
సాక్షి, చిత్తూరు : గుడిపాల మండలం నారగల్లు గ్రామానికి చెందిన రాజేంద్ర అనే రైతు (దివ్యాంగుడు) సంవత్సర కాలంగా భూసమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. పొలంలో ఉన్న తన ఇంటికి దారి సౌకర్యం కల్పించాలని మునుపటి కలెక్టర్ ప్రద్యుమ్నకు వినతి చేసుకున్నాడు. తహసీల్దార్ ద్వారా సమస్య పరిష్కరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను తహసీల్దార్ పట్టించుకోలేదని రాజేంద్ర వాపోయాడు.
మంగళవారం మరోసారి కలెక్టర్‌ను కలిసి తమ సమస్య చెప్పుకుంటే పరిష్కారమవుతుందనే ఆశతో నడవలేని స్థితిలో ఉన్న అతను కుమారుడి సాయంతో కలెక్టరేట్‌కు విచ్చేశాడు. కార్యాలయ సిబ్బంది రాజేంద్రను లోనికి అనుమతించలేదు. భూ సమస్య అయితే జేసీకి చెప్పుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో పక్కనే ఉన్న జేసీ చాంబర్‌కు వెళ్లగా, అక్కడ జేసీ అందుబాటులో లేరు. మళ్లీ కలెక్టర్ చాంబర్ వద్దకు వస్తే.. సిబ్బంది నుంచి అదే మాట. ఏం చేయాలో పాలుపోక ఆయన నిరాశతో వెనుదిరిగారు.