభతోనే మహేష్‌నాయక్ పలుమార్లు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులో పాల్గొన్నాడు. దివ్యాంగుల భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గానూ ఉన్నాడు. ఇటీవల చైనాలో జరిగిన బీచ్ వాలీబాల్‌లో పాల్గొన్నాడు. ఒలింపిక్స్‌కి చేరువలో... 2020 ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లో జరిగే ఐవాస్ వరల్డ్ గేమ్స్ వాలీబాల్‌లో మహేష్ నాయక్ చోటు దక్కించున్నాడు. అక్కడికి వెళ్లేందుకు సుమారు రూ. 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ ఐవాస్ వరల్డ్ గేమ్స్‌లో పాల్గొనేందుకు ముందుగా రూ.లక్షచెల్లించాలి. ఈ క్రీడల్లో విజయం సాధిస్తే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అవకాశం దక్కుతుందని మహేష్ నాయక్ అంటున్నాడు. దాతలు సహకరించాలి నాలుగేళ్లుగా ఐవాస్ గేమ్స్‌లో స్థానం గెలుచుకునేందుకు కష్టపడి ప్రాక్టీస్ చేశా. దాతలు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించి నన్ను ఆదుకోవాలి. పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకొస్తా. 2020 టోక్యోలో జరగబోయే పారా ఒలింపిక్స్‌లో చోటు సాధించితీరుతా. – మహేష్ నాయక్ మహేష్ బ్యాంక్ ఖాతా వివరాలు ధీరావత్ మహేష్‌నాయక్, ఖాతా నంబర్:3725657961 ఐఎఫ్ఎస్సీ కోడ్: సీబీఐఎన్ 0285029 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెల్: 96663 91002 -
చేతులు లేకున్నా కాళ్లతోనే విద్యాభ్యాసం
-
వికలాంగులపై రెచ్చిపోయిన పోలీసులు
-
వికలాంగులపై రెచ్చిపోయిన పోలీసులు
హౌరా రైల్వేస్టేషన్లో పోలీసులు తమ ప్రతాపాన్ని వికలాంగులు, భిక్షగాళ్ల మీద చూపించారు. భిక్షమెత్తుకుంటూ పొట్టపోసుకునే వికలాంగుడిపై కన్నెర్ర జేశారు. పిచ్చికుక్కను ఈడ్చినట్లు ఈడ్చేశారు. కాళ్లు లేని వాడిని కనికరించండి....అని కాళ్లా వేళ్లా పడి బతిమాలుకున్నా కనికరించలేదు. మేమింతే...మా తీరింతే అన్నట్లు రెచ్చిపోయారు. జనం కూడా ఇదేమీ తమకు పట్టదన్నట్లు రొటీన్‌గా సినిమా చూసినట్లు చూశారు. ఇంతకీ ఈ వికలాంగులు, భిక్షగాళ్లు చేసిన నేరమేంటంటే హౌరా రైల్వేస్టేషన్లో ఉండటమే. కోల్‌కతాలో రైల్వేస్టేషన్‌ను ఖాళీ చేయాలంటూ రైల్వే పోలీసులు హుకుం జారీ చేశారు. భిక్షగాళ్లను ఖాళీ చేయమంటే వాళ్లు కాస్త టైం అడిగారు.. కాళ్లుపట్టుకుని కనికరించమన్నారు. అయినా రైల్వే పోలీసులు ఏమాత్రం కనికరించలేదు. దీదీ ఇలాకాలో రెచ్చిపోయిన రైల్వే పోలీసులు ఓ అభాగ్యుడిపై తమ ప్రతాపం చూపారు. వికలాంగుడిని జట్టుపట్టుకుని తీవ్రంగా హింసించారు. ఈ విజువల్స్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. వికలాంగుడిపై పోలీసుల ప్రతాపానికి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.