సరిహద్దు ‘అక్రమాలు’ | Every time a major cash checks ACB Capture | Sakshi
Sakshi News home page

సరిహద్దు ‘అక్రమాలు’

Published Mon, Sep 15 2014 4:11 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

సరిహద్దు ‘అక్రమాలు’ - Sakshi

సరిహద్దు ‘అక్రమాలు’

 - గుడిపాల, పలమనేరు చెక్‌పోస్టుల్లో అవినీతి దందా!
- రోజూ రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ అక్రమార్జన
- ఏసీబీ తనిఖీలు చేసిన ప్రతిసారీ భారీగా నగదు పట్టివేత
- అయినా అధికారులపై చర్యలు శూన్యం...దోపిడీ నిత్యకృత్యం

 
 పలమనేరు చెక్‌పోస్టు... 2014 జనవరి 18...ఏసీబీ తనిఖీల్లో రూ.46,390 అక్రమ సొమ్ము పట్టుబడింది. ఓ ప్రైవేటు ఏజెంట్‌ను అరెస్టు చేశారు. జూలై 27...ఏసీబీ తనిఖీల్లో రూ.70 వేలు అక్రమ సొమ్ము పట్టుబడింది. మల్లికార్జున అనే అనే ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గుడిపాల చెక్‌పోస్టు.. 2013 డిసెంబర్ 21...ఏసీబీ తనిఖీల్లో రూ.1.26 లక్షల సొమ్ము పట్టుబడింది. అదే నెల 29వ తేదీ రూ.80 వేలు చిక్కింది. 2014 జూలై 27న రూ.41 వేలు పట్టుబడింది.
 
సాక్షి, చిత్తూరు: చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన ప్రతిసారీ భారీ మొత్తం లో నగదు పట్టుబడుతోంది. అయినా బాధ్యులపై చర్యలు లేవు. దీంతో ‘ఆ...ఏమవుతుంది..మహా అయితే దాడులు జరిపిన రోజు కలెక్షన్ పట్టుకెళతారు. అంతకు మించి యాక్షన్ ఏముంది!’ అనే తరహాలో చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు యథేచ్ఛగా వాహనచోదకుల నుంచి ‘తమ దారి రహదారి’ అంటూ అందినకాడికి దండుకుం టూ జేబులు నింపుకుంటున్నారు.
 జిల్లాలోని గుడిపాల, పలమనేరు చెక్‌పోస్టులు మూడు రాష్ట్రాల రవాణా వ్యవస్థకు సరిహద్దులుగా ఉన్నాయి. దీంతో ఆంధ్ర నుంచి తమిళనాడు..కర్ణాటకు, తమిళనాడు నుంచి కర్ణాటకకు అక్రమంగా సరుకు రవాణా చేసే వాహనాలు చెక్‌పోస్టుల్లో పనిచేసే అధికారులకు కాసులవర్షం కురిపిస్తున్నాయి.
 
పలమనేరు చెక్‌పోస్టు
ఈ చెక్‌పోస్టు వద్ద రవాణా, కమర్షియల్‌ట్యాక్స్, పౌరసరఫరాలు, మార్కెటింగ్,ఎక్సైజ్‌శాఖకు సంబంధించిన అధికారులు ఉండాలి. అయితే కమర్షియల్ ట్యాక్స్, ఆర్టీవో అధికారులు చెక్‌పోస్టు పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. పౌరసరఫరాలశాఖ అధికారుల అవుట్‌పోస్టు పేరుతో మరో చోట ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారులదీ అదే పరిస్థితి. ఈ చెక్‌పోస్టు ద్వారా నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి రేషన్‌బియ్యం భారీగా రవాణా అవుతోంది. ఈ జిల్లాల నుంచి కర్ణాటకలో ని హోస్పేట్, బళ్లారి, రాయచూరు, బెంగళూరు, శివమొగ్గ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని సర్కారు సంచుల్లో నుంచి ఇతర సంచుల్లోకి మార్చి సరఫరా చేస్తున్నారు. వీటికి నకిలీ బిల్లులు సృష్టించి సరిహద్దులు దాటిస్తున్నారు.

ఈ విషయం పౌరసరఫరాలశాఖ చెక్‌పోస్టుల్లోని అధికారులకు సుస్పష్టంగా తెలుసు. బి య్యం సరఫరా లారీల డ్రైవర్లకు అధికారులు వైఖరి తెలుసు! ఎందుకంటే కొన్నేళ్లుగా ఈ రెండువర్గాల మధ్య జరుగుతున్న ‘సరిహద్దు అక్రమం’ ఇది! దీంతో లారీ సామర్థ్యం బట్టి 1500 నుంచి 2వేల వరకూ లారీ డ్రైవర్లు, చెక్‌పోస్టుల్లో ఉన్న ఏజెంటుకు సమర్పిస్తారు. ఇలా రోజుకు 20 నుంచి 30 లారీలు ఈ దారిన వెళతాయి. వీటితో పాటు రేషన్‌బియ్యాన్ని రైస్‌మిల్లుల్లో పాలిష్ చేసి సన్నబియ్యంలో కల్తీ చేసి, కర్ణాటకకు ఎగుమతి చేస్తున్నారు. ఇవి కూడా ఇదే దారిన వెళుతున్నాయి. రేషన్ బియ్యం తరలిపోతున్నాయనే విషయం పౌరసరఫరాలశాఖ అధికారులకు తెలుసు...చెక్‌పోస్టుల్లో ‘అక్రమపర్వం’ సంగతి ఆయా శాఖల ఉన్నతాధికారులకు తెలుసు! అయినా చర్యలు మాత్రం ఉండవు.

ఎందుకంటే చెక్‌పోస్టుల్లోని అధికారులకు, ఆయా శాఖాధికారులకు ఉన్న సంబంధాలు అలాంటివి! గుడిపాల చెక్‌పోస్టులోనూ రేషన్‌బియ్యం సరఫరాది ఇదే పరిస్థితి. ఈ చెక్‌పోస్టులో రోజుకు 20 బియ్యం లారీలు వెళుతుంటాయి. అలాగే జిల్లాలో పౌరసరఫరాలశాఖ పరిధిలో పంపిణీ చేసే కిరోసిన్‌లో కార్డుదారులు 30 శాతం కూడా కొనుగోలు చేయడం లేదు. దీనికి కారణం కొన్నిప్రాంతాల్లోని రేషన్‌డీలర్లు కిరోసిన్‌కు బదులు..డబ్బులు ఇస్తున్నారు. కిరోసిన్ అధిక మొత్తానికి విక్రయించి సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ వాహనాలు కూడా చెక్‌పోస్టు అధికారుల కనుసన్నల్లోనే సరిహద్దు దాటుతాయి.
 
స్మగ్లింగ్ గూడ్స్ ఎక్కువే
చెన్నై పోర్టు నుంచి స్మగ్లింగ్ గూడ్స్ కూడా అధికంగా కర్ణాటకకు రవాణా అవుతాయి. వీటిల్లో ఎలక్ట్రానిక్స్, హోంనీడ్స్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు పలు రకాల వస్తువులు బిల్లులు లేకుండా సరఫరా అవుతాయి. ఇవి ఆంధ్రాకు కూడా దిగుమతి అవుతాయి. వీటికి సంబంధించి కూడా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు రెండు చెక్‌పోస్టుల పరిధిలో ‘గ్రీన్‌సిగ్నల్’ ఇస్తారని సిబ్బంది చెబుతున్నారు.

ఇలాంటి వాహనాలు సుమారు రూ.4 వేల నుంచి రూ.5వేల వరకూ ముట్టజెబుతారని తెలుస్తోంది. అలాగే బీదర్ నుంచి పలమనేరు చెక్‌పోస్టు మీదుగా స్పిరిట్, నకి లీ మద్యం, కర్ణాటక మద్యం కూడా సరఫరా అవుతుంది. ఇది కూడా చెక్‌పోస్టు ‘ఖజానా’ను నింపుతోంది. డబ్బుల వసూలుకు ప్రతి చెక్‌పోస్టులో ముగ్గురు చొప్పున ప్రైవేటు ఏజెంట్లు ఉన్నారు. వీరు వాహనాల నుంచి డబ్బులు వసూలు చేసి అధికారులకు ఇస్తారు. వీరికి కలెక్షన్‌ను బట్టి రోజుకు రూ.500 నుంచి రూ.వెరుు్య వరకూ ఇస్తారు.
 
చర్యలు లేకపోవడంతోనే..
గుడిపాల చెక్‌పోస్టు పరిధిలో రోజుకు రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షలు వసూలు అవుతున్నట్లు తెలుస్తోంది. పలమనేరు చెక్‌పోస్టులో సుమారు ఇదే స్థాయిలో అక్రమార్జన వస్తున్నట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అంటే నెలకు ఒక్కో చెక్‌పోస్టు నుంచి రూ.30లక్షలకు తక్కువ లేకుండా అక్రమ సంపాదన వస్తోంది. దీన్ని ప్రాధాన్యత క్రమంలో అధికారులకు పంపకాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఏసీబీ అధికారులకు కూడా సుస్పష్టంగా తెలుసు. రోజూ తనిఖీలు చేసినా...ప్రతిసారి భారీగా నగదు పట్టుబడుతోంది. అయితే పట్టుబడిన తర్వాత సంబంధిత అధికారులపై చర్యలు ఉండటం లేదు. దీంతో సిబ్బంది బెదరకుండా అక్రమార్జనకు బరి తెగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement