hanumantappa
-
మా కూతురును సైన్యంలో చేరుస్తా
అమర జవాను హనుమంతప్ప భార్య వెల్లడి నాగ్‌పూర్: కూతురు పెద్దయ్యాక తనను సైన్యంలో చేర్పిస్తానని అమర జవాను హనుమంతప్ప భార్య మహాదేవి తెలిపారు. లాన్స్ నాయక్ హనుమంతప్ప సియాచిన్‌లో హిమపాతం కారణంగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన మంచుకింద ఆరురోజులు చిక్కుకుపోయారు. తర్వాత గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 11న మృతిచెందారు. కాగా, తమకు కుమారుడు లేనందుకు బాధలేదని, తమ ఏకైక కుమార్తెనే పెద్దయ్యాక భారత సైన్యం లో చేర్పిస్తానని మహాదేవి పేర్కొన్నారు. అదే హనుమంతప్పకు నిజమైన నివాళి అని అన్నారు. హనుమంతప్ప తల్లి బసమ్మ, మహాదేవిలను నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ భార్య కంచన్ హనుమంతప్ప కుటుంబానికి లక్షరూపాయల చెక్‌ను అందజేశారు. ఏబీవీపీ, యువ జాగరణ్ మంచ్‌లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. -
విషమంగానే వీర జవాను
ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న ఆర్మీ ♦ కోలుకోవాలని కోరుకుంటూ హనుమంతప్ప తల్లికి సోనియా లేఖ న్యూఢిల్లీ: అత్యంత ప్రమాదకర వాతావరణ పరిస్థితులుండే సియాచిన్‌లో, మంచు చరియలు విరిగిపడటంతో, దాదాపు ఆరు రోజుల పాటు 25 అడుగుల లోతున కూరుకుపోయి, అనూహ్యంగా ప్రాణాలతో బయటపడిన సాహస జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప పరిస్థితి మరింత విషమించిందని బుధవారం సైన్యం ప్రకటించింది. ఆర్మీ హాస్పిటల్ వైద్యులతో పాటు అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) నుంచి నిపుణులైన వైద్యులు హనుమంతప్ప ప్రాణాలను కాపాడేందుకు విశేష కృషి చేస్తున్నారు. ‘మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతోంది. ఊపిరితిత్తుల్లో న్యూమోనియా ఉంది. బహుళ శరీరాంగాల వైఫల్య స్థితి కొనసాగుతోంది. పూర్తి చికిత్స అందుతున్నప్పటికీ.. పరిస్థితి ఇంకా విషమించింది’ అని బుధవారం సాయంత్రం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హనుమంతప్ప కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ జవాను తల్లికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు. కాగా, హనుమంతప్పకు మూత్రపిండం ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ మహిళ ముందుకు వచ్చింది. ‘టీవీలో ఆయన పరిస్థితి చూశాను. కిడ్నీలు, కాలేయం పనిచేయట్లేదని చెప్పారు. ఆ జవాను క్షేమం కోసం కేవలం ప్రార్థనలే కాదు.. ఇంకేదైనా చేయాలనుకున్నాను. అందుకే నా భర్త అనుమతితో హనుమంతప్పకు కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాను’ అని పడారియా తుల గ్రామానికి చెందిన నిధి పాండే తెలిపారు. హనుమంతప్ప కోలుకోవాలని ఆయన స్వరాష్ట్రం కర్ణాటక సహా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సహా పలువురు నేతలు, ప్రముఖులు హనుమంతప్ప క్షేమాన్ని కాంక్షిస్తూ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా తరతమ భేదం లేకుండా ప్రజలు పూజలు నిర్వహించారు. కర్ణాటకలోని హుబ్లిలో గల తుల్జా భవానీ దేవాలయంలో పూజలు చేశారు. అహమ్మదాబాద్, జమ్మూ, తదితరచోట్ల హోమాలు చేసి, కొవ్వొత్తులు వెలిగించారు. ఆ వీరుడికి సవాళ్లే ఇష్టం..! జమ్మూ: మంచులో కూరుకుపోయి, ప్రాణాలతో బయటపడిన వీర జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ వృత్తి జీవితం సాహసాలమయమే. మొదటి నుంచీ ఆయన శాంతియుత ప్రాంతాల్లో కాకుండా.. సమస్యాత్మక, కష్టతరమైన ప్రాంతాల్లోనే విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపేవారు. మొత్తం 13 ఏళ్ల సర్వీసులో 10 సంవత్సరాలు హనుమంతప్ప క్లిష్టమైన, సవాళ్లతో కూడిన పోస్టింగ్‌ల్లోనే పనిచేశారని, ఆ పోస్టింగ్‌లను ఆయనే స్వయంగా కోరుకునేవారని సైన్యంలోని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘కర్ణాటకకు చెందిన హనుమంతప్ప 2002 అక్టోబర్ 25న మద్రాస్ రెజిమెంట్‌లోని 19వ బెటాలియన్‌లో జవానుగా చేరాడు. ఎప్పుడూ ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా ఉండే హనుమంతప్ప తొలి నుంచీ సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో పనిచేయాలనే కోరుకునేవాడు. 2003 నుంచి 2006 వరకు జమ్మూకశ్మీర్‌లోని మాహోర్‌లో పనిచేశారు. సరిహద్దుల గుండా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవడంలో సాహసోపేతంగా పనిచేశాడు. ఆ తరువాత 54వ రాష్ట్రీయ రైఫిల్స్(మద్రాస్)లో పనిచేస్తానని ముందుకువచ్చాడు. అక్కడ 2008 నుంచి 2010 వరకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్‌లో అత్యంత చురుగ్గా పాల్గొన్నాడు. 2010 - 2012 మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాడు. అక్కడ బోడోలాండ్, అల్ఫా తీవ్రవాదులుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్స్‌లో పాల్గొన్నాడు. 2015 అక్టోబర్ నుంచి సియాచిన్ గ్లేసియర్‌లో విధుల్లో ఉన్నాడు. డిసెంబర్ 2015లో ఆయనను ఇంకా ఎత్తై పోస్ట్‌కు పంపించాలని నిర్ణయించారు. దాంతో, 19,500 అడుగుల ఎత్తై క్యాంప్‌కు వెళ్లాడు. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గంటకు 100 కిమీల వేగంతో శీతల గాలులు వీస్తుంటాయి’ అని ఆ అధికారి వివరించారు. -
సక్రమ మైనింగ్‌కు అవకాశం కల్పిస్తాం
హొస్పేట, న్యూస్‌లైన్ : మైనింగ్ స్తంబించడంతో సుమారు 80 వేల మంది కార్మికులు వీధి పాలయ్యారని, తాము సక్రమ మైనింగ్‌కు తిరిగి అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. ఆయన శుక్రవారం హొస్పేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై హనుమంతప్ప తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. అక్రమ మైనింగ్ వల్లే ప్రస్తుతం జిల్లాలో మైనింగ్ స్తంభించిపోయిందన్నారు. గుజరాత్లో గోద్రా హత్యాకాండ జరిగినప్పుడు నరేంద్ర మోడీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారని, అలాంటి వారు ప్రధాని అయితే దేశం సురక్షితంగా ఉండబోదన్నారు. విభిన్న సంస్కృతులు, పలు రకాల భాషలతో కూడిన భారతదేశాన్ని కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై హనుమంతప్ప సున్నిత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, హైకోర్టు న్యాయమూర్తిగా కూడా సేవలందించారని అలాంటి వ్యక్తి పార్లమెంట్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రాదని, శ్రీరాములు కూడా ఎంపీ కాలేరని జోష్యం పలికారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి సీఎం ఇబ్రహీం మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై హనుమంతప్పను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్, లోక్‌సభ అభ్యర్థి హనుమంతప్ప, ఎమ్మెల్యేలు అనిల్ లాడ్, తుకారాం, ప్రముఖులు కేసీ కొండయ్య, అల్లం వీరభద్రప్ప, మాజీ ఎమ్మెల్యేలు గవియప్ప, రతన్‌సింగ్, గుజ్జల జయలక్ష్మి, నందిహళ్లి హాలప్ప, ఎన్ఎం నబీ, సిరాజ్ షేక్, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ఎల్ స్వామి, అబ్దుల్ వహాబ్, దీపక్ కుమార్ సింగ్, జేఎస్ ఆంజనేయులు, కల్లుకంబ పంపాపతి, ఎన్.ప్రతాప్‌రెడ్డి, నిరంజన్ నాయుడు, గుజ్జల నాగరాజు, ఎంఎంజే హర్షవర్ధన్, బీకాం మాబుసాబ్, కేఎం హాలప్ప, అయ్యాళి తిమ్మప్ప, డీ.వెంకటరమణ, బావి బెట్టప్ప, అన్నదానరెడ్డి, దొడ్డరామణ్ణ, నగరసభ అధ్యక్షురాలు కణ్ణి ఉమాదేవి, ఉపాధ్యక్షురాలు గౌసియాబాను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సిరాజ్షేక్కు ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. -
బస్సు ఢీకొని నలుగురు దుర్మరణం
చిత్రదుర్గం, న్యూస్‌లైన్ : నగర శివారులోని సీబార వద్ద గురువారం ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బైక్‌ను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఉదయం 10 గంటల సమయంలో చిత్రదుర్గం నుంచి బైకుపై నలుగురు బెడివళ్లి గ్రామానికి వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న ఓ ప్రైవేట్ (రిపబ్లిక్) బస్సు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే నలుగురూ మృతి చెందారు. బెడివళ్లి గ్రామానికి చెందిన హనుమంతప్ప (40), అతడి భార్య మంజుళ (30), ఇద్దరు కుమార్తెలు సహన (4), పూర్ణిమ (3) చిత్రదుర్గంకు పనిమీద వచ్చి తిరిగి బైక్‌పై వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై చిత్రదుర్గం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.