డిసెంబర్ నాటికి రూ.9.5 లక్షల కోట్ల పన్ను వసూళ్లు..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015 -16) ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో రూ.9.5 లక్షల కోట్ల పన్నులను వసూలు చేసింది. ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న మొత్తంలో ఇది 66 శాతం. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు మొత్తం కలిసి రూ.14.45 లక్షల కోట్లు వసూళ్లు కావాలన్నది 2015-16 బడ్జెట్ లక్ష్యం. ప్రత్యక్ష పన్నుల ద్వారా వసూళ్ల లక్ష్యం రూ.7.97 లక్షల కోట్లు కాగా... పరోక్ష పన్నుల ద్వారా వసూళ్ల లక్ష్యం రూ.6.47 లక్షల కోట్లు.
నల్లధనం వెల్లడి స్కీమ్ ద్వారా రూ.2,428 కోట్లు
నల్లధనం వెల్లడి పథకం కింద చెల్లింపుల చివరితేదీ అయిన డిసెంబర్ 31 వరకూ రూ.2,428 కోట్లు వసూళ్లు చేసినట్లు రెవెన్యూ కార్యదర్శి హాస్ముఖ్ ఆదియా ట్వీట్ చేశారు. ఈ ఆఫర్ కింద దాదాపు రూ.4,164 కోట్ల నల్లధనం మొత్తాల వివరాలను ఆయా వ్యక్తులు వెల్లడించారు.