జన హృదయూల్లో ముళ్లపూడికి చిరస్థానం
♦ హరిశ్చంద్రప్రసాద్ విగ్రహావిష్కరణలో
♦ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
తణుకు : భావితరం, యువతరంతో పాటు రాబోయే తరాలను గుర్తు చేయడానికి దివంగత పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ, పట్టణ పేదరిక నిర్మూలన, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తణుకు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రపతి రోడ్డును ఆనుకుని జెడ్పీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన ముళ్లపూడి కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు.
అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. సమాజంలో సంస్కారవంతుల్ని గౌరవించుకోవడం ద్వారా మనల్ని మనం గౌరవించుకున్నట్లేనని చెప్పారు. ముళ్లపూడి విగ్రహాన్ని ఆవిష్కరించుకుని జిల్లా ప్రజలు తమను తాము గౌరవించుకున్నారన్నారు. ఆయన వేసిన ప్రతి అడుగు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. అన్ని రంగాలపై ప్రత్యేక ముద్ర వేసుకున్న ముళ్లపూడి విలువలను వారసత్వంగా అందించారన్నారు.
స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విగ్రహ శిల్పి రాజ్‌కుమార్ వడయార్, రైతుసంఘం అధ్యక్షుడు బొల్లిన విశ్వనాధంలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బులిరామయ్య, ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, పులపర్తి రామాంజనేయులు, వేటుకూరి శివరామరాజు, మునిసిపల్ చైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బసవా రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యులు ఆత్మకూరి బులిదొరరాజు, మునిసిపల్ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా, మునిసిపల్ మాజీ చైర్మన్ ముళ్లపూడి రేణుక, ఆంధ్రాసుగర్స్ ఎండీ పెండ్యాల నరేంద్రనాథ్‌చౌదరి, మాజీ ఎమ్మెల్సీ, జేఎండీ ముళ్లపూడి నరేంద్రనాథ్, జేఎండీలు ముళ్లపూడి తిమ్మరాజా, పెండ్యాల అచ్యుతరామయ్య, వార్డు కౌన్సిలర్ మల్లిన రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.