'ఆ హార్డ్ డిస్క్ లు, ఆడియో టేపులు ఇవ్వండి'
హైదరాబాద్ : ఫోరెన్సిక్ కోర్టుకు సమర్పించిన నాలుగు హార్డ్ డిస్క్‌లు, 3 ఆడియో టేపులను తమకు ఇవ్వాలని ఏసీబీ అధికారులు గురువారం కోర్టులో మెమో దాఖలు చేశారు. తదుపరి విచారణ జరిపేందుకు అవి చాలా అవసరమని ఏసీబీ అధికారులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఫోరెన్సిక్ నివేదికను కూడా ఏసీబీ తన అదనపు కౌంటర్‌తో జోడించింది. స్టీఫెన్‌సన్‌తో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సాగించిన సంభాషణలకు సంబంధించిన ఈ నివేదికలో అంశాల ఆధారంగా తాము చేపట్టదలచిన దర్యాప్తు వివరాలను ఏసీబీ హైకోర్టుకు నివేదించింది.
తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, రూ.50 లక్షలు అడ్వాన్సుగా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి రహస్యంగా చిత్రీకరించిన వీడియోలు, స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా సాగించిన బేరసారాల ఆడియో రికార్డులు బహిర్గతమయ్యాయి కూడా. రేవంత్ ఏసీబీకి పట్టుబడి దాదాపు 26 రోజులు కావస్తోంది.