హజ్ యాత్రికులకు సేవ దైవసేవతో సమానం
ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా
ఆనందపేట: హజ్ యాత్రికులకు సేవ చేయడం దైవసేవతో సమానం అని ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అన్నారు. హజ్ పిలిగ్రిమ్స్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ స్డేడియం వద్ద ఉన్న అంజుమన్ షాదీఖానాలో శనివారం జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా జిల్లాలో హజ్ యాత్రికులకు సేవ చేస్తున్న హజ్ పిలిగ్రీమ్స్ సర్వీస్ సొసైటీ కార్యవర్గాన్ని అభినందించారు. సొసైటీ అధ్యక్షుడు హజీ మహమ్మద్ రఫీ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ షరీఫ్ శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడుతూ హజ్ యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. హజ్ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియామాలు, హజ్ చేసే విధానం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా యాత్రికులకు వివరించారు. శిక్షణ తరగతులకు హాజరైన వారికి భోజన సదుపాయాలు కల్పించారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ మోమిన్ అహమద్ హుసేన్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్, సభ్యుడు హసన్ బాషా, ముఫ్తి జావీద్, ముఫ్తి రవూఫ్, ముఫ్తి ఫారూఖ్, సొసైటీ కార్యదర్శి రిజ్వాన్, సహాయ కార్యదర్శి బషీర్ అహమ్మద్, మీర్జా గఫ్పార్ బేగ్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.