Hansika Motwan
-
హరర్ సినిమాతో వస్తున్న స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్.. హన్సిక. ఆమె ఇప్పుడు 'గాంధారి'గా మారి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఆర్. కన్నన్ స్వీయ దర్శకత్వం వహించడంతోపాటు మసాలా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈయన దర్శకత్వంలో, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రం విశేష ఆదరణ పొందింది. అదేవిధంగా ఇంతకు ముందు జయం కొండాన్, కండెన్ కాదలై, సేటై, ఈవెన్ తందిరన్, బిస్కోత్ వంటి పలు వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా 'గాంధారి' పేరుతో చిత్రాన్ని చేస్తున్నారు.ఇది ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కమర్షియల్ అంశాలతో కూడిన హారర్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని తాజాగా ఆయన వెల్లడించారు. ఇందులో పురావస్తు శాఖ అధికారిగా పనిచేసే యువతిగా హన్సిక నటిస్తున్నారని తెలిపారు. పురాతన కాలంలో ఓ రాజు నిర్మించిన గాంధర్వ కోటను పరిశోధించడానికి వెళ్లగా, అక్కడ ఆమెకు పలు ఆశ్చర్యకరమైన ఘటనలు ఎదురవుతాయన్నారు.ఇందులో హన్సిక పురావస్తు శాఖ అధికారిగా, ఓ ప్రాచీన తెగకు చెందిన యువతిగా దిపాత్రాభినయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం చైన్నె సముద్ర తీరంలో రూ.60 లక్షల వ్యయంతో బ్రహ్మాండమైన కొండ ఇంటి సెట్ వేసి అందులో 1943 నాటి సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఇందులో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్, ఆడుగళం నరేన్, స్టంట్ సిల్వ, వినోదిని, పవన్ కుడివేలు మురుగన్, కలైరాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 2025లో సినిమా విడుదల కానుంది. తెలుగులో కూడా గాంధారి సినిమా రిలీజ్ అవుతుంది. -
వివాదంలో హన్సిక!
తొలినాళ్లలో హన్సిక వివాదరహితురాలే. శింబుతో ప్రేమ.. తర్వాత కటీఫ్.. ఈ నేపథ్యంలోనే.. హన్సిక కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకెళితే... చెన్నయ్‌కి చెందిన ఓ క్యాబ్ కంపెనీ ప్రారంభోత్సవానికి అతిథిగా వెళ్లడానికి అంగీకారం తెలిపారు హన్సిక. హైదరాబాద్ నుంచి హన్సిక అండ్ టీమ్ చెన్నయ్ వెళ్లడానికి సదరు క్యాబ్ కంపెనీ వారు కొన్ని ఫ్లయిట్ టికెట్స్ కూడా బుక్ చేశారు. అయితే... చివరి నిమిషంలో మరో అయిదు టికెట్స్‌ని బుక్ చేయమని క్యాబ్ కంపెనీ వారిని హన్సిక రిక్వెస్ట్ చేశారట. ఆర్థిక భారం అధికమవుతుండటంతో ‘ఇక ఫ్లయిట్ టికెట్స్ తీయలేం’ అని క్యాబ్ కంపెనీవారు కరాఖండీగా చెప్పేశారట. మరి... ఈ పరిణామం హన్సికకు బాధ కలిగించిందో ఏమో.. అసలు ఓపెనింగ్‌కే ఎగనామం పెట్టేసింది. తమ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హన్సిక రాబోతున్నారని ఓ రేంజ్లో పబ్లిసిటీ చేసుకున్న ఆ సంస్థ... హన్సిక హ్యాండివ్వడంతో ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు. పైగా ఆహ్వాన పత్రికల్లో కూడా హన్సిక పేరు వేయడంతో వారు అవమానంగా కూడా ఫీలయ్యారట. ‘బాధ్యత కలిగిన సెలబ్రిటీ చేయాల్సిన పని కాదిది’ అంటూ హన్సికపై విమర్శల బాణాలను సంధించింది సదరు కంపెనీ యాజమాన్యం. అయితే... ఈ విషయంపై హన్సిక వెర్షన్ వేరేలా ఉంది. ప్రారంభోత్సవానికి హాజరవుతాననడం నిజమేనని, అయితే... తన స్టిల్స్‌ని మాత్రం సదరు కంపెనీ వారు ప్రచారానికి ఉపయోగించుకోకూడదని ముందే షరతు విధించారని సమాచారం. కానీ, దాని తాలూకు ఒప్పంద పత్రాన్ని అందజేయలేదట. అది తనకు బాధ కలిగించడంతో ఈ ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడానికి ఇష్టపడలేదట. చివరి నిమిషంలో కాకుండా, ఈ విషయాన్ని ముందే తెలియ జేశారట హన్సిక. మరి.. వీరి వాదనల్లో ఏది నిజమో వాళ్లకే తెలియాలి.