Harikrishna Pentala
-
హరికృష్ణకు మూడో విజయం
సాక్షి, హైదరాబాద్: బీల్ చెస్ ఫెస్టివల్ క్లాసికల్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఖాతాలో మూడో విజయం చేరింది. రొమైన్ ఎడువార్డో (ఫ్రాన్స్)తో మంగళవారం స్విట్జర్లాండ్‌లో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 44 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆరో రౌండ్ తర్వాత హరికృష్ణ 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నేడు జరిగే ఏడో రౌండ్లో డేవిడ్ గిజారో (స్పెయిన్)తో హరికృష్ణ తలపడతాడు. -
హరికృష్ణకు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా క్లాసికల్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో విజయాన్ని సాధించాడు. స్విట్జర్లాండ్‌లో సోమవారం జరిగిన క్లాసికల్ విభాగం ఐదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 1–0తో పోలాండ్ గ్రాండ్‌మాస్టర్ రాడోస్లా ఓజాసెక్పై గెలుపొంది చాంపియన్‌షిప్ రేసులో నిలిచాడు. ఈ గేమ్‌లో నల్లపావులతో ఆడిన భారత మూడో ర్యాంక్ ప్లేయర్ 50 ఎత్తుల్లో రాడోస్లాను ఓడించాడు. క్లాసికల్ విభాగంలో ఇప్పటివరకు 3 డ్రాలు 2 విజయాలు నమోదు చేసిన హరికృష్ణ ఖాతాలో 12.5 పాయింట్లు చేరాయి. ఓవరాల్ (క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్) జాబితాలో 31.5 పాయింట్లతో రాడోస్లా అగ్రస్థానంలో ఉండగా... హరికృష్ణ 28.5 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. -
మూడో రౌండ్లో హరికృష్ణ
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్ గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ మూడో రౌండ్‌కు అర్హత పొందాడు. శనివారం వ్లాదిమర్ ఫెడోసీవ్ (రష్యా)తో జరిగిన రెండోరౌండ్ రెండో గేమ్‌ను అతను 61 ఎత్తుల్లో డ్రా చేసుకొని 1.5–0.5 పాయింట్లతో ముందంజ వేశాడు. విదిత్ గుజరాతి కూడా మూడో రౌండ్‌కు చేరాడు -
హరికృష్ణకు మూడో గెలుపు
న్యూఢిల్లీ: షెన్జెన్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ వరుసగా మూడో విజయం సాధించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం యు యాంగి (చైనా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 76 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. ఐదో రౌండ్ తర్వాత హరికృష్ణ 3.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలోకి వచ్చాడు. నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీశ్ గిరి మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. -
రన్నరప్ హరికృష్ణ
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్ర ప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఆదివారం ముగిసిన ఈ ర్యాపిడ్ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హరికృష్ణ 5.5 పాయింట్లతో లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే టైబ్రేక్ ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ముఖాముఖి పోరులో అరోనియన్‌పై హరికృష్ణ గెలిచినందుకు హరికృష్ణకు రెండో స్థానం ఖాయమైంది. అరోనియన్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఆదివారం జరిగిన మూడు గేముల్లో హరికృష్ణ రెండింటిలో గెలిచి, ఒకదాంట్లో ఓడిపోయాడు. సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో జరిగిన ఏడో గేమ్‌లో హరికృష్ణ 53 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. అయితే ఎనిమిదో గేమ్‌లో హరికృష్ణ 95 ఎత్తుల్లో అరోనియన్‌పై... చివరిదైన తొమ్మిదో గేమ్‌లో అతను 37 ఎత్తుల్లో విదిత్ (భారత్)పై గెలిచాడు. 6 పాయింట్లతో హికారు నకముర (అమెరికా) చాంపియన్‌గా నిలిచాడు. ఇతర భారత ఆటగాళ్లు విశ్వనాథన్ ఆనంద్, విదిత్, నిహాల్ సరీన్, సూర్యశేఖర గంగూలీ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. విజేత నకమురకు 10 వేల డాలర్లు (రూ. 7 లక్షల 26 వేలు), రన్నరప్ హరికృష్ణకు 5 వేల డాలర్లు (రూ. 3 లక్షల 63 వేలు), అరోనియన్‌కు 4 వేల డాలర్లు (రూ. 2 లక్షల 90 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విశ్రాంతి దినం తర్వాత మంగళ, బుధ వారాల్లో 18 రౌండ్ల బ్లిట్జ్ టోర్నీ జరుగుతుంది. -
మెరుగ్గా రాణిస్తా: హరికృష్ణ
జెనీవా (స్విట్జర్లాండ్): వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా... భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ గురువారం మొదలయ్యే జెనీవా ఫిడే గ్రాండ్‌ప్రి టోర్నీ బరిలోకి దిగనున్నాడు. 18 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్ల స్విస్ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ ఈనెల 15న ముగుస్తుంది. ‘మాస్కో టోర్నీ తర్వాత లభించిన ఖాళీ సమయంలో జెనీవా టోర్నీకి సిద్ధమయ్యాను. గతంలోకంటే మెరుగైన ప్రదర్శన చేస్తానని ఆశిస్తున్నాను’ అని హరికృష్ణ అన్నాడు.