విషమంగానే వీర జవాను
ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న ఆర్మీ
♦ కోలుకోవాలని కోరుకుంటూ హనుమంతప్ప తల్లికి సోనియా లేఖ
న్యూఢిల్లీ: అత్యంత ప్రమాదకర వాతావరణ పరిస్థితులుండే సియాచిన్‌లో, మంచు చరియలు విరిగిపడటంతో, దాదాపు ఆరు రోజుల పాటు 25 అడుగుల లోతున కూరుకుపోయి, అనూహ్యంగా ప్రాణాలతో బయటపడిన సాహస జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప పరిస్థితి మరింత విషమించిందని బుధవారం సైన్యం ప్రకటించింది. ఆర్మీ హాస్పిటల్ వైద్యులతో పాటు అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) నుంచి నిపుణులైన వైద్యులు హనుమంతప్ప ప్రాణాలను కాపాడేందుకు విశేష కృషి చేస్తున్నారు.
‘మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతోంది. ఊపిరితిత్తుల్లో న్యూమోనియా ఉంది. బహుళ శరీరాంగాల వైఫల్య స్థితి కొనసాగుతోంది. పూర్తి చికిత్స అందుతున్నప్పటికీ.. పరిస్థితి ఇంకా విషమించింది’ అని బుధవారం సాయంత్రం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హనుమంతప్ప కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ జవాను తల్లికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు. కాగా, హనుమంతప్పకు మూత్రపిండం ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ మహిళ ముందుకు వచ్చింది. ‘టీవీలో ఆయన పరిస్థితి చూశాను. కిడ్నీలు, కాలేయం పనిచేయట్లేదని చెప్పారు. ఆ జవాను క్షేమం కోసం కేవలం ప్రార్థనలే కాదు.. ఇంకేదైనా చేయాలనుకున్నాను.
అందుకే నా భర్త అనుమతితో హనుమంతప్పకు కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాను’ అని పడారియా తుల గ్రామానికి చెందిన నిధి పాండే తెలిపారు. హనుమంతప్ప కోలుకోవాలని ఆయన స్వరాష్ట్రం కర్ణాటక సహా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సహా పలువురు నేతలు, ప్రముఖులు హనుమంతప్ప క్షేమాన్ని కాంక్షిస్తూ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా తరతమ భేదం లేకుండా ప్రజలు పూజలు నిర్వహించారు. కర్ణాటకలోని హుబ్లిలో గల తుల్జా భవానీ దేవాలయంలో పూజలు చేశారు. అహమ్మదాబాద్, జమ్మూ, తదితరచోట్ల హోమాలు చేసి, కొవ్వొత్తులు వెలిగించారు.
ఆ వీరుడికి సవాళ్లే ఇష్టం..!
జమ్మూ: మంచులో కూరుకుపోయి, ప్రాణాలతో బయటపడిన వీర జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ వృత్తి జీవితం సాహసాలమయమే. మొదటి నుంచీ ఆయన శాంతియుత ప్రాంతాల్లో కాకుండా.. సమస్యాత్మక, కష్టతరమైన ప్రాంతాల్లోనే విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపేవారు. మొత్తం 13 ఏళ్ల సర్వీసులో 10 సంవత్సరాలు హనుమంతప్ప క్లిష్టమైన, సవాళ్లతో కూడిన పోస్టింగ్‌ల్లోనే పనిచేశారని, ఆ పోస్టింగ్‌లను ఆయనే స్వయంగా కోరుకునేవారని సైన్యంలోని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘కర్ణాటకకు చెందిన హనుమంతప్ప 2002 అక్టోబర్ 25న మద్రాస్ రెజిమెంట్‌లోని 19వ బెటాలియన్‌లో జవానుగా చేరాడు.
ఎప్పుడూ ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా ఉండే హనుమంతప్ప తొలి నుంచీ సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో పనిచేయాలనే కోరుకునేవాడు. 2003 నుంచి 2006 వరకు జమ్మూకశ్మీర్లోని మాహోర్‌లో పనిచేశారు. సరిహద్దుల గుండా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవడంలో సాహసోపేతంగా పనిచేశాడు. ఆ తరువాత 54వ రాష్ట్రీయ రైఫిల్స్(మద్రాస్)లో పనిచేస్తానని ముందుకువచ్చాడు. అక్కడ 2008 నుంచి 2010 వరకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్‌లో అత్యంత చురుగ్గా పాల్గొన్నాడు. 2010 - 2012 మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాడు. అక్కడ బోడోలాండ్, అల్ఫా తీవ్రవాదులుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్స్‌లో పాల్గొన్నాడు. 2015 అక్టోబర్ నుంచి సియాచిన్ గ్లేసియర్‌లో విధుల్లో ఉన్నాడు. డిసెంబర్ 2015లో ఆయనను ఇంకా ఎత్తై పోస్ట్‌కు పంపించాలని నిర్ణయించారు. దాంతో, 19,500 అడుగుల ఎత్తై క్యాంప్‌కు వెళ్లాడు. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గంటకు 100 కిమీల వేగంతో శీతల గాలులు వీస్తుంటాయి’ అని ఆ అధికారి వివరించారు.