చేదుగా మారుతున్న 'రసగుల్లా'..!
రసగుల్లా కథ కంచికి చేరేట్టు కనిపించడం లేదు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య మొదలైన 'రస'వత్తరమైన చర్చకు తెరపడటం లేదు. రసగుల్లా వంటకం మాదంటే మాదంటూ.. పేటెంట్ కోసం రెండు రాష్ట్రాల గొడవలు ముదిరి రసకందాయంలో పడ్డాయి. న్యాయ నిర్ణేతగా తమిళనాడుకు బాధ్యతలు అప్పగించినా... విషయం తేలేట్టు కనిపించడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ మినిస్టర్ డాక్యుమెంటరీలున్నాయంటూ వాదన లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది.
భారత దేశానికి తూర్పుభాగంలో ప్రసిద్ధి చెందిన తియ్యని పంచదార వంటకం.. ఇప్పుడు రెండు రాష్ట్రాలమధ్య చేదుగా మారింది. రసగుల్లా పూరిలో పుట్టిందని ఒడిశా... కోల్ కతాలో పుట్టిందని పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కొన్నాళ్ళుగా కొట్టుకుంటున్నాయి. పేటెంట్ హక్కులు తమకే కావాలంటూ ఇరు రాష్ట్రాలూ పోటీ పడుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ మంత్రి మళ్ళీ రసగుల్లాకు తామే యజమానులమనడం తగవుకు దారితీసింది. రసగుల్లా బెంగాల్ దేనని నిరూపించడానికి తమ వద్ద పుష్కలంగా ఆధారాలు (డాక్యుమెంటరీలు) ఉన్నాయని మంత్రి రబిరంజన్ చటోపాధ్యాయ అనడం మళ్ళీ మొదటికొచ్చింది.
రసగొల్లాగా పిలిచే... గుండ్రని తీపి పదార్థం కేవలం బెంగాల్ కు చెందినదేనని, ఒడిషా ఆరు వందల ఏళ్ళక్రితం తమ రాష్ట్రంలో పుట్టిందని చెప్పినా తగిన.. ఆధారాలు (డాక్యుమెంటరీలను) చూపించ లేకపోయిందని వెస్ట్ బెంగాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అంటున్నారు. అయితే పంచదార పాకాన్ని ఆరు వందల ఏళ్ళక్రితమే తమ రాష్ట్రం కనుగొందని, దీనిపై నిర్థారణకోసం ఒడిశా ప్రభుత్వం మూడు కమిటీలను కూడ వేసిందని ఒడిశా మంత్రి ఇటీవల తెలిపారు. అంతేకాదు తమ రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయంలో మొదటిసారి 12వ శతాబ్దంలోనే ఈ స్వీట్ వడ్డించినట్లుగా ఆధారాలున్నాయని, బెంగాల్ చూపించే ఆధారాలు 150 ఏళ్ళ క్రితం వేనని అంటున్నారు.
కాగా బెంగాల్ ప్రభుత్వం ఈ రుచికరమైన వంటకం తమదేనంటూ తాజాగా ఓ అప్లికేషన్ సమర్పించడంతోపాటు, దానికి సంబంధించిన వివరణాత్మక పత్రాలను కూడ అందజేసినట్లు బెంగాల్ మినిస్టర్ చెప్పారు.