దేవుని రాజ్యం కన్నీళ్లు లేని రాజ్యం
నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులు ఈస్టర్ పండుగను భక్తిపారవశ్యంతో జరుపుకొంటున్నారు. సమాధిని గెలిచిన క్రీస్తు ప్రభుని అపార శక్తిని తలచుకొంటూ ఆయన దివ్యనామాన్ని కీర్తిస్తున్నారు. యేసును మదిలో నిలుపుకుంటే ఇక కొరతేమీ లేదు అంటూ ఆనందిస్తున్నారు. ‘మరణమున్ జయించి లేచెన్ మన ప్రభువు నేడు. మహిమ దేహమున్ దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలన్ని తీర్చి జీవవరములియ్య వసుధపైని’ అంటూ పునరుత్థానుడైన క్రీస్తును కీర్తించే పాటలను పాడుతూ తరిస్తున్నారు.‘యాత్రికుని ప్రయాణము’ జాన్ బన్యన్ రచించిన ప్రసిద్ధ క్రైస్తవ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తరువాత అనేక భాషల్లోనికి అనువదితమైన పుస్తకం ఇది. ఇంగ్లండులోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో జాన్ బన్యన్ నివసించేవాడు. ఆ కాలంలోని అధికారులు, మతపెద్దలు జాన్ బన్యన్ను సుమారుగా పన్నెండేళ్లు కారాగారంలో ఉంచారు. ఆ ప్రతికూల వాతావరణంలో దేవుడు అనుగ్రహించిన దర్శనం నుంచి పుట్టిన గొప్ప రచన ‘యాత్రికుని ప్రయాణము’. ఈ రచనలో ఒక వ్యక్తి తన పాపభారం నుంచి విముక్తి పొందడానికి పరమపురి వైపు చేసే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చిత్రీకరించారు. నాశనపురం నుంచి పారిపోతున్న క్రైస్తవుణ్ణి ఒప్పించి వెనుకకు తేవడానికి పాషాణం, నవనీతం అనే ఇద్దరు మిత్రులు వెంటబడతారు. వారు చెప్పిన దానికి ఒప్పుకోవడం పోయి క్రైస్తవుడు వారినే తనతో వచ్చేయమని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. పాపభారం నుంచి విడుదల వెతుక్కుంటూ ఉన్న ఊరును కుటుంబాన్ని విడిచిపెట్టి ఏం సాధించాలని వెళ్ళిపోతున్నావని పాషాణం ప్రశ్నిస్తాడు. దానికి క్రైస్తవుడు ఇచ్చిన సమాధానం ఇది. ‘నేను అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం సంపాదించుకొనేందుకు వెళ్తున్నాను. శ్రద్ధతో వెదికేవారికి ఆ వారసత్వం దొరుకుతుందని ఈ పుస్తకంలో రాసి ఉంది.’ప్రపంచంలో కుల మత జాతి వర్గ ప్రాంతీయ భేదాలు లేకుండా మానవులు వెతుకుతున్నవి రెండు: ఈ భూమ్మీద జీవించినంత కాలం మనశ్శాంతి, చనిపోయిన తరువాత మోక్షం. ఈ విచిత్రమైన విశ్వంలో మానవునికి సాటిౖయెన సృష్టియేదియు లేదు. దేవుడు మానవునికి అత్యంత విలువైన స్థానాన్ని ఇచ్చి ఘనపరచాడు. అయితే, మానవుడు ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి, తనను సృజించిన దేవుని మీదే తిరుగుబాటు చేయగా తట్టుకో లేకపోయాడు. ప్రేమాస్వరూపి కావడంతో క్రోధంతో కాక కనికరంతో మరలా మనిషికి దగ్గరవ్వాలనే కరుణామయునిగా ఈ లోకానికి వచ్చాడు. ద్వేషించిన మానవుణ్ణి అపరిమితంగా ప్రేమించి, ప్రాణ త్యాగాన్ని చేసి రక్షించాలన్నది పరమదేవుని కోరిక.దేవుని ప్రేమను రుచిచూసిన యోహాను అనే భక్తుడు రాసిన సువార్తలో ఓ అద్భుతమైన వాక్యం ఉంది. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన్ను విశ్వసించువారు నశింపక నిత్యజీవం పొందుతారు.’ దేవుని ప్రేమను అర్థం చేసుకున్న ఒక దైవజనుడు ఇలా అంటాడు. ‘అంతులేని పాపము జలరాశుల్లో నన్ను దింపగా సిలువ రక్తము నాకై కార్చితివో, క్రయధనం నాకై చెల్లించితివో! కమ్మనైన నీదు ప్రేమ నాదు కట్లు తెంపెను. నీవు పొందిన గాయము నాకు స్వస్థత నిచ్చెను. ఏమిచ్చి ఋణం తీర్తునయ్యా యేసయ్యా? నా జీవితం అంకితం నీకే.’ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు దేశంలోని కైసరయ అనే ప్రాంతంలో పురాతత్త్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఈ ప్రదేశం మొదట ఫోనీషియన్ కాలనీగా, వాణిజ్య ప్రాంతంగా స్థిరపడింది. క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో హస్నోనియన్ పాలనలో బాగా విస్తరించబడింది. ఆ తదుపరి రోమన్లు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని దానిని స్వయం ప్రతిపత్తిగల నగరంగా ప్రకటించారు. వారి ద్వారా నియమించబడిన హేరోదు రాజు ఈ ప్రాంతాన్ని గణనీయంగా విస్తరించాడు. అతడు అక్కడ ఒక నౌకాశ్రయాన్ని నిర్మించి, ఆ పట్టణాన్ని, ఓడరేవును కైసరు అగస్టస్‌కు ౖకైసరియగా అంకితం చేశాడు. ఆ తవ్వకాలలో వారికి పిలాతు రాతి పలక లభించింది. విస్తృత పరిశోధనల తదుపరి యేసుక్రీస్తు ప్రభువునకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు అని బైబిల్లో అతని గూర్చి రాయబడిన విషయాలు వాస్తవాలని గుర్తించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన్ను విశ్వసించువారు నశింపక నిత్యజీవం పొందుతారు.పాపం చేయడం మానవ నైజం కాని, ఆ పాపమునకు తగిన శిక్ష నుండి తప్పించు ప్రభువు శరణు వేడుకొంటే తప్పక దేవుని రాజ్యాన్ని కానుకగా అందుకుంటాడు. దేవుని రాజ్యం కలతలు, కన్నీళ్ళులేని రాజ్యం.పునరుత్థానుడైన క్రీస్తును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితాలలో గొప్ప సమాధానమును అనుభవిస్తారు. దైవిక సమాధానం సమస్త జ్ఞానమునకు మించినది. సువార్తలలో పిలాతు గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. చరిత్ర కూడా ఆ విషయాలను ధ్రువీకరిస్తుంది. పిలాతు ప్రతిభ కలిగిన నాయకుడు, పాలకుడు. అతడు యూదయ ప్రాంతానికి గవర్నరుగా రోమన్ల ద్వారా నియమించబడ్డాడు. సమర్థంగా పరిపాలించడంలోను తన అధికారంతో అందరినీ అదుపులో ఉంచడంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అతడు న్యాయదృష్టి గలవాడని, ప్రజాక్షేమం ఎరిగినవాడని అంటారు. రోమన్ల టోపీల మీద ఉండే కైసరు ప్రతిమ విషయంలో యూదులకు, పిలాతుకు ఒకసారి వాదం వచ్చింది. ఎలాంటి ప్రతిమ పరిశుద్ధ పట్టణంలో కనబడకూడదని యూదులు వాదించారు. చివరకు కైసరుకు ఆ విషయాన్ని నేరుగా విన్నవించుకొని యెరూషలేములో ఉన్నంత వరకు రోమా సైనికులు వాటిని ధరించకూడదన్న తీర్పును పొందారు. మరొక సందర్భంలో యెరూషలేములో నీటి కొరతను నివారించడానికి ఓ మంచి కాలువ నిర్మిద్దామని పథకం వేశాడు. అంత పెద్ద పనికి ధనం ఎలా సమకూర్చాలి? దేవాలయం నుండి తీసుకోవాలనుకున్నాడు. యూదులు నిరాకరించారు. నీటి సరఫరా మెరుగుపడితే వాళ్ళకు కూడా ప్రయోజనం ఉన్నప్పటికీ యూదు నాయకులు ఒప్పుకోలేదు. వీధులలో ప్రదర్శనలు జరిగాయి. తిరుగుబాటు జరిగింది. అప్పుడు పిలాతు సైనికులను మారువేషాల్లో జనంలో కలిసిపోయేలా చేసి, అంతా ఆదమరచి ఉన్న సమయంలో దేవాలయ ప్రాంతంలోనే హఠాత్తుగా ఊచకోత కోయించాడు. యెరూషలేము వీధుల్లో రక్తం ఏరులై పారింది. యేసుక్రీస్తు ప్రభువుకు తీర్పు తీర్చుటకు పిలాతు వద్దకు తీసుకెళ్ళారు. ఆ దినాల్లో యూదుల పెద్దలకు ఎవ్వరికీ మరణ శిక్ష విధించే అధికారం లేదు. యేసుకు మరణశిక్ష విధించబడాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా పిలాతు ముందుకు తీసుకొచ్చారు. తనకెదురైన బాధ్యత నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. మొదటిసారి ‘మీరతనిని తీసుకొనిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడి’ అన్నాడు. రెండవసారి హేరోదు దగ్గరికి పంపివేయాలని చూశాడు. యేసును శిక్షించి ఆ దీన స్వరూపాన్ని యూదులకు చూపించి వాళ్ళ జాలిని సానుభూతిని రేకెత్తించి తప్పించుకోవాలనుకున్నాడు. బరబ్బను తీసుకొని వచ్చి వీరిద్దరిలో ఒకరిని ఎన్నుకోమనడం ద్వారా తప్పించుకోవాలని చూశాడు. చివరికి నీళ్ళు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ‘ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి’ అని చెప్పాడు. యేసుక్రీస్తునకు అన్యాయపు తీర్పు తీర్చబడినది. సిలువను భుజమున మోపి యెరూషలేము వీధుల్లో ఆయన్ను నడిపించి, చివరకు కల్వరి అనే ప్రాంతానికి తీసుకొని వచ్చి, ఆయనకు సిలువ మరణాన్ని విధించారు. ప్రస్తుత దినాల్లో యెరూషలేము సందర్శించే ప్రతి ఒక్కరూ వయా డొలోరొసా అని పిలువబడే సిలువ మార్గంలో నడుస్తారు. అందులో 14 విశిష్ట ప్రాంతాలుంటాయి. మొట్టమొదటిగా చంద్రుని మీద కాలుమోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ యెరూషలేమును దర్శించినప్పుడు క్రీస్తు సిలువబాటలో నడిచాడు. ఒకచోట కూర్చొని బిగ్గరగా ఏడ్చి ఉద్వేగానికి లోనయ్యాడు. ఎందుకు అంతగా చలించిపోయారని ఎవరో అడిగితే నీల్ ఇలా సమాధానమిచ్చాడు. ‘నేను లక్షల మైళ్ళు ప్రయాణం చేసి చంద్రునిపై కాలు మోపినప్పుడు కూడా ఇంతటి ఉద్వేగానికి లోనవలేదు గాని క్రీస్తు ప్రభువు సంచరించిన ప్రాంతాలను నా పాదాలు తాకినప్పుడు కృతజ్ఞతతో నా హృదయం నిండిపోయింది.’ఆ పరమాత్ముడైన ప్రభువు అంతటి ఘోరమైన సిలువ శ్రమను అనుభవిస్తూ కూడా సిలువపై పలికిన సుమధుర స్వరాలు మానవాళి యెడల ఆయనకున్న ప్రేమ, శ్రద్ధ, బాధ్యతను తెలియజేస్తున్నాయి. ఒక వ్యక్తి తన జీవిత చివరి క్షణంలో పలికే మాటలు చాల ముఖ్యమైనవి. యేసుక్రీస్తు తన చివరి క్షణాలలో కూడా మానవుని పట్ల తనకున్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.యేసు ‘‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. గనుక వీరిని క్షమించుము’’ అని చెప్పెను (లూకా 23:34).యేసు సిలువలో పలికిన మాట క్షమాపణ గొప్పతనాన్ని తెలియచేస్తుంది. వాస్తవానికి క్రీస్తును హింసిస్తున్న వారంతా క్షమార్హతను కోల్పోయినప్పటికీ, వారిని మనసారా క్షమించడానికి ఇష్టపడ్డారు. పిల్లలను క్షమించలేని తల్లిదండ్రులు, పెద్దలను క్షమించలేని బిడ్డలు ఉన్న ఈ ప్రపంచంలో క్షమాపణ ఔన్నత్యాన్ని క్రీస్తు తెలియచేశారు. పగలను ప్రతీకారేచ్ఛలను మనసులో ఉంచుకున్నంత కాలం మనిషి సంతోషంగా ఉండలేడని వైద్యులు చెబుతున్న సత్యం. ఎవరైనా పొరపాటున తప్పు చేస్తే వారిని క్షమించడానికి చాలా ఆలోచించే ఈ రోజుల్లో తెలిసి తెలిసి ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చి సిలువ వేస్తున్నారని తెలిసిన గొప్ప క్షమాగుణం ఆయనది. ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు (లూకా 23:43)’యేసుక్రీస్తును సిలువ వేసిన సమయంలోనే మరో ఇద్దరు వ్యక్తులను సిలువ వేశారు. వారు నేరస్థులు. ఒకతని పేరు గెట్సస్, మరొక వ్యక్తి పేరు డిస్మస్. వారి పాపం పండిన రోజు రానే వచ్చింది. ఆ సమయంలో మొదటివాడు తన తప్పుకు తాను పశ్చాత్తాప పడకుండా ఆయనను దూషిస్తూ ‘నీవు క్రీస్తువు గదా! నిన్ను నీవు రక్షించుకొని, నన్ను కూడా రక్షించు’మని హేళనగా మాట్లాడాడు. నేరానికి తగిన శిక్షను అనుభవిస్తున్నా పశ్చాత్తాపం అతనిలో లేదు. రెండోవాడు మాత్రం అతనిని వారించి, యేసువైపు చూచి ‘నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో’మని హృదయపూర్వకంగా ప్రభువు శరణు కోరినపుడు ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు’ అని దివ్య వాగ్దానం చేశారు. పాపం చేయడం మానవ నైజం కాని, ఆ పాపమునకు తగిన శిక్ష నుండి తప్పించు ప్రభువు శరణు వేడుకొంటే తప్పక దేవుని రాజ్యాన్ని కానుకగా అందుకుంటాడు. దేవుని రాజ్యం కలతలు, కన్నీళ్ళులేని రాజ్యం. ‘యేసుక్రీస్తు తన తల్లిని ఇదిగో నీ కుమారుడు అనియు, శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని పలికెను’ – (యోహాను 19:26,27). యేసుక్రీస్తు తనను నమ్ముకున్న వారిని ఏనాడూ ఒంటరిగా విడువడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అంతవరకు తల్లి ఆలనా పాలనా కుమారునిగా చూసుకున్న ప్రభువు తన తర్వాత తన బాధ్యతను శిష్యునికి అప్పగించాడు. అంతటి మరణ వేదనలో సైతం తన తల్లి గురించి ఆలోచించిన గొప్ప మనసు ఆయనది. ‘ఏలీ, ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను’– (మత్తయి 27:45).ఈ మాట అరమేయిక్ భాషలో ప్రభువు మాట్లాడెను. ఆనాటి దినాలలో యూదులు హెబ్రీ భాషతో పాటుగా అరమేయిక్ భాషను వ్యవహారిక భాషగా మాట్లాడేవారు. ప్రభువు పలికిన ఈ మాటకు ‘నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి’ అని అర్థం. మానవుని పాపములను తొలగించుటకు, శిక్షను భరించుటకు ఇల వచ్చిన ప్రభువు చేతిని తండ్రి వదిలివేసే పరిస్థితి ఎందుకొచ్చింది? పరిశుద్ధుడైన దేవుడు పాపమును ద్వేషించి పాపిని ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు. అయినా ఎందుకు తండ్రి నుండి ఎడబాటు పొందాల్సి వచ్చింది? ఆయన మన పాపములను ఆయన మీద మోసుకుంటూ పాపముగా మారినందుకే కదా! పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. ‘దప్పిగొనుచున్నాను’ (యోహాను 19:28)యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మానవునిగా అందరికీ ఉండే అనుభవాలను అనుభవించాడు. దేవుడు మాత్రమే చేయగలిగే అద్భుత కార్యాలను చేశాడు. సంపూర్ణ దేవుడుగా ఉన్న ఆయన సంపూర్ణ మానవునిగా మారి దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించాలని ఇష్టపడ్డాడు. జీవజలమును కానుకగా ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభువు దాహంలో అంత మండుటెండలో దప్పిక గొనడం ఎంత బాధాకరం! ఆ దప్పిక శారీరకమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. మానవుల రక్షణ విమోచన ఆ దప్పిక. నీవు రక్షణ పొందిన రోజు మాత్రమే ఆయన దప్పిక తీరుతుంది. ‘సమాప్తమైనది’ (యోహాను 19:28).ఇది విజయానందంతో వేసే జయకేక. ఒక వ్యక్తి తాను తలపెట్టిన కార్యమునంతా ముగించి, సాధించాక వేసే కేక. మరింతకు ఆయన ఏమి సాధించారు? అంత బిగ్గరగా విజయానంద కేక వేసేంత ఏమి జరిగింది? యేసుక్రీస్తు ఈ లోకానికి అనుకోకుండానో, ఏ కారణం లేకుండానో ఆకస్మికంగా రాలేదు. ఒక పరమార్థం కలిగి తండ్రి పని నెరవేర్చుటకు ఆయన వచ్చెను. అంతవరకు ధర్మశాస్త్రమనే కాడి కింద మగ్గిపోతున్న వారిని విడిపించుటకు, దానిని నెరవేర్చుటకు వచ్చెను. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు కాని, దానిని నెరవేర్చి మనుషులకున్న తెరను తొలగించాడు. ఆయనకు అప్పగించబడిన దైవచిత్తమును సిలువ మరణం ద్వారా నెరవేర్చి సంతోష కేక వేసారు. ‘తండ్రీ, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంటున్నాను’– (లూకా 23:46).ఆయన సిలువలో ఎంతో తీవ్రమైన వేదనను అనుభవిస్తూ, మానసికంగాను, శారీరకంగాను బాధను భరిస్తూ సిలువలో సర్వజనులను ఉద్దేశించి పలికిన చివరి మాట ‘అప్పగించుకొంటున్నాను’ మనలో ఉన్న ఆత్మ మనం చనిపోయాక దేవునికి అప్పగించుకోవాలి. ఈ లోకంలో ఎలా బతికినా, చనిపోయాక దేవుడు అంగీకరించే యోగ్యమైన రీతిలో మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మనిషి అంటే కేవలం పైకి కనబడే దేహం మాత్రమేకాదు, లోపల ఆత్మ కూడా ఉంది అని గ్రహించాలి. చనిపోయాక మట్టి నుండి తీయబడిన దేహం తిరిగి మట్టిలో కలుస్తుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరుకోవాలి. మనలో ఉన్న ఆత్మ దేవుడు అనుగ్రహించిన దానము. గనుక తిరిగి ఆయనకు అప్పగించాలి.యేసు సిలువలో చనిపోయిన తరువాత అరిమతయి యోసేపు అనే ధనికుడు యూదుల న్యాయసభ సభ్యుడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహమును ఇమ్మని అడుగుతాడు. పిలాతు అంగీకారాన్ని తెలిపిన పిమ్మట యేసు దేహాన్ని సిద్ధపరచి తన సమాధిలో ఉంచాడు. ఆ సమయంలో ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేము కూడా సహకరిస్తాడు. దుఃఖ వదనాలతో బహుశా ప్రతి ఒక్కరూ ఆ సాయంత్రం తమ గృహాలకు వెళ్ళిపోతారు. సరిగ్గా అదే సమయంలో యేసును అపరిమితంగా ద్వేషించిన యూదా పెద్దలకు ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తాను మరణాన్ని జయించి తిరిగి లేస్తానని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని పిలాతు దగ్గరకు వెళ్ళి సమాధిని కాపలా కాయుటకు కావలివారు కావాలని అడిగారు. వారు రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు. ఆదివారం ఉదయం కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చేసరికే యేసుక్రీస్తు మరణాన్ని జయించి సమాధి నుండి బయటకు వచ్చేశారు. మరణపు ముల్లు విరిచివేయబడింది. మరణపు మెడలు వంచబడ్డాయి. తరతరాలుగా మనిషిని బంధించి యుంచిన మరణం నిర్వీర్యమై పోయింది. ఆ తెరువబడిన సమాధి నుండి వారికి దూత ద్వారా వచ్చిన సందేశం ఇది. ‘మీరు భయపడకుడి. సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు.’ ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలోని యేసుక్రీస్తు ఖాళీ సమాధికి వెళ్తే ఇవే మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. క్రీస్తు పునరుత్థానం ప్రవక్తల ద్వారా ముందే ప్రవచించబడింది. తాను మరణించక మునుపు అనేకసార్లు తన పునరుత్థానం గురించి క్రీస్తు తెలియచేశాడు. పునరుత్థానుడైన క్రీస్తు తన దర్శన భాగ్యాన్ని అనేకులకు ఇచ్చాడు. ఐదువందల మందికి పైగా సజీవుడైన క్రీస్తును కన్నులారా చూశారు. ఆయన మరణంతో పాపం ఓడిపోయింది అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. ఏళ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకాలతో ఆనందించే అవకాశం కలిగింది. రోగం మీద, వ్యాధి బాధల మీద సమస్యల మీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కలిగించింది. ఇంతవరకు మానవాళి మీద çపంజాలు విసిరిన మరణం కనీవినీ ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది.సమాధికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికీ పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని, ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. నిరాశా నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశాకిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడైపోయింది. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కులమతాలకు అతీతమైనవి. ఇవి మానవ హృదయాలకు సంబంధించినది తప్ప భౌతికానుభవాలకు చెందినవి కాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికీ ఇట్టే అవగతమవుతుంది. లోక వినాశానానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం స్పష్టపరచింది.యేసుక్రీస్తు పునరుత్థానం వలన మానవులకు చేకూరిన ప్రయోజనాలు ఇవి. సమాధానం: యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి గదిలో ఉన్న ఆయన శిష్యులకు ప్రత్యక్షమై ప్రభువు పలికిన వాగ్దాన వచనం ‘సమాధానం కలుగును గాక!’ పునరుత్థానుడైన క్రీస్తును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితాలలో గొప్ప సమాధానమును అనుభవిస్తారు. దైవిక సమాధానం సమస్త జ్ఞానమునకు మించినది. భయపడకుడి: పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా పొందుకునే మరొక వాగ్దానం ‘భయపడకుడి’. లోకమంతా ఎన్నో భయాలతో నిండినది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యాలు, సమస్యలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. దేవుని మీద విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే విజయం తప్పక స్వంతం అవుతుంది.నిరీక్షణ: యేసుక్రీస్తు మొదటగా లోక పాపములను మోసుకునిపోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగి లేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్ర జీవితాన్ని, ఆయన యందలి విశ్వాసమును కొనసాగించువారికి నిత్యజీవమును అనుగ్రహించుటకు రాబోతున్నారు. ఆయన పునరుత్థానుడై యుండని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశపడతారు కాని, ప్రభువు కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. ప్రభువునందు నిరీక్షణ ఎన్నడు అవమానమునకు, సిగ్గుకు కారణము కాదు. జర్మనీలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్ లూథర్ గురించి తెలియని వారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థజీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని, సగటు మనిషి బానిసగానే ఉన్నాడని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వల్ల రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురుతిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే!ఒకరోజు మార్టిన్ లూథర్ నిరాశా నిస్పృహలతో తన ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టమనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్ ముందు నిలువబడిరది. జర్మనీలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. ‘నేను ఇప్పటికే నిరాశలో ఉన్నాను. దుఃఖంలో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిట’ని ప్రశ్నించాడు. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్. ‘నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా!’ లూథర్ కొంచెం స్వరం పెంచి అన్నాడు. కేథరిన్ లూథర్ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏ విషయానికీ బెదిరిపోడు. తుది శ్వాస వరకు నా భర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్ మాట్లాడుతుండగానే, లూథర్‌లో ఉన్న భయం పటాపంచలయ్యింది. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికి పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. దుఃఖముతో, నిరాశతో, నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశాకిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడైపోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినా, మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యసనాలు, దౌర్భాగ్యమైన శారీరక కోరికలు, పాపపు ఇచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని, పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం.