harishchandra
-
స్పూర్తిదాయకమైన కథ.. 'బాతు–కొంగ యుద్ధం!'
విశ్వామిత్రుడి కారణంగా హరిశ్చంద్రుడు రాజ్యభ్రష్టుడై అష్టకష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడినా సత్యసంధతను వదులుకోని హరిశ్చంద్రుడిని చూసి దేవతలు నివ్వెరపోయారు. ఆయనను స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. ధర్మప్రభువైన హరిశ్చంద్రుడు దేవతల కోరికను వెంటనే మన్నించలేదు. తనతో పాటు తన అయోధ్యానగర పౌరులందరికీ స్వర్గవాసం కల్పిస్తేనే వస్తానన్నాడు. హరిశ్చంద్రుడి కోరికను దేవేంద్రుడు మన్నించాడు. వేలాది విమానాలను రప్పించి, హరిశ్చంద్రుడితో పాటు అయోధ్య వాసులందరినీ స్వర్గానికి తరలించుకుపోయాడు. హరిశ్చంద్రుడి స్వర్గారోహణం చూసి దైత్యగురువు శుక్రాచార్యుడు చకితుడయ్యాడు. ‘హరిశ్చంద్రుడిలాంటి ప్రభువు ముల్లోకాల్లోనూ మరొకరు లేరు. తన త్యాగంతో, దానంతో మహాపుణ్యాన్ని ఆర్జించి, తన పౌరులను కూడా స్వర్గానికి తీసుకుపోయాడంటే అతడిది ఎంతటి త్యాగనిరతి! హరిశ్చంద్రుడి వంటి రాజు ఇంకెవడుంటాడు?’ అని శ్లాఘించాడు. హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్లిన తర్వాత, అప్పటికి పన్నెండేళ్లుగా గంగా నదిలో మెడలోతు వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేసుకుంటూ ఉన్న వశిష్ఠుడు తన తపస్సును చాలించి బయటకు వచ్చాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుడికి కులగురువు. తన శిష్యుడైన హరిశ్చంద్రుడి యోగక్షేమాలు తెలుసుకోవడానికి నేరుగా అయోధ్యకు వెళ్లాడు. అక్కడి జనాల ద్వారా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని పెట్టిన బాధలను తెలుసుకుని, అమిత ఆగ్రహం చెందాడు. ‘ఈ విశ్వామిత్రుడు ఎంతటి దుర్మార్గుడు! పూర్వం నా వందమంది కొడుకులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. అప్పుడు కూడా అంత కోపం రాలేదు. సత్యధర్మ నిబద్ధుడైన హరిశ్చంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేసినందుకు మాత్రం నాకు పట్టరాని కోపం వస్తోంది’ అనుకున్నాడు వశిష్ఠుడు. ఎంత నియంత్రించుకోవాలనుకున్నా కోపం తగ్గకపోవడంతో వశిష్ఠుడు ‘దుర్మార్గుడు, బ్రహ్మద్వేషి, క్రూరుడు, మూర్ఖుడు, యజ్ఞవినాశకుడు అయిన విశ్వామిత్రుడు కొంగ రూపాన్ని పొందుగాక’ అని శపించాడు. వశిష్ఠుడి శాపాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘నన్ను శపించ సాహసించిన వశిష్ఠుడు బాతు రూపం పొందుగాక’ అని ప్రతిశాపం ఇచ్చాడు. పరస్పర శాపాల కారణంగా విశ్వామిత్రుడు కొంగగా, వశిష్ఠుడు బాతుగా మారిపోయారు. వారి రూపాలు సామాన్యమైన కొంగ, బాతుల మాదిరిగా లేవు. కొంగ మూడువేల యోజనాల పొడవు ఉంటే, బాతు రెండు వేల యోజనాల పొడవు ఉంది. భీకరమైన కొంగ, బాతు రూపాలు పొందిన విశ్వామిత్ర, వశిష్ఠులు పరస్పరం తారసపడ్డారు. పూర్వవైరం ఇంకా చల్లారని వారిద్దరూ యుద్ధానికి తలపడ్డారు. బాతు, కొంగల రూపాల్లో వారు హోరాహోరీగా పోరు సాగిస్తుంటే, వారి ధాటికి మహావృక్షాలు నేలకూలాయి. పర్వతాల నుంచి గిరిశిఖరాలు నేల మీదకు దొర్లిపడ్డాయి. భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలంగా మారి హోరెత్తాయి. భీకరమైన బాతు, కొంగల కాళ్ల కిందపడి ఎన్నో జీవులు మరణించాయి. ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నా అవేమీ పట్టకుండా బాతు కొంగల రూపాల్లో వశిష్ఠ విశ్వామిత్రులు హోరాహోరీగా రోజుల తరబడి పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి యుద్ధానికి దేవతలు కూడా భీతిల్లారు. అందరూ బ్రహ్మదేవుడి వద్దకు పరుగులు తీశారు. ‘ఓ విధాతా! వశిష్ఠ విశ్వామిత్రులు పరస్పర శాపాలతో బాతు కొంగ రూపాలు పొంది భూమ్మీద పోరు సాగిస్తున్నారు. వారి యుద్ధంలో ఇప్పటికే ఎన్నో జీవులు మరణించాయి. ప్రకృతి అల్లకల్లోలంగా ఉంది. వారి యుద్ధాన్ని నివారించకుంటే, భూమ్మీద ప్రళయం వచ్చేలా ఉంది. వారి పోరును నువ్వే అరికట్టాలి. భూలోకానికి పెను విపత్తును తప్పించాలి’ అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు దేవతలందరితోనూ కలసి భూమ్మీద పోరు జరుగుతున్న చోటుకు హుటాహుటిన వచ్చాడు. ‘వశిష్ఠ విశ్వామిత్రులారా! ఏమిటీ మూర్ఖత్వం? తక్షణమే యుద్ధాన్ని ఆపండి’ ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. బాతు కొంగ రూపాల్లో ఉన్న వారిద్దరూ బ్రహ్మదేవుడి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, మరింత ఘోరంగా యుద్ధం చేయసాగారు. ‘ఇప్పటికే మీ వల్ల ఎంతో అనవసర ప్రాణనష్టం జరిగింది. బుద్ధి తెచ్చుకుని యుద్ధాన్ని మానుకోండి’ మరోసారి హెచ్చరించాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠ విశ్వామిత్రులు అప్పటికీ అతడి మాటలను పట్టించుకోకుండా యుద్ధాన్ని కొనసాగించారు. చివరకు బ్రహ్మదేవుడు తన శక్తితో వారిద్దరి తామస గుణాన్ని హరించాడు. వశిష్ఠ విశ్వామిత్రులు పూర్వరూపాల్లోకి వచ్చారు. బ్రహ్మదేవుడి వద్ద చేతులు జోడించి నిలుచున్నారు. ‘వశిష్ఠా! విశ్వామిత్రుడి తప్పేమీ లేదు. హరిశ్చంద్రుడి ధర్మనిరతిని లోకానికి చాటడానికే అతణ్ణి పరీక్షలకు గురిచేసి, స్వర్గానికి పంపించాడు. నువ్వు అదేదీ గ్రహించకుండా అతణ్ణి శపించావు. ఈ విశ్వామిత్రుడు కూడా కోపాన్ని అణచుకోలేక నిన్ను శపించాడు. మీ వల్ల ఎంతో అనర్థం జరిగింది. ఇకనైనా తామస గుణాన్ని విడనాడి, శాంతం వహించండి. మీ వంటి మహర్షులకు తామసం తగదు’ అని బ్రహ్మదేవుడు హితవు పలికాడు. బ్రహ్మదేవుడి మాటలకు వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ సిగ్గుపడ్డారు. పరస్పరం క్షమాపణలు చెప్పుకుని, ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఈ దృశ్యం చూసి దేవతలంతా సంతోషించారు. బ్రహ్మదేవుడితో కలసి అక్కడి నుంచి సంతృప్తిగా నిష్క్రమించారు. — సాంఖ్యాయన ఇవి చదవండి: నా స్టూడెంట్ టీచర్ అయింది! -
ఆ ఇల్లే ..రంగస్థలం
దేవీ...! కష్టములెట్లున్నను పుణ్య క్షేత్రమైన వారణాసిని దర్శించితిమి చూడు..,రాజే కింకరుడగున్–కింకరుడే రాజగున్ కాలానుకూలంబుగా.., ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే..,మహాకవి గుఱజాషువా,బలిజేపల్లి లక్ష్మీకాంతం కవుల కలాల నుంచి జాలువారిన మహాకావ్యంసత్య హరిశ్చంద్ర నాటకంలోని జనాదరణ పొందిన పద్యాలివి. ప్రకాశం : సత్యహరిశ్చంద్ర వేషంలో ఆయన స్టేజి ఎక్కి పద్యం అందుకుంటే చాలు ప్రేక్షకులు ఒళ్లంతా చెవులు చేసుకుని వినేవారు. వన్స్‌మోర్ అంటూ మళ్లీ మళ్లీ పాడించుకునే వారు. సత్యహరిశ్చంద్ర పాత్రలో అంతగా ఒదిగిపోయినఆ రంగస్థల దిగ్గజమే వేటపాలేనికి చెందిన దుబ్బు వెంకట సుబ్బారావు. ఈయనను ప్రేక్షకులు ముద్దుగా డీవీ అని పిలుస్తుంటారు. తన గాత్రం, అభినయంతో ఎందరో కళాభిమానుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. జీవితాంతం హరిశ్చంద్ర వేషం వేస్తూ హరిశ్చంద్ర అంటే డీవీ అన్న పేరు పొందారు. ఆయన తదనంతరం కుమారుడు, ఆ తర్వాత మనవడు కూడా ఇదే పాత్రను పోషిస్తూ కళా రంగంలో రాణిస్తున్నారు. జూనియర్ డీవీగా (డీవీ మనుమడు) పేరొందిన దుబ్బు వెంకట సుబ్బారావు తన రెండు దశాబ్దాల నట ప్రస్థానంలోదేశ వ్యాప్తంగా దాదాపు ఐదు వేల ప్రదర్శనలిచ్చి ప్రేక్షకులను అలరించారు. వేటపాలెం మండలం ఆణుమల్లిపేటకు చెందిన డీవీ సుబ్బారావు(సీనియర్) పాడిన హరిశ్చంద్ర పద్యాలు, పాటలు అప్పట్లోనే గ్రామ్‌ఫోన్ రికార్డులుగా వచ్చాయి. 1970 దశకంలో అభిమానులు ఆయన చేతికి స్వర్ణ కంకణం తొడిగారు. ఆంధ్రా తాన్సేన్, కలియుగ హరిశ్చంద్ర, మధురగాన విశారద బిరుదులు, సన్మానాలు పొందారు సీనియర్ డీవీ. ఆయన మరణానంతరం అదే బాటలో కుమారుడు సుబ్బయ్య సత్యహరిశ్చంద్ర పాత్రను పోషించి మెప్పించారు. సుబ్బయ్య కుమారుడు డీవీ సుబ్బారావు(జూనియర్) తన పదకొండో ఏటనే తాతను స్ఫూర్తిగా తీసుకుని రంగస్థలంపై వేషం వేశారు. వేలాది ప్రదర్శనలతో కళాభిమానులను అలరిస్తూ.. కళాకారులు, పెద్దలతో ప్రశంసలు అందుకుంటున్నారు. డీవీ సుబ్బారావు(జూనియర్) దాదాపుగా పదిహేడేళ్లుగా సత్య హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడిగా నటిస్తున్నారు. ఇంత వరకు 5 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అర్జునుడు, కృష్ణుడు తదితర పౌరాణిక పాత్రలతోపాటు చింతామణిలో భవానిగా నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతోపాటు బరంపురం, విజయవాడ, తిరుపతి, తాడేపల్లిగూడెం, తణుకు, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లోనూ నాటకాలు వేశారు. పలువురి ప్రశంసలు ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాదు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, దివంగత మంగళంపల్లి బాలమురళీకష్ణ ఇంకా ఎందరో రాజకీయ నాయకులు, పెద్దల నుంచి జూనియర్ డీవీ ప్రశంసలు అందుకున్నారు. సినీ గాయకులు మనో జూనియర్ డీవీ, తండ్రి సుబ్బయ్యలతో కలిసి పలుమార్లు పద్యాలు పాడటం విశేషం. జూనియర్ డీవీ తన విశేష నటనా ప్రతిభకు గుర్తింపుగా బాల గంధర్వ నాటక కళానిధి, యువ నాటక గాన సుధానిధి బిరుదులు పొందారు. ఫిరంగిపురం, జంగారెడ్డిగూడెం, ఏటుకూరు ప్రాంతాల్లో హరిశ్చంద్ర నాటకంలో ఆయన నటనకు ముగ్ధులైన కళాభిమానులు సువర్ణ కంకణాలు బహూకరించారు. తాతపై తనకున్న అపార ప్రేమకు చిహ్నంగా వేటపాలెం మండలం రామన్నపేటలోని తన నివాసంలో ఇటీవల సీనియర్ డీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నటించాలని తనకున్నా చూసేవారు కరువవుతున్నారని జూనియర్ డీవీ ఆవేదన వెలిబుచ్చారు. వెండితెర, బుల్లితెర ప్రభావంతో నాటకాల ప్రాభవం తగ్గిందని, ప్రభుత్వం నాటకరంగాన్ని, కళామతల్లిని నమ్మకున్న రంగస్థల నటులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. వేటపాలెం: తొలిజాము నుంచి సంధ్యవేళ వరకు పంట చేలో పనిచేసి అలసిన అన్నదాతలకు.. కుల వృత్తులు, కుటీర పరిశ్రమల్లో చెమటోడ్చిన దేహాలకు.. సాంత్వన చేకూర్చేందుకు, కాలక్షేపానికి దివ్యౌషధం నాటకం. పదిహేనేళ్ల క్రితం వరకు రంగస్థలం, రంగస్థల కళాకారుల క్రేజ్ మాటల్లో వర్ణించలేం! అలాంటి కళాకారుల్లో డీవీ సుబ్బారావు(సీనియర్) ముందు వరుసలో ఉంటారు. ఆయన తనయుడు డీవీ సుబ్బయ్య, సుబ్బయ్య కుమారుడు డీవీ సుబ్బారావు(డీవీ సుబ్బారావు) తమ గాత్రంతో పద్యాలాపన చేసి ప్రేక్షకలోకాన్ని మెప్పించారు. డీవీ కుటుంబంలో మూడు తరాలు రంగ స్థలంపై చెరగని ముద్ర వేశారు. -
మాజీ పోలీసు అధికారి ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్: మాజీ పోలీసు ఉన్నతాధికారి ఇంట్లో దొంగలు పడ్డారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉండే రిటైర్డు అడిషనల్ ఎస్పీ హరీష్చంద్ర కుటుంబసభ్యులతో సహా ఊరికెళ్లారు. ఇదే అదనుగా ఇంట్లోకి చొరబడిన దుండగులు 30 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, చీరలు దోచుకెళ్లినట్టు సమాచారం. గురువారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హరీష్ చంద్రకు సమాచారం అందించారు. బాధితులు వస్తేనే ఎంత సొత్తు చోరీ జరిగిందో తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.