
సాక్షి, చిత్తూరు : బోగస్ ఓట్ల తొలగింపునకు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2020కి ముందుగానే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడానికి అవకాశం కల్పించింది. వయోజనుల కోసం నూతనంగా ఓటు నమోదు, ఇప్పటికే జాబి తాలో ఉన్న ఓటర్లకు అవసరమైతే సవరణ చేసేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇందుకోసం షెడ్యూల్ ప్రస్తుతం అమల్లో ఉంది. ఏటా అక్టోబర్‌లో ఓటు నమోదు ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మొదలు పెడుతుంది. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ ఎడాది ఒకనెల ముందుగానే ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబి తాలో తప్పులు ఉన్నా సవరణకు అవకాశం ఉంది. గత ఎన్నికల్లో గుర్తింపు కార్డు రానివారు ఇప్పుడు తీసుకొనే వీలుంది.
దరఖాస్తు చేసుకునే విధానం
తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు నమోదు కావడానికి సంబంధించిన ఫారం– 6లతో పాటు సవరణ ఫారాలు అందుబాటులో ఉన్నాయి. 2020 జనవరి 1వ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారు స్ధానిక బూత్‌స్ధాయి అధికారులను స్రంప్రదించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. స్వయంగా నమోదు చేసుకొనేందుకు సరైన ధృవీకరణపత్రాలతో ఇంటర్నెట్‌లో ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌లోనూ వివరాలు నమోదు చేసుకోవాలి.
ఇంటింటా సర్వే
సెప్టెంబర్ 1నుంచి 30వరకు బూత్‌స్ధాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ అర్హత కలిగిన వారి సర్వే నిర్వహిస్తారు. ఇంటివద్దకే వచ్చి 18సంవత్సరాలు నిండిన వారి వివరాలు నమోదు చేస్తారు. ఓటునమోదు, సవరణకు దరఖాస్తు చేసిన అభ్యర్ధుల వివరాలు బీఎల్‌ఓలు పరిశీలిస్తారు. ఈ సర్వే పూర్తిచేసిన తరువాత వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. అక్టోబర్ 15వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఈ జాబితా ప్రచురణ తరువాత మార్పులు, చేర్పులకు నవంబర్ 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యంతరాలపై చర్యలు తీసుకుంటారు. డిసెంబర్ 15లోగా కొత్తజాబితా ముద్రిస్తారు. జనవరి 1నుంచి 15లోపు తుదిజాబితా ప్రచురిస్తారు.
త్వరలో స్ధానిక ఎన్నికలు
త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ తర్వాత ఎప్పుడైనా స్ధానికసంస్ధల ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఒకనెల ముందుగానే చేపట్టారని అధికారులు అంటున్నారు. ఇది చదవండి : కొత్త ఓటర్ల నమోదు మొదలు
యువత సద్వినియోగం చేసుకోవాలి
యువత ఓటరు నమోదు అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. సవరణ ఫారా లు కూడా అందుబాటులో ఉన్నాయి.∙తప్పొప్పులు సరి చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంది.
– సురేంద్ర, తహసీల్దార్, గుడిపాల