ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
చెన్నై: సెల్ఫీ తీసుకోవడానికి యత్నించగా పొరపాటుగా గుంతలో పడి కళాశాల విద్యార్థి మృతిచెందాడు. ఈ విషాద ఘటన కోయంబత్తూరు సమీపంలో చోటు చేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని పీలమేడు ప్రాంతానికి చెందిన కార్పెంటర్ రవి కుమారుడు హరికిషోర్. ఇతడు అదే ప్రాంతంలోని ప్రైవేటు కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి కళాశాల సమీపంలో ఉన్న రాళ్ల క్వారీకి వెళ్లాడు. అక్కడున్న చెరువులో మిత్రులు స్నానం చేయడానికి దిగారు.
ఈత రాకపోవడంతో హరికిషోర్ అక్కడున్న రాయిపై కూర్చొన్నాడు. ఆ సమయంలో హరికిషోర్ తన సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్నాడు. తరువాత సెల్ఫీ తీసుకుంటూ ఉండగా రాయిపై నుంచి జారి గుంతలో పడ్డాడు. అందులో నీళ్లు నిండుగా ఉండడంతో మునిగిపోయి మృతి చెందాడు. సహచరులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటలు శ్రమించిన తరువాత హరికిషోర్ మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనపై పీలమేడు పోలీసులు విచారణ జరుపుతున్నారు.