gudipala
-
విషాదం : చికెన్ కర్రీలో మసాలకు బదులు..
సాక్షి, చిత్తూరు : వృధ్యాప్యంలో ఉన్న అమ్మమ్మ చేసిన పొరపాటు ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. చికెన్ కర్రీలో మసాల అనుకుని విష గుళికలు కలిసింది ఆ వృద్ధురాలు. విషగుళికలు కలిపిన ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గుడిపాల మండలంలోని ఏఎల్‌పురం గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులు తవణంపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన రోహిత్, జీవాగా గుర్తించారు. (చదవండి : ‘అమ్మ’మ్మలే హతమార్చారు..) వడ్డేపల్లికి చెందిన ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఊరైన ఏఎల్‌పురానికి వెళ్లారు. దీంతో వాళ్ల అమ్మమ్మ చికెన్ వండి... పిల్లలకు పెడదామని నిర్ణయించుకుంది. చికెన్ చేసే సమయంలో చికెన్ మసాలా బదులు విష గుళికలు కలిపింది. గుళికలు వేసిన చికెన్ తినడంతో ఆ ఇద్దరు బాలులు మృతి చెందారు. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. -
బోగస్ ఓట్ల ఏరివేత షురూ..!
సాక్షి, చిత్తూరు : బోగస్ ఓట్ల తొలగింపునకు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2020కి ముందుగానే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడానికి అవకాశం కల్పించింది. వయోజనుల కోసం నూతనంగా ఓటు నమోదు, ఇప్పటికే జాబి తాలో ఉన్న ఓటర్లకు అవసరమైతే సవరణ చేసేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇందుకోసం షెడ్యూల్ ప్రస్తుతం అమల్లో ఉంది. ఏటా అక్టోబర్‌లో ఓటు నమోదు ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మొదలు పెడుతుంది. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ ఎడాది ఒకనెల ముందుగానే ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబి తాలో తప్పులు ఉన్నా సవరణకు అవకాశం ఉంది. గత ఎన్నికల్లో గుర్తింపు కార్డు రానివారు ఇప్పుడు తీసుకొనే వీలుంది. దరఖాస్తు చేసుకునే విధానం తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు నమోదు కావడానికి సంబంధించిన ఫారం– 6లతో పాటు సవరణ ఫారాలు అందుబాటులో ఉన్నాయి. 2020 జనవరి 1వ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారు స్ధానిక బూత్‌స్ధాయి అధికారులను స్రంప్రదించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. స్వయంగా నమోదు చేసుకొనేందుకు సరైన ధృవీకరణపత్రాలతో ఇంటర్నెట్లో ఎన్వీఎస్పీ పోర్టల్లోనూ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇంటింటా సర్వే సెప్టెంబర్ 1నుంచి 30వరకు బూత్‌స్ధాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ అర్హత కలిగిన వారి సర్వే నిర్వహిస్తారు. ఇంటివద్దకే వచ్చి 18సంవత్సరాలు నిండిన వారి వివరాలు నమోదు చేస్తారు. ఓటునమోదు, సవరణకు దరఖాస్తు చేసిన అభ్యర్ధుల వివరాలు బీఎల్ఓలు పరిశీలిస్తారు. ఈ సర్వే పూర్తిచేసిన తరువాత వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అక్టోబర్ 15వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఈ జాబితా ప్రచురణ తరువాత మార్పులు, చేర్పులకు నవంబర్ 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యంతరాలపై చర్యలు తీసుకుంటారు. డిసెంబర్ 15లోగా కొత్తజాబితా ముద్రిస్తారు. జనవరి 1నుంచి 15లోపు తుదిజాబితా ప్రచురిస్తారు. త్వరలో స్ధానిక ఎన్నికలు త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ తర్వాత ఎప్పుడైనా స్ధానికసంస్ధల ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఒకనెల ముందుగానే చేపట్టారని అధికారులు అంటున్నారు. ఇది చదవండి : కొత్త ఓటర్ల నమోదు మొదలు యువత సద్వినియోగం చేసుకోవాలి యువత ఓటరు నమోదు అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. సవరణ ఫారా లు కూడా అందుబాటులో ఉన్నాయి.∙తప్పొప్పులు సరి చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. – సురేంద్ర, తహసీల్దార్, గుడిపాల -
సమస్య వినలేకపోయారు..!
సాక్షి, చిత్తూరు : గుడిపాల మండలం నారగల్లు గ్రామానికి చెందిన రాజేంద్ర అనే రైతు (దివ్యాంగుడు) సంవత్సర కాలంగా భూసమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. పొలంలో ఉన్న తన ఇంటికి దారి సౌకర్యం కల్పించాలని మునుపటి కలెక్టర్ ప్రద్యుమ్నకు వినతి చేసుకున్నాడు. తహసీల్దార్ ద్వారా సమస్య పరిష్కరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను తహసీల్దార్ పట్టించుకోలేదని రాజేంద్ర వాపోయాడు. మంగళవారం మరోసారి కలెక్టర్‌ను కలిసి తమ సమస్య చెప్పుకుంటే పరిష్కారమవుతుందనే ఆశతో నడవలేని స్థితిలో ఉన్న అతను కుమారుడి సాయంతో కలెక్టరేట్‌కు విచ్చేశాడు. కార్యాలయ సిబ్బంది రాజేంద్రను లోనికి అనుమతించలేదు. భూ సమస్య అయితే జేసీకి చెప్పుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో పక్కనే ఉన్న జేసీ చాంబర్‌కు వెళ్లగా, అక్కడ జేసీ అందుబాటులో లేరు. మళ్లీ కలెక్టర్ చాంబర్ వద్దకు వస్తే.. సిబ్బంది నుంచి అదే మాట. ఏం చేయాలో పాలుపోక ఆయన నిరాశతో వెనుదిరిగారు. -
సరిహద్దు ‘అక్రమాలు’
- గుడిపాల, పలమనేరు చెక్‌పోస్టుల్లో అవినీతి దందా! - రోజూ రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ అక్రమార్జన - ఏసీబీ తనిఖీలు చేసిన ప్రతిసారీ భారీగా నగదు పట్టివేత - అయినా అధికారులపై చర్యలు శూన్యం...దోపిడీ నిత్యకృత్యం పలమనేరు చెక్‌పోస్టు... 2014 జనవరి 18...ఏసీబీ తనిఖీల్లో రూ.46,390 అక్రమ సొమ్ము పట్టుబడింది. ఓ ప్రైవేటు ఏజెంట్‌ను అరెస్టు చేశారు. జూలై 27...ఏసీబీ తనిఖీల్లో రూ.70 వేలు అక్రమ సొమ్ము పట్టుబడింది. మల్లికార్జున అనే అనే ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. గుడిపాల చెక్‌పోస్టు.. 2013 డిసెంబర్ 21...ఏసీబీ తనిఖీల్లో రూ.1.26 లక్షల సొమ్ము పట్టుబడింది. అదే నెల 29వ తేదీ రూ.80 వేలు చిక్కింది. 2014 జూలై 27న రూ.41 వేలు పట్టుబడింది. సాక్షి, చిత్తూరు: చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన ప్రతిసారీ భారీ మొత్తం లో నగదు పట్టుబడుతోంది. అయినా బాధ్యులపై చర్యలు లేవు. దీంతో ‘ఆ...ఏమవుతుంది..మహా అయితే దాడులు జరిపిన రోజు కలెక్షన్ పట్టుకెళతారు. అంతకు మించి యాక్షన్ ఏముంది!’ అనే తరహాలో చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు యథేచ్ఛగా వాహనచోదకుల నుంచి ‘తమ దారి రహదారి’ అంటూ అందినకాడికి దండుకుం టూ జేబులు నింపుకుంటున్నారు. జిల్లాలోని గుడిపాల, పలమనేరు చెక్‌పోస్టులు మూడు రాష్ట్రాల రవాణా వ్యవస్థకు సరిహద్దులుగా ఉన్నాయి. దీంతో ఆంధ్ర నుంచి తమిళనాడు..కర్ణాటకు, తమిళనాడు నుంచి కర్ణాటకకు అక్రమంగా సరుకు రవాణా చేసే వాహనాలు చెక్‌పోస్టుల్లో పనిచేసే అధికారులకు కాసులవర్షం కురిపిస్తున్నాయి. పలమనేరు చెక్‌పోస్టు ఈ చెక్‌పోస్టు వద్ద రవాణా, కమర్షియల్‌ట్యాక్స్, పౌరసరఫరాలు, మార్కెటింగ్,ఎక్సైజ్‌శాఖకు సంబంధించిన అధికారులు ఉండాలి. అయితే కమర్షియల్ ట్యాక్స్, ఆర్టీవో అధికారులు చెక్‌పోస్టు పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. పౌరసరఫరాలశాఖ అధికారుల అవుట్‌పోస్టు పేరుతో మరో చోట ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారులదీ అదే పరిస్థితి. ఈ చెక్‌పోస్టు ద్వారా నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి రేషన్‌బియ్యం భారీగా రవాణా అవుతోంది. ఈ జిల్లాల నుంచి కర్ణాటకలో ని హోస్పేట్, బళ్లారి, రాయచూరు, బెంగళూరు, శివమొగ్గ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని సర్కారు సంచుల్లో నుంచి ఇతర సంచుల్లోకి మార్చి సరఫరా చేస్తున్నారు. వీటికి నకిలీ బిల్లులు సృష్టించి సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ విషయం పౌరసరఫరాలశాఖ చెక్‌పోస్టుల్లోని అధికారులకు సుస్పష్టంగా తెలుసు. బి య్యం సరఫరా లారీల డ్రైవర్లకు అధికారులు వైఖరి తెలుసు! ఎందుకంటే కొన్నేళ్లుగా ఈ రెండువర్గాల మధ్య జరుగుతున్న ‘సరిహద్దు అక్రమం’ ఇది! దీంతో లారీ సామర్థ్యం బట్టి 1500 నుంచి 2వేల వరకూ లారీ డ్రైవర్లు, చెక్‌పోస్టుల్లో ఉన్న ఏజెంటుకు సమర్పిస్తారు. ఇలా రోజుకు 20 నుంచి 30 లారీలు ఈ దారిన వెళతాయి. వీటితో పాటు రేషన్‌బియ్యాన్ని రైస్‌మిల్లుల్లో పాలిష్ చేసి సన్నబియ్యంలో కల్తీ చేసి, కర్ణాటకకు ఎగుమతి చేస్తున్నారు. ఇవి కూడా ఇదే దారిన వెళుతున్నాయి. రేషన్ బియ్యం తరలిపోతున్నాయనే విషయం పౌరసరఫరాలశాఖ అధికారులకు తెలుసు...చెక్‌పోస్టుల్లో ‘అక్రమపర్వం’ సంగతి ఆయా శాఖల ఉన్నతాధికారులకు తెలుసు! అయినా చర్యలు మాత్రం ఉండవు. ఎందుకంటే చెక్‌పోస్టుల్లోని అధికారులకు, ఆయా శాఖాధికారులకు ఉన్న సంబంధాలు అలాంటివి! గుడిపాల చెక్పోస్టులోనూ రేషన్‌బియ్యం సరఫరాది ఇదే పరిస్థితి. ఈ చెక్‌పోస్టులో రోజుకు 20 బియ్యం లారీలు వెళుతుంటాయి. అలాగే జిల్లాలో పౌరసరఫరాలశాఖ పరిధిలో పంపిణీ చేసే కిరోసిన్‌లో కార్డుదారులు 30 శాతం కూడా కొనుగోలు చేయడం లేదు. దీనికి కారణం కొన్నిప్రాంతాల్లోని రేషన్‌డీలర్లు కిరోసిన్‌కు బదులు..డబ్బులు ఇస్తున్నారు. కిరోసిన్ అధిక మొత్తానికి విక్రయించి సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ వాహనాలు కూడా చెక్‌పోస్టు అధికారుల కనుసన్నల్లోనే సరిహద్దు దాటుతాయి. స్మగ్లింగ్ గూడ్స్ ఎక్కువే చెన్నై పోర్టు నుంచి స్మగ్లింగ్ గూడ్స్ కూడా అధికంగా కర్ణాటకకు రవాణా అవుతాయి. వీటిల్లో ఎలక్ట్రానిక్స్, హోంనీడ్స్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు పలు రకాల వస్తువులు బిల్లులు లేకుండా సరఫరా అవుతాయి. ఇవి ఆంధ్రాకు కూడా దిగుమతి అవుతాయి. వీటికి సంబంధించి కూడా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు రెండు చెక్‌పోస్టుల పరిధిలో ‘గ్రీన్‌సిగ్నల్’ ఇస్తారని సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి వాహనాలు సుమారు రూ.4 వేల నుంచి రూ.5వేల వరకూ ముట్టజెబుతారని తెలుస్తోంది. అలాగే బీదర్ నుంచి పలమనేరు చెక్‌పోస్టు మీదుగా స్పిరిట్, నకి లీ మద్యం, కర్ణాటక మద్యం కూడా సరఫరా అవుతుంది. ఇది కూడా చెక్‌పోస్టు ‘ఖజానా’ను నింపుతోంది. డబ్బుల వసూలుకు ప్రతి చెక్‌పోస్టులో ముగ్గురు చొప్పున ప్రైవేటు ఏజెంట్లు ఉన్నారు. వీరు వాహనాల నుంచి డబ్బులు వసూలు చేసి అధికారులకు ఇస్తారు. వీరికి కలెక్షన్‌ను బట్టి రోజుకు రూ.500 నుంచి రూ.వెరుు్య వరకూ ఇస్తారు. చర్యలు లేకపోవడంతోనే.. గుడిపాల చెక్‌పోస్టు పరిధిలో రోజుకు రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షలు వసూలు అవుతున్నట్లు తెలుస్తోంది. పలమనేరు చెక్‌పోస్టులో సుమారు ఇదే స్థాయిలో అక్రమార్జన వస్తున్నట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అంటే నెలకు ఒక్కో చెక్‌పోస్టు నుంచి రూ.30లక్షలకు తక్కువ లేకుండా అక్రమ సంపాదన వస్తోంది. దీన్ని ప్రాధాన్యత క్రమంలో అధికారులకు పంపకాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఏసీబీ అధికారులకు కూడా సుస్పష్టంగా తెలుసు. రోజూ తనిఖీలు చేసినా...ప్రతిసారి భారీగా నగదు పట్టుబడుతోంది. అయితే పట్టుబడిన తర్వాత సంబంధిత అధికారులపై చర్యలు ఉండటం లేదు. దీంతో సిబ్బంది బెదరకుండా అక్రమార్జనకు బరి తెగిస్తున్నారు. -
గుడిపాలలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి
చిత్తూరు : అధికారం తమ చేతిలో ఉందనే అహంతో తెలుగుదేశం పార్టీ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా గుడిపాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై శనివారం టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరుగురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా బాపట్లలో రుణమాఫీపై ఆందోళనకు దిగిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలతో టీడీపీ శ్రేణులు వాగ్వివాదానికి దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.